కేసీఆర్ కిట్‌లోనే ‘అమ్మ ఒడి’
ఈ పథకం కిందే గర్భిణులకు 12 వేలు,15 రకాల వస్తువులు
► కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం 6 వేలు కలిపి అందజేత
► నగదు బదిలీ పద్ధతిలో నాలుగు దశల్లో లబ్ధిదారు ఖాతాకు సొమ్ము
► ఇద్దరు పిల్లలకే పథకం వర్తింపు, మూడో ప్రసవానికి నో
► మార్గదర్శకాలు విడుదల
► కరీంనగర్ లేదా హైదరాబాద్‌లో 25న ప్రారంభించనున్న సీఎం?
సాక్షి, హైదరాబాద్: ఇక అమ్మ ఒడి పేరుతో పథకం ఉండదు. దాని బదులుగా కేసీఆర్ కిట్ పథకం కిందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇవ్వనున్న రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేలు కలిపి కేసీఆర్ కిట్ పథకం కింద గర్భిణులకు అందజేస్తారు.
దీనికి సంబం ధించి మార్గదర్శకాలను ఖరారు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మ ఒడి పథకం కింద గర్భిణులకు రూ.12 వేలు, కేసీఆర్ కిట్ పథకం కింద బాలింతలు, శిశువులకు అవసరమైన 15 రకాల వస్తువులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రెండు పథకాలకు బదులు ఒకే పథకం కింద వీటిని అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆ మేరకు కేసీఆర్ కిట్ పథకం కిందే ఈ రెండింటినీ అమలుచేస్తారు.
నాలుగు దశల్లో నేరుగా ఖాతాకు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడం, అనవసర సిజేరియన్ ఆపరేషన్లు జరగకుండా చేయడం, తల్లీబిడ్డల క్షేమం తదితర లక్ష్యాలతో ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను ప్రారంభించిన సం గతి తెలిసిందే. ఇందులో భాగంగా గర్భిణులకు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే అదనంగా రూ.వెయ్యి ఇస్తారు. ఆ సొమ్మును నాలుగు విడతల్లో గర్భిణుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్ చేయిం చుకున్నప్పుడు మొదటి దశలో రూ.3 వేలు ఇస్తారు.
మెడికల్ ఆఫీసర్ ద్వారా కనీసం రెం డు పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే మొదటి సొమ్ము అందజేస్తారు. రెండో దశలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న సమయంలో రూ.4 వేలు ఇస్తారు. ఆడపిల్ల పుడితే అదనంగా మరో రూ.వెయ్యి ఇస్తారు. అప్పుడే తల్లీబిడ్డలకు 15 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌ను అందజేస్తారు. ఇక మూడో దశలో శిశువుకు పెంటావాలెంట్, ఓపీ వీ వంటి డోసులు అందజేసినప్పుడు రూ.2 వేలు ఇస్తారు. నాలుగో దశలో బిడ్డకు 9 నెలలు వచ్చినప్పుడు మీజిల్స్ వ్యాక్సిన్ వేసే సమయంలో రూ.3 వేలు ఇస్తారు.
ఇద్దరు పిల్లలకే..
గర్భిణుల వివరాలను సేకరించే బాధ్యత పూర్తిగా ఏఎన్‌ఎంలపైనే ప్రభుత్వం ఉంచింది. గర్భి ణులు తప్పనిసరిగా ఆధార్ సహా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఇద్దరు పిల్లలు పుట్టే వరకే ఈ ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తారు. మూడో బిడ్డకు వర్తించదు. ఒకవేళ కవలలైతే ఒక్కసారికే ఆర్థిక సాయం చేస్తారు. రెండో కాన్పుకు డబ్బు ఇవ్వరు. కవలలిద్దరికీ రెండు కేసీఆర్ కిట్లు అందజేస్తారు. తల్లీ బిడ్డలు చనిపోయినా కుటుంబ సభ్యులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ఈనెల 25న హైదరాబాద్ లేదా కరీంనగర్‌లలో ఎక్కడో ఒక చోట ప్రారంభించే అవకాశముందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.