'సవాళ్లు గుర్తించండి'
- వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి
-‘కేసీఆర్ కిట్’ పథకాన్ని విజయవంతం చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మరింత సమర్థవంతంగా, శాస్త్రీయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఏ యే ప్రాంతాల్లో ఏయే రకాల వ్యాధులు ఎక్కు వగా ప్రబలుతున్నాయో గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులపట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్త లు సూచించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రు లను మెరుగుపర్చడానికి, మంచి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి, నిధులు వెచ్చిస్తున్నందున పేదలకు ఉపయోగ పడేలా ఆరోగ్యశాఖ పని తీరు ఉండాలని సీఎం కోరారు.
వైద్య ఆరోగ్య శాఖపై ప్రగతి భవన్లో గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు సి.లక్ష్మారెడ్డి, టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, నర్సింగ్ రావు, కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ‘‘స్వైన్ ఫ్లూ, వడదెబ్బలు, కలరా, విషజ్వరాల లాంటి సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో బోదకాలు లాంటి ప్రత్యేక వ్యాధులు వస్తున్నాయి.
వివిధ జిల్లాల్లో, ఏయే ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమ స్యలు తలెత్తుతున్నాయనే విషయంలో ఆరోగ్య శాఖ దగ్గర అంచనా ఉండాలి. దానికనుగుణంగా స్పందించాలి. వైద్య సిబ్బందికి కూడా ఎప్ప టికప్పుడు శిక్షణ ఇవ్వాలి. ఓ వంద మంది రిసోర్స్ పర్సన్స్ ను తయారు చేసి, వారి ద్వారా శిక్షణ ఇప్పించాలి. జిల్లా స్థాయిలో హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి’’ అని సీఎం చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ముందున్న సవాళ్లేంటో ముందు గుర్తించి, వాటి పరిష్కారానికి మార్గం చూడాలన్నారు. కేసీఆర్ కిట్ పేరుతో ప్రసవ సమయంలో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినందున, ఆ పథకం విజయవంతం గా అమలయ్యేలా చూడాలని íసీఎం కోరారు.