ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరిగింది | Govt. doctor ensures his wife's delivery at PHC | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరిగింది

Published Sun, Oct 22 2017 1:55 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

Govt. doctor ensures his wife's delivery at PHC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  కేసీఆర్‌ కిట్స్‌ పథకం ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజలకు ఎంతో నమ్మకం ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దాంతోపాటే ప్రభుత్వ వైద్యులపై గౌరవం పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వైద్య, ఆరోగ్య శాఖ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

వైద్య శాఖకు ప్రభుత్వం అవసరమైన చేయూత అందిస్తుందని ప్రకటించారు. రాబోయే కాలంలో తెలంగాణలో ప్రజా వైద్యం ఎలా ఉండాలనే విషయంలో అధికారులు హెల్త్‌ మ్యాప్‌ రూపొందించాలని కోరారు. కేసీఆర్‌ కిట్స్‌ పథకం వల్ల పెరిగిన పనిభారాన్ని ఎంతో ఓపికతో, చిత్తశుద్ధితో మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై ఆయన సంతకం చేశారు. శనివారం ప్రగతి భవన్‌లో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

‘‘కేసీఆర్‌ కిట్స్‌ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిభారం పెరిగింది. పీహెచ్‌సీ నుంచి టీచింగ్‌ ఆసుపత్రుల వరకు ప్రతీ చోటా గర్భిణుల సంఖ్య పెరుగుతున్నది. అధిక సంఖ్యలో గర్భిణులు వస్తున్నా సరే, పేదలకు వైద్య సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. చాలా మంది ఓవర్‌ టైమ్‌ పనిచేస్తున్నారు. వారి సేవలు శ్లాఘనీయం. ప్రజలు వైద్యుల సేవలను కొనియాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు మారింది. వైద్యులకు, సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి’’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.
 
అనవసర ఆపరేషన్ల గండం తప్పింది..  
‘‘కేసీఆర్‌ కిట్స్‌ బహుళ ప్రయోజనాలు అందిస్తున్నాయి. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులకే రావ డం వల్ల అనవసర ఆపరేషన్ల గండం నుంచి బయటపడుతున్నారు. క్రమం తప్పకుండా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవడంవల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు.

ఫలితంగా ఆరోగ్యవంతమైన మరో తరం వస్తున్నది. పేదలకు ప్రసూతి సందర్భంగా అయ్యే ఖర్చు తప్పడమే కాకుండా, తిరిగి ప్రభుత్వమే రూ.15వేల దాకా ప్రోత్సాహకం అందిస్తున్నది. పేదలు ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. గర్భిణుల రద్దీకి తగినట్లుగా వసతులు కూడా పెంచాలి. అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించుకోవాలి. వైద్య, ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలి’’అని సీఎం సూచించారు.  


వైద్య శాఖ చర్యలతో రోగాలు తగ్గాయి..
‘‘ఆదిలాబాద్‌తో పాటు ఇతర ఏజెన్సీలలో ప్రతీ ఏడాది వర్షాకాలంలో అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలి అనేక మంది చనిపోయేవారు. కానీ ఈసారి వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన కార్యక్రమాల వల్ల అంటు వ్యాధులు, జ్వరాలు బాగా తగ్గాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు వచ్చినా తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉంది. ఇది వైద్యుల పనితీరుకు నిదర్శనం’’అని సీఎం ప్రశంసించారు.

ఈ సమీక్షలో మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ తివారీ, కమిషనర్‌ వాకాటి కరుణ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేష్‌రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్‌ లలితకుమారి, మెడికల్‌ సర్వీసెస్‌ ఎండీ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.  


సమీక్షలో సీఎం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు... 
♦ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌ల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏండ్లకు పెంచే అవకాశాలు పరిశీలించాలి.  
♦   ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటతో పాటు కొత్తగా ఏర్పడే నల్లగొండ, సూర్యాపేటలోని సెమీ అటానమస్‌ హోదా కలిగిన మెడికల్‌ కాలేజీల్లో బోధన డాక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు.  
♦  నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో మెడికల్‌ కాలేజీల స్థాపనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కాలేజీల్లో వసతులు కల్పించాలి.  
♦  అర్హులైన వైద్యులకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంట వెంటనే పదోన్నతులు కల్పించాలి.  
♦  ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వైద్యులు స్థానికంగానే ఉండాలనే నిబంధనను సడలించాలి. వారు సమీప పట్టణాల్లో ఉండేందుకు అనుమతించాలి.  
♦  శిథిలమైన ఆసుపత్రి భవనాల స్థానంలో దశల వారీగా కొత్త భవనాలు నిర్మించాలి. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలి.  
♦    ఆసుపత్రి భవనంతో పాటు డాక్టర్లు, సిబ్బంది నివాసం ఉండటానికి క్వార్టర్లు కూడా నిర్మించాలి.  
♦  పెద్దాసుపత్రుల వద్ద రోగుల బంధువుల కోసం షెల్టర్లు నిర్మించాలి. వాటిలో కనీస వసతులు కల్పించాలి.  
♦  నిమ్స్‌ తరహాలో హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వెంట మరో రెండు పెద్దాసుపత్రులు నిర్మించాలి. వరంగల్‌ దారిలోని బీబీనగర్‌లో ఎయిమ్స్‌ వస్తున్నందున, అటువైపు కాకుండా మిగతా రెండు ప్రాంతాల్లో వీటి కోసం స్థలం సేకరించాలి.  
♦   కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య, ఆరోగ్య పథకాలను అధ్యయనం చేసి, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement