Neglect of doctors
-
వీళ్లు మారరు !
అనంతపురం న్యూ సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఇంకా కొందరు వైద్యుల్లో నిర్లక్ష్యం వీడలేదు. వీరి బాధ్యతారాహిత్యం.. నిండు ప్రాణాలపై ప్రభావం చూపుతోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతేడాది తాడిపత్రికి చెందిన అక్తార్‌భాను అనే బాలింతకు రక్తమార్పిడి చేసి నిండు ప్రాణాన్ని తీసిన విషయ విధితమే. దీనిపై ప్రభుత్వం స్పందించి అందుకు బాధ్యులైన వైద్యులను సస్పెండ్ చేసింది. అయినా కూడా చాలా మంది వైద్యుల్లో ఎలాంటి మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఆస్పత్రిలో ఓ ఖైదీ సర్జరీ విషయంలో అనస్తీషియా విభాగం వైఫల్యం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 12న ఓ ఖైదీ ఆస్పత్రిలో అడ్మిషన్ అయ్యాడు. ఖైదీని పరీక్షించిన వైద్యులు లాపొరాక్టమీ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13న సర్జన్లు ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో సర్జరీ చేశారు. అంతకంటే ముందు ఓ అనస్తీషియా వైద్యురాలు.. అనస్తీషియా విభాగం హెచ్‌ఓడీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనస్తీషియా ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా ఖైదీకి సర్జరీ చేసే సమయంలో కచ్చితంగా సంబంధిత హెచ్ఓడీ పర్యవేక్షణలో అనస్తీషియా ఇవ్వాల్సి ఉందని ఆస్పత్రి వర్గాల చెబుతున్నాయి. సర్జరీ జరిగిన కాసేపటికే ఖైదీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు అప్రమత్తమై ఆంబు బ్యాగ్, ఆక్సిజన్ సిలిండర్ ద్వారా శ్వాసను అందించి అక్యూట్ మెడికల్ కేర్‌కు తరలించారు. వెంటిలేటర్ ద్వారానే వైద్యం అందించారు. మొదట స్పైన్‌కు అనస్తీషియా ఇవ్వడం ద్వారానే ఈ సమస్య ఏర్పడినట్లు సమాచారం. అన్నీ అయ్యాక ఈ విషయాన్ని హెచ్ఓడీ దృష్టికి తీసుకెళ్లాగా హెచ్ఓడీ తీవ్ర స్థాయిలో సంబంధిత వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏమైనా జరిగితే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని బహిరంగంగానే చెప్పినట్లు సమాచారం. ఖైదీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి విషమించడంతో శుక్రవారం ట్రెకాష్టమీ చేసినట్లు తెలిసింది. ఇదే రోజున ఖైదీకి ఎంఆర్ఐ చేశారు. ఆస్పత్రిలో ఈ అంశం పెద్దచర్చనీయాంశమవడంతో రోజూ ముగ్గురు అనస్తీషియా వైద్యులు ప్రత్యేకంగా ఖైదీని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సర్జరీ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. దీనిపై లోతుగా విచారణ చేపడుతామని తెలిపారు. అనస్తీషియా హెచ్ఓడీ నవీన్‌కుమార్ తనకు ఖైదీ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని, సర్జరీ పూర్తయ్యాకే వైద్యురాలు తనకు దృష్టికి తీసుకొచ్చారని సమాధానమిచ్చారు. -
టీకా వికటించి పసికందు మృతి
సాక్షి, సిరిసిల్ల: టీకా వికటించి ఓ పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం ఓ తల్లికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ.. డాక్టర్ సహా ఎనిమిది మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.బాధిత కుటుంబానికి సర్కారు రూ.3 లక్షల పరిహారం, ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అసలు ఏం జరిగింది..? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి బుధవారం చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఎప్పటిలాగే కోరుట్లపేటకు చెందిన తాడ మాధవి, బాపురెడ్డి దంపతుల నలభై ఐదు రోజుల (ఇంకాపేరు పెట్టని) పసిపాపకు టీకా వేశారు. అది వికటించి పసికందు మరణించింది. మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కరీంనగర్, హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. టీకాను భద్రపరచడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పాయిజన్‌గా మారి నిండు ప్రాణం తీసినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని వైద్యశాఖ అధికారుల విచారణలో నిర్ధారించారు. కదిలిన యంత్రాంగం ఎల్లారెడ్డిపేట వైద్యశాఖ నిర్లక్ష్యపు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు కోరుట్లపేటకు వెళ్లి విచారణ జరిపారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో జి.వి.శ్యామ్‌ప్రసాద్‌లాల్ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. రూ.3 లక్షల పరిహారం అందిస్తామని, ఒకరికి అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కరీంనగర్లో చికిత్స పొందుతున్న చిన్నారిని సైతం హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. డాక్టర్ సహా 8 మంది సస్పెన్షన్ పసికందు మృతితో పాటు మరో ముగ్గురు చిన్నారుల విషమ పరిస్థితికి కారణమైన ఎనిమిది మంది వైద్య సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారిణి మీనాక్షి, పీఎచ్ఎన్ శోభారా ణి, ఎపీఎచ్ఎస్లు అజాం, ప్రేమలత, సీఎచ్ లక్ష్మీ ప్రసాద్, గ్రేడ్2 ఫార్మసిస్ట్ వెంక న్న, ఎంపీఎచ్ఏ శారద, ఏఎన్ఎం పుష్పలతలను విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 8 మందిని ఒకేసారి సస్పెండ్ చేయడంతో వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం మొదలైంది. -
మహిళ గుండె భాగంలో సూది
టీ.నగర్(తమిళనాడు): వైద్యుల నిర్లక్ష్యం గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చింది. చేతికి ఇంజెక్షన్ వేస్తుండగా విరిగిన సూదిని వెంటనే తీయకపోవడంతో సూది గుండె వరకు వెళ్లింది. తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని గోవిందపురానికి చెందిన వడివేలు భార్య శశికళ (23) దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల కిందట శశికళ జ్వరంతో కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అక్కడ నర్సులు ఆమెకు ఇంజెక్షన్ వేయగా సూది విరిగిపోయి శశికళ చెయ్యి లోపలి భాగంలో ఉండిపోయింది. ఇంటికి వెళ్లిన శశికళకు చేతి నొప్పి ఎక్కువైంది. ఆస్పత్రికి వెళ్లి ఎక్స్‌రే తీసి చూడగా విరిగిన సూది చేతిలోపలి భాగంలో ఉన్నట్లు తేలింది. తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకోగా ఆ సమయంలో వైద్యులు సూదిని తొలగించినట్లు చెప్పారు. మూడు నెలల గర్భిణి అయిన శశికళకు శుక్రవారం గుండెనొప్పి వచ్చింది. దీంతో ఇంటి సమీపంలో ఉన్న డాక్టర్ వద్ద ఎక్స్‌రే తీసి చూడగా చేతిలో విరిగిన సూది గుండె వద్దకు చేరుకున్నట్లు తెలిసింది. దీనిపై శశికళ మాట్లాడుతూ.. వైద్యులు సూదిని తొలగించామని చెప్పి మోసగించారని.. సూది గుండె వద్దకు చేరుకుని ప్రాణాల మీదకు వచ్చిందని కన్నీటిపర్యంతమైంది. -
ఆ కడుపుకోతకు కారణమెవరు?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మెరుగైన వైద్యం అందుతుందని విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి వస్తే బాలింత ప్రాణాలే పోయాయి. వచ్చేటప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నా ఆపరేషన్ చేసే సమయంలో పొరపాటు జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండవల్లి మండలం గున్ననపూడికి చెందిన వంగా చిట్టెమ్మ శస్త్రచికిత్సను సీనియర్ రెసిడెంట్ చేయడం వల్లే పొరపాటు జరిగిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంట్రా వాస్కులర్ ప్రాబ్లమ్‌తో పాటు యూరిన్ బ్లాడర్ కూడా దెబ్బతినడంతో అనుభవం లేని వైద్యురాలు చేయడం వల్లే అలా జరిగి ఉండవచ్చని నిపుణులు అంచనాకు వస్తున్నారు. ఎస్‌ఆర్‌లకు బాధ్యత ఉంటుందా? ఒక ఏడాది కంపల్సరీ సర్వీస్ చేసేందుకు వచ్చిన సీనియర్ రెసిడెంట్లు ఎంతవరకు బాధ్యతగా విధులు నిర్వహిస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శాశ్వత వైðద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పట్లేదు. దీంతో చిట్టెమ్మ లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రసూతి విభాగంలోనే కాకుండా అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సీనియర్ వైద్యులు చెబుతున్నారు. వారిపై ఆధారపడితే ఆస్పత్రి పరువు పోతుందంటున్నారు. సూపరింటెండెంట్ సార్.. ఇప్పుడేమంటారు? ఏడాది విధులు నిర్వహించి వెళ్లే వారిపై ఎలా ఆధారపడతామని, శాశ్వత వైద్యులు కావాలంటూ ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ డి.రాజ్యలక్ష్మి కలెక్టర్‌ను కోరారు. తమ విభాగంలో తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని, అర్హత ఉన్న వైద్యులను నియమించాలన్నారు. ఈ సమయంలో సూపరింటెండెంట్ డాక్టర్ చక్రధర్ జోక్యం చేసుకుని ఎస్‌ఆర్‌లతో చేయించుకోవాలంటూ వితండవాదం చేశారు. కలెక్టర్ సాక్షిగా ఈ వాదన జరగ్గా, ఇప్పుడు ఎస్ఆర్ చేసిన సర్జరీ వికటించి బాలింత మృతిచెందగా, సూపరింటెండెంట్ ఏం సమాధానం చెబుతారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుపేదల జీవితాలతో ఆడుకోకుండా వైద్యులను నియమించాల్సిన అవసరం ఉంది. వీఆర్ఎస్పై వెళ్లిన గత హెచ్‌వోడీ తమ విభాగంలో తీవ్రమైన వైద్యుల కొరత ఉందని, సౌకర్యాలతో పాటు వైద్యుల సంఖ్య పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రితో పాటు ఇతర అధికారులు మంత్రులతో జరిగిన సమావేశంలో గత హెచ్‌వోడీ ప్రాధేయపడ్డారు. ఆమె మొరను ఎవరూ ఆలకించలేదు. పైగా ఏదైన ఘటన జరిగితే వైద్యులనే నిందించడం ప్రారంభించారు. దీంతో ఇక్కడ చేయలేమని భావించిందో ఏమో వీఆర్‌పై వెళ్లిపోయింది. ఆమె వెళ్లి రెండేళ్లు గడస్తున్నా పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. ఇప్పుడున్న వైద్యులు సైతం అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. అన్నీ చేశామంటారు.. ఇక్కడేం లేవు ప్రభుత్వాస్పత్రులకు అన్నీ చేశాం.. నాలుగేళ్లలో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లామని వైద్యమంత్రి తరచూ గొప్పలు చెప్పుకుంటారు. కానీ, ఇక్కడ పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. పడకలు 90 నుంచి 240కు పెంచారు. పెరిగిన పడకలకు వైద్యులు, సిబ్బంది ఎక్కడ నుంచి వస్తారనే ఆలోచన చేయలేదు. నాలుగేళ్ల కిందటే ప్రస్తుతం ప్రసూతి విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, ఆరు యూనిట్లు చేయాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, దానిపై ఇప్పటికీ స్పందన లేదు. మరి నిరుపేదలకు మెరుగైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుందని ప్రశ్నిస్తున్నారు. ఒక్కరే అసిస్టెంట్.. పది సిజేరియన్లు రోజూ సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల్లో ఉంటారు. ఆ సమయంలో పది సిజేరియన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరో పది నుంచి పదిహేను సాధారణ డెలివరీలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరికి చేయాలంటే ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పదు. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటే అలాంటి పరిస్థితి తలెత్తదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిపుణులైన వైద్యులు మరింత మందిని నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
కన్నీటి లాలి
కనురెప్పలు కూడా పూర్తిగా విప్పుకోలేదు. పేగుబంధం తడి ఆరనేలేదు. పాలు తాగాలన్న పాల పెదవుల ఆర్తి తీరనే లేదు. ఈ పసికందు తల్లిప్రేమకు దూరమైంది. పుట్టగానే కన్నప్రేమ కరువైనా.. అమ్మ పొత్తిళ్లే అనుకుని ఈ పాప తువ్వాలులో హాయిగా నిద్రపోతుంటే.. కన్నబిడ్డను కంటినిండా చూసుకోలేని ఆ అ‘మృత’మూర్తి మౌనంగానే జోలపడింది. మమతానురాగాలకు దూరమైన ఈ తల్లీకూతుళ్లకే మాట లొస్తే.. తమ దుస్థితికి కారణమైన వైద్యుల వైఫల్యాన్ని నిందిస్తారో, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తారో.. లేక.. ఇలాంటి ఎడబాటు మరే తల్లీబిడ్డకు కలిగించొద్దని దేవుడ్ని ప్రార్థిస్తారో.. (విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి ఘటన వద్ద కనిపించిన హృదయవిదారక చిత్రమిది..) లబ్బీపేట(విజయవాడ తూర్పు): సిజేరియన్ చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం బాలింత మృతికి కారణమయ్యిందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆదివారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తల్లిలేని ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. రెండు గంటల పాటు ఆందోళన అనంతరం గుడివాడ ఆర్డీఓ చక్రపాణి ఆస్పత్రి వద్దకు చేరుకుని బంధువులతో చర్చలు జరిపి లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మండవల్లి మండలం గున్ననపూడి గ్రామానికి చెందిన వంగా చిట్టెమ్మ రెండో కాన్పు కోసం కలిదిండి మండలం చింతలమూరులోను పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 18న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తల్లి చాలంటి బేబీ సరోజిని ప్రసవం కోసం కైకలూరులోని కమ్యూనిటీ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంతో అక్కడి నుంచి ఏలూరు తరలించారు. అక్కడి వైద్యులూ చిట్టెమ్మకు ప్రసవం చేసేందుకు చేతులెత్తేసి.. విజయవాడ తరలించాలని సూచించారు. దీంతో మరలా అక్కడి నుంచి ఈ నెల 19న విజయవాడ పాత ఆస్పత్రిలో ప్రసూతి విభాగానికి వచ్చారు. ఒకే రోజు రెండు శస్త్రచికిత్సలు చిట్టెమ్మను విజయవాడ తరలించే సమయానికే పరిస్థితి విషమంగా మారడంతో గంటలోపే అత్యవసరంగా సిజేరియన్ నిర్వహించారు. దీంతో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారనే ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైంది. ఆపరేషన్ చేసిన పది గంటల తర్వాత కడుపునొప్పి తీవ్రంగా రావడంతో వైద్యులు స్కానింగ్ చేశారు. పొట్టలో ఇంట్రావాస్కులర్ సిస్టమ్(పొట్ట లోపల బ్లీడింగ్) దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో మరోసారి అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి గర్భసంచిని సైతం తొలగించారు. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా యూరిన్ బ్లాడర్ దెబ్బతింది. దీంతో ఇక్కడ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలు లేక పోవడంతో గుంటూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం వేకువజామున మృతి చెందింది. విజయవాడ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందంటూ బంధువులు అక్కడికి చేరుకున్నారు. చిట్టెమ్మకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పేట పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న గుడివాడ ఆర్డీవో అక్కడికి చేరుకొని బంధువులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
రిమ్స్‌లో బాలుడు మృతి
కడప అర్బన్/చెన్నూరు : కడప నగర శివార్లలోని రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన ఓ బాలుని నిండు ప్రాణాలు వైద్యుల నిర్లక్ష్యం వల్ల గాలిలో కలిసిపోయాయి. బాలుని మృతదేహంతో కొన్ని గంటలపాటు తల్లిదండ్రులు, బంధువులు రిమ్స్ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా కొనసాగింది. బాలుని తల్లిదండ్రుల కథనం ప్రకారం.. చెన్నూరు మండలం కొక్కరాయపల్లెకు చెందిన శ్రీనివాసులు, స్వర్ణలతల కుమారుడు చెన్నూరు ధనుష్ (8). వీరికి మొదటి సంతానంగా అమృత (11) ఉన్నారు. వీరిరువురు తమ గ్రామంలోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో 2, 5 తరగతులు చదువుతున్నారు. ఈక్రమంలో సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులు రమణయ్య, వీరనారాయణలు విధుల కోసం వచ్చారు. పాఠశాల ఆవరణంలోని చెత్తాచెదారాన్ని బయటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చెత్తాచెదారాన్ని తీసుకెళ్లి పారవేసే క్రమంలో ధనుష్‌ను ఏదో కుట్టింది. వెంటనే స్థానికులు ధనుష్‌ను చెన్నూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించారు. అక్కడ పనిచేస్తున్న వైద్య ఉద్యోగి కృష్ణారెడ్డి 108కు ఫోన్ చేశారు. అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో బైక్‌పైనే బాలుడిని బంధువులు రిమ్స్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1.30 సమయంలో రిమ్స్‌కు తీసుకురాగానే క్యాజువాలిటీలో వైద్యసేవల అనంతరం చిన్నపిల్లల వార్డుకు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. సాయంత్రం 4.30 సమయంలో «ధనుష్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి బంధువుల ఆందోళన రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన ధనుష్ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లే మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. చిన్నపిల్లల వార్డు వద్దనే రెండు గంటలపాటు ఆందోళన చేసిన తర్వాత రిమ్స్ సీఐ పురుషోత్తంరాజు తన సిబ్బందితో కలిసి మార్చురీలో ధనుష్ మృతదేహాన్ని పెట్టిస్తామని, మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీ వద్దకు తీసుకొచ్చినప్పటికీ లోపల పెట్టించేందుకు ఒప్పుకోలేదు. తమ పిల్లాడు ఏ కారణం చేత మృతిచెందాడన్న విషయాన్ని రిమ్స్ అధికారులు, డాక్టర్లు వెల్లడించాలని, ఆ విషయం తేలిన తర్వాతనే ఫిర్యాదు చేస్తామని పట్టుబట్టారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, సీఐలు పురుషోత్తంరాజు, హేమసుందర్రావు, రామకృష్ణ, దారెడ్డి భాస్కర్‌రెడ్డిలు, ఎస్ఐలు, సిబ్బంది బందోబస్తు ఏర్పాటుచేశా రు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే మృతుని బంధువులు ఫిర్యాదుచేయాలని, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని, కచ్చితంగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు. కాగా రాత్రి 11గంటలకు కేసు నమోదు చేశారు. రిమ్స్ అధికారుల వివరణ ఈ సంఘటనపై రిమ్స్ అధికారులు మాట్లాడుతూ బాలుడిని మధ్యాహ్నం 1.38కు క్యాజువాలిటీకి తీసుకొచ్చారని, అప్పటికే పరిస్థితి విషమించిదన్నారు. అయినప్పటికీ చిన్నపిల్లల విభాగం వైద్య నిపుణులు తమవంతుగా కృషిచేసి వైద్యాన్ని అందించినప్పటికీ బాలుడు మృతి చెందాడన్నారు. తేనెటీగలే కరిచాయి: ఎంఈఓ పాఠశాల ప్రారంభం కాకముందే బడిబయట ఉన్న విద్యార్థి ధనుష్(7)ను తేనెటీగలు కరిచాయి. నొప్పి అని బాధపడుతుంటే అంతలో పాఠశాలకు వచ్చిన హెచ్ఎం రమణయ్య, ఉపాధ్యాయుడు వీరనారాయణలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి చెన్నూరు వైద్యశాలకు పంపారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. వ్యర్థాలు తొలగిస్తూ విషపురుగు కరిచిందనడంలో వాస్తవం లేదు. -
బతకనివ్వడం లేదు..
దేవీపట్నం (రంపచోడవరం), తాడితోట (రాజమహేంద్రవరం): వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో పెరిగాయి. తాజాగా దేవీపట్నం మండలం వి.రామన్నపాలేనికి చెందిన సాదల మంగాదేవి(26) గతనెల 31వతేదీ మంగళవారం పురుడు పోసుకునే నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో భర్త సాధల వెంకటరెడ్డితో కలసి వచ్చి చేరింది. ఆసుపత్రిలో బెడ్స్ కేటాయించకపోవడంతో మూడు రోజులుగా ఆసుపత్రి వరండాలోనే నేలపై పడుకోబెట్టారని భర్త సాదల వెంకట రెడ్డి పేర్కొన్నాడు. గురువారం రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో పురుడు పోయాలని డాక్టర్లను కోరామని అయితే వారు పురుడు పోసేందుకు జాప్యం చేశారని తెలిపారు. అదే సమయంలో మరో మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిందని, డాక్టర్లు ఆమె కోసం గది కేటాయించి తమను పట్టించుకోలేదని వాపోయాడు. దీంతో పరిస్థితి విషమించిందని పేర్కొన్నాడు. చాలా సేపు బతిమిలాడిన తరువాత పురుడు పోసేందుకు ఆపరేషన్ రూమ్‌లోకి తీసుకువెళ్లారని, ఆ తరువాత పరిస్థితి బాగోలేదని కాకినాడ తీసుకువెళ్లాలని చెప్పారని తెలిపారు. కవల పిల్లల్లో ఒకరి పరిస్థితి బాగోకపోవడంతో వారితో పాటే మంగాదేవిని కాకినాడ తరలించేందుకు ప్రయత్నించారని, బయటకు తీసుకువచ్చి అంబులెన్స్ ఎక్కించేందుకు ప్రయత్నించి మరలా వార్డులోకి తీసుకువెళ్లారని, ఈ నేపథ్యంలో పురుడు పోసే సమయంలో జాప్యం జరగడంతో ఉమ్మనీరు తాగి గర్భంలోనే శిశువు మృతి చెందింది. గంట తరువాత శిశువు మృతి చెందినట్టు డాక్టర్లు భర్త వెంకట రెడ్డికి చెప్పారు. అనంతరం మరో రెండు గంటల తరువాత భార్య మంగాదేవి కూడా మృతి చెందినట్టు చెప్పారని అవేదన వ్యక్తం చేశాడు. పురుడు పోయడంలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే రక్తం గడ్డకట్టి తల్లి మృత్యువాత పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. హడావుడిగా మృతదేహాల తరలింపు డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ మృతి చెందిన మృతదేహాలను ప్రత్యేక వాహనంలో ఆసుపత్రి ఆర్ఎంఓ తరలించారు. మృతదేహాలను ఆసుపత్రిలో ఎక్కువ సమయం ఉంచకూడదని భర్త వెంకట రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి శుక్రవారం తెల్లవారుజామున ఆసుపత్రి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను దేవీపట్నం మండలం వి.రామన్నపాలేనికి తరలించారు. విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రిలోని కేస్ షీట్లు కూడా ఆర్ఎంఓ వద్ద దాచారని బాధితులు ఆరోపించారు. డాక్టర్స్ లోపం లేదు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లీ బిడ్డ మృతి సంఘటనలో డాక్టర్స్ లోపం లేదని పేషంట్‌ను కాపాడాలని వారు ఎంతో ప్రయత్నించారని, అయితే గర్భంలో ఉన్న మాయ అనేది పగిలిపోవడంతో ఆపరస్మారక స్థితికి చేరుకొని ఆమె మృతి చెందిందని,ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయ అధికారి, ఇన్చార్జ్ డీఎంఅండ్ హెచ్ఓ ఎం. రమేష్ కిషోర్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యానికి బలి నా భార్య సాధల మంగాదేవికి పురిటినొ ప్పులు రావడంతో అ క్టోబర్ 31న రంపచో డవరం ఏరియా ఆసు పత్రికి తీసుకువెళ్లాం. అక్కడి వైద్యులు రాజమహేంద్రవరం తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో అక్కడికి తీసుకువెళ్లగా వైద్యులు గురువారం పురిటినొప్పులు వస్తున్నా కనీసం పట్టించుకోలేదు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో గర్భిణిని పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయాడని, తక్షణం ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని హడావుడి చేసిన వైద్యులు ఆపరేషన్ చేసి మృతశిశువును అప్పగించారు. అది జరిగిన కొద్ది గంటల్లోనే నా భార్య బాలింత మంగాదేవి కూడా మృతి చెందింది. మాతా శిశు సంరక్షణ రికార్డులో మంగాదేవికి అక్టోబర్ ఆరో తేదీన కాన్పు తేదీని నమోదు చేశారు. ఇచ్చిన గడువుకు 25 రోజులు గడిచిన తర్వాత ఆసుపత్రికి వెళ్లినా.. అటు రంపచోడవరం, ఇటు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించలేదు. – వెంకటరెడ్డి, మంగాదేవి భర్త -
గర్భశోకం
⇒వైద్యుల నిర్లక్ష్యంతో మగ శిశువు మృతి ⇒పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే కడుపుకోత మిగిల్చిన వైనం ⇒పిండం సరిగా కదలడం లేదని చెప్పినా పట్టించుకోని దుస్థితి ⇒ ఆందోళన చేసిన కుటుంబ సభ్యులు అనంతపురం మెడికల్: సర్వజనాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఆదివారం ఉదయం మగశిశువు మృతి చెందాడు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గొల్లవాండ్లపల్లికి చెందిన జయలక్ష్మి, నాగరాజు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. రెండో సారి గర్భం దాల్చడంతో డోన్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీ ఈడీడీ (ప్రసవం అయ్యే తేదీ) అంచనా వేశారు. ఇటీవల స్కానింగ్ చేయించుకోగా 16వ తేదీ అవుతుందని ఈడీఈ వచ్చింది. అనుకున్న సమయానికి ప్రసవం కాకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. అనంతపురం సర్వజనాస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు బాగా అందిస్తారని, పుట్టిన పిల్లలకు అనారోగ్యం చేస్తే ఎస్‌ఎన్‌సీయూలో ఉంచి వైద్యం చేస్తారని అదే గ్రామానికి చెందిన కొందరు చెప్పడంతో ఇక్కడే ప్రసవం చేయించుకోవాలనుకుంది. శనివారం ఉదయం 11.49 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి సర్వజనాస్పత్రికి వచ్చి గైనిక్ ఓపీ చూపించుకుంది. 12.38 గంటలకు అడ్మిషన్ చేయించుకున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యమే.. అడ్మిషన్ అయిన తర్వాత జయలక్ష్మికి పలు రకాల పరీక్షలు చేశారు. అయితే ఆంటినేటల్ వార్డులో ఆమెకు ఎలాంటి సౌకర్యమూ కల్పించలేదు. కనీసం బెడ్డు కూడా ఇవ్వలేదు. దీంతో అక్కడే కూర్చుండిపోయింది. వార్డులోకి వెళ్లి నడుము నొప్పిగా ఉందని చెప్పినా పట్టించుకోలేదు. గర్భంలో పిండం కదలికలు సరిగా లేవని చెప్పినా చెవికేసుకోలేదు. చివరకు రాత్రి 8 గంటల నుంచి ప్రసవ నొప్పులు ప్రారంభం అయ్యాయి. భర్తతోపాటు తల్లి మల్లమ్మను వెంట బెట్టుకుని డెలివరీ రూం వద్దకు వెళితే ‘ఇప్పుడే డెలివరీ కాదులే’ అంటూ గెంటేసేంత పని చేశారు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. భార్య పడే కష్టాన్ని చూసిన భర్త గట్టిగా మాట్లాడడంతో లోపలికి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7.10 గంటలకు జయలక్ష్మి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పిన వైద్య సిబ్బంది.. టవల్‌ను తెచ్చుకోవాలని మల్లమ్మకు సూచించారు. ఆమె తెచ్చేలోగానే బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, పుట్టిన వెంటనే ఏడవలేదంటూ ఎస్ఎన్సీయూకు పంపారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. వైద్యుల తీరుపై ఆగ్రహం తమ బిడ్డ మృతికి వైద్యులే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. అక్కడే ఆందోళనకు దిగారు. ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి నరకయాతన అనుభవించామని, తీరా ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెప్పడం ఎంత వరకు న్యాయమని రోదిస్తూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ డాక్టర్ లలిత అక్కడికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జయలక్ష్మి ఇక్కడికి వచ్చే సమయానికే గర్భంలోని శిశువు పరిస్థితి బాగా లేదని చెప్పారు. అయితే దీన్ని బాధితులు ఖండించారు. మీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలా చెబుతారా అని ప్రశ్నించారు. దీంతో విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పడంతో నాగరాజు తన బిడ్డను తీసుకుని ఖననం చేసేందుకు వెళ్లిపోయాడు. బాగా చూస్తారని వస్తే చంపేశారయ్యా.. కాగా బిడ్డ మృతి చెందిన విషయం తల్లికి ఆలస్యంగా తెలిసింది. ప్రసవానంతరం ఆమెను పోస్ట్‌నేటల్ వార్డులోకి తీసుకెళ్లిన తర్వాత శిశువుకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రెండు గంటల తర్వాత ఈ విషయం చెప్పడంతో జయలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. ‘బాగా చూస్తారని వస్తే చంపేశారయ్యా.. రాత్రి నుంచి చెబుతానే ఉన్నా..ఎవరూ పట్టించుకోలేదు’ అని రోదించింది. పక్కనే ఉన్న బాలింతలు సర్దిచెప్పినా ఆమె కన్నీరు మాత్రం ఆగలేదు. ఇదేం ఆస్పత్రయ్యా : మల్లమ్మ, జయలక్ష్మి తల్లి ఈ ఆస్పత్రికి గురించి ఎంతో గొప్పగా చెబుతారు. కానీ ఇక్కడేందయ్యా ఇలాగుంది. నా బిడ్డ నొప్పులతో బాధపడుతుంటే పట్టించుకునే వాళ్లే లేరు. నా అల్లుడు గొడవ పెట్టుకుంటే డెలివరీకి తీసుకెళ్లారు. మగ బిడ్డ మూడు కేజీలుంది. కానీ ఏం లాభం? అంతా కలిసి చంపేశారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి
కెరమెరి(ఆసిఫాబాద్): వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. కుమ్రం భీం జిల్లాలోని కెరమెరి మండలం గోండ్ కరం జివాడ గ్రామానికి చెందిన సిడాం బ్రహ్మ (11)ను బుధవారం వేకువజామున పాము కాటు వేసింది. గమనించిన తల్లిదండ్రులు సిడాం యాదోరావు, దుర్పాబాయిలు వెం టనే కెరమెరి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యుడు సుంకన్న వైద్యం చేయ కుండానే ఆదిలాబాద్‌కు రిఫర్ చేశారు. 108 వాహనం లేకపోవడంతో తిరిగి ఇంటికి తీసుకువెళ్తుండగా బ్రహ్మ మృతి చెందాడు. దీంతో కుటుం బీకులు, గ్రామస్తులు పీహెచ్సీ తిరిగి వెళ్లి గేటు ఎదుట మృత దేహంతో ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బందిని బయటికి వెళ్ల కుండా అడ్డుకు న్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం వచ్చి కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తా మని హామీ ఇవ్వ డంతో కుటుంబీకులు శాంతించారు. బ్రహ్మ సిర్పూర్(యూ) పంగిడి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.