
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) మరిన్ని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం అత్యాధునిక వసతులతో డయాగ్నొస్టిక్ సెంటర్లను నెలకొల్పాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.37.45 కోట్లు కేటాయించింది. ఆ నిధులను ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి మంజూరు చేయనుంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.5 లక్షల చొప్పున కేటాయించనున్నారు. మొత్తంగా 644 పీహెచ్‌సీలు, 41 సీహెచ్‌సీల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పుతారు. పీహెచ్‌సీల్లో ప్రస్తుతం కొన్ని పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు.
డయాగ్నొస్టిక్ సెంటర్లను నెలకొల్పాక పీహెచ్‌సీల్లో 20 రకాలు, సీహెచ్‌సీల్లో 39 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈఎస్‌ఆర్, బ్లడ్ షుగర్, హెచ్‌ఐవీ, మలేరియా రాపిడ్, యూరిన్ షుగర్, ప్లేట్‌లెట్ కౌంట్, డెంగీ రాఫిడ్, వాటర్ క్వాలిటీ తదితర పరీక్షలను పీహెచ్‌సీల్లో నిర్వహిస్తారు. ఇక సీహెచ్‌సీల్లో పై వాటితోపాటు ఎక్స్‌రే, ఎస్ క్రియాటిన్, సీబీసీ, ఈసీజీ, కొలెస్ట్రాల్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసం సెమీ ఆటో ఎనలైజర్, హెమటాలజీ ఎనలైజర్, మైక్రోస్కోప్, సెంట్రిఫ్యూజ్ వంటి పరికరాలను కొనుగోలు చేస్తారు. రిఫ్రిజిరేటర్, బార్‌కోడ్ ప్రింటర్ అండ్ స్కానర్, కంప్యూటర్ అండ్ ప్రింటర్‌లను కూడా కొనుగోలు చేస్తారు.
15 మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు
రాష్ట్రంలో 15 మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపింది. దాంతోపాటు వివిధ ఆసుపత్రుల్లో పడకల పెంపు ఫైలును కూడా సీఎం ఆమోదానికి పంపింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి.. ముఖ్యమంత్రి వద్దకు ఇతర ముఖ్య ఫైళ్లను కూడా తీసుకెళ్లినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి.