జూన్ నుంచి గర్భిణులకు రూ.12 వేలు
వైద్య ఆరోగ్య శాఖ సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గర్భిణీలకు ప్రోత్సాహకపు సొమ్మును వచ్చే నెల నుంచి ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించిం ది. బాలింతలు, శిశువుల కోసం కేసీఆర్ కిట్లను కూడా అదే నెల నుంచి అందజేయాల ని యోచిస్తోంది. ఈ ప్రోత్సాహక నగదు దుర్వినియోగం కాకుండా బ్యాంకు ఖాతాలను గర్భిణుల పేరున తీస్తారు. మూడు విడతల్లో సొమ్ము జమ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ సజావుగా జరగడానికి వీలుగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నారు. గర్భిణులు ఎందరు న్నారు? ఇది తొలి కాన్పా.. కాదా తదితర వివరాలను సేకరిస్తారు. పీహెచ్‌సీ, జిల్లా, రాష్ట్ర యూనిట్లుగా గర్భిణుల సమాచార సేకరణ మొత్తం నమోదు చేస్తారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. ఈ నెలాఖరుకల్లా మొత్తం సమాచారాన్ని సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
గర్భిణులకు రూ.12 వేలు..
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ.12 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో పరీక్షలు చేసే సమయంలో రూ.4వేలు, ప్రసవం సమయంలో రూ.4 వేలు, అనంతరం బిడ్డ టీకాలు వగైరా వాటి కోసం రూ.4వేల చొప్పున ఇస్తారు. ఆడ బిడ్డ పుడితే అదనంగా మరో రూ.వెయ్యి ఇస్తారు. అమ్మ ఒడి పథకం కింద బాలింత, పుట్టిన శిశువుకు కేసీఆర్ కిట్ అందిజేస్తారు.
ఏటా 6.30 లక్షల ప్రసవాలు..
రాష్ట్రంలో ఏటా 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని అంచనా. 91 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే కాన్పు చేయించుకుంటున్నారు. మిగిలిన వారికి ఇళ్ల వద్ద ఏఎన్‌ఎంలు, ఇతరుల సమక్షంలో కాన్పులు జరుగుతున్నాయి. ఆసుపత్రుల్లోని కాన్పుల్లో 69 శాతం ప్రైవేటు, 31 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఈ ప్రాతిపాదికన తాజా సమాచారాన్ని సేకరించి గర్భిణులను గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తారు. ప్రోత్సాహకపు సొమ్ము పథకాన్ని, కేసీఆర్ కిట్లను వచ్చే నెలలో ఏదో ఒక జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.