పసికందు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి, సిరిసిల్ల: టీకా వికటించి ఓ పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం ఓ తల్లికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ.. డాక్టర్ సహా ఎనిమిది మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.బాధిత కుటుంబానికి సర్కారు రూ.3 లక్షల పరిహారం, ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.
అసలు ఏం జరిగింది..?
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి బుధవారం చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఎప్పటిలాగే కోరుట్లపేటకు చెందిన తాడ మాధవి, బాపురెడ్డి దంపతుల నలభై ఐదు రోజుల (ఇంకాపేరు పెట్టని) పసిపాపకు టీకా వేశారు. అది వికటించి పసికందు మరణించింది. మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కరీంనగర్, హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. టీకాను భద్రపరచడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పాయిజన్‌గా మారి నిండు ప్రాణం తీసినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని వైద్యశాఖ అధికారుల విచారణలో నిర్ధారించారు.
కదిలిన యంత్రాంగం
ఎల్లారెడ్డిపేట వైద్యశాఖ నిర్లక్ష్యపు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు కోరుట్లపేటకు వెళ్లి విచారణ జరిపారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో జి.వి.శ్యామ్‌ప్రసాద్‌లాల్ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. రూ.3 లక్షల పరిహారం అందిస్తామని, ఒకరికి అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని సైతం హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు.
డాక్టర్ సహా 8 మంది సస్పెన్షన్
పసికందు మృతితో పాటు మరో ముగ్గురు చిన్నారుల విషమ పరిస్థితికి కారణమైన ఎనిమిది మంది వైద్య సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారిణి మీనాక్షి, పీఎచ్‌ఎన్ శోభారా ణి, ఎపీఎచ్‌ఎస్‌లు అజాం, ప్రేమలత, సీఎచ్ లక్ష్మీ ప్రసాద్, గ్రేడ్2 ఫార్మసిస్ట్ వెంక న్న, ఎంపీఎచ్‌ఏ శారద, ఏఎన్‌ఎం పుష్పలతలను విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 8 మందిని ఒకేసారి సస్పెండ్ చేయడంతో వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment