దేవీపట్నం (రంపచోడవరం), తాడితోట (రాజమహేంద్రవరం): వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో పెరిగాయి. తాజాగా దేవీపట్నం మండలం వి.రామన్నపాలేనికి చెందిన సాదల మంగాదేవి(26) గతనెల 31వతేదీ మంగళవారం పురుడు పోసుకునే నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో భర్త సాధల వెంకటరెడ్డితో కలసి వచ్చి చేరింది. ఆసుపత్రిలో బెడ్స్ కేటాయించకపోవడంతో మూడు రోజులుగా ఆసుపత్రి వరండాలోనే నేలపై పడుకోబెట్టారని భర్త సాదల వెంకట రెడ్డి పేర్కొన్నాడు. గురువారం రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో పురుడు పోయాలని డాక్టర్లను కోరామని అయితే వారు పురుడు పోసేందుకు జాప్యం చేశారని తెలిపారు. అదే సమయంలో మరో మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిందని, డాక్టర్లు ఆమె కోసం గది కేటాయించి తమను పట్టించుకోలేదని వాపోయాడు.
దీంతో పరిస్థితి విషమించిందని పేర్కొన్నాడు. చాలా సేపు బతిమిలాడిన తరువాత పురుడు పోసేందుకు ఆపరేషన్ రూమ్‌లోకి తీసుకువెళ్లారని, ఆ తరువాత పరిస్థితి బాగోలేదని కాకినాడ తీసుకువెళ్లాలని చెప్పారని తెలిపారు. కవల పిల్లల్లో ఒకరి పరిస్థితి బాగోకపోవడంతో వారితో పాటే మంగాదేవిని కాకినాడ తరలించేందుకు ప్రయత్నించారని, బయటకు తీసుకువచ్చి అంబులెన్స్ ఎక్కించేందుకు ప్రయత్నించి మరలా వార్డులోకి తీసుకువెళ్లారని, ఈ నేపథ్యంలో పురుడు పోసే సమయంలో జాప్యం జరగడంతో ఉమ్మనీరు తాగి గర్భంలోనే శిశువు మృతి చెందింది. గంట తరువాత శిశువు మృతి చెందినట్టు డాక్టర్లు భర్త వెంకట రెడ్డికి చెప్పారు. అనంతరం మరో రెండు గంటల తరువాత భార్య మంగాదేవి కూడా మృతి చెందినట్టు చెప్పారని అవేదన వ్యక్తం చేశాడు. పురుడు పోయడంలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే రక్తం గడ్డకట్టి తల్లి మృత్యువాత పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
హడావుడిగా మృతదేహాల తరలింపు
డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ మృతి చెందిన మృతదేహాలను ప్రత్యేక వాహనంలో ఆసుపత్రి ఆర్‌ఎంఓ తరలించారు. మృతదేహాలను ఆసుపత్రిలో ఎక్కువ సమయం ఉంచకూడదని భర్త వెంకట రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి శుక్రవారం తెల్లవారుజామున ఆసుపత్రి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను దేవీపట్నం మండలం వి.రామన్నపాలేనికి తరలించారు. విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రిలోని కేస్ షీట్లు కూడా ఆర్‌ఎంఓ వద్ద దాచారని బాధితులు ఆరోపించారు.
డాక్టర్స్ లోపం లేదు
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లీ బిడ్డ మృతి సంఘటనలో డాక్టర్స్ లోపం లేదని పేషంట్‌ను కాపాడాలని వారు ఎంతో ప్రయత్నించారని, అయితే గర్భంలో ఉన్న మాయ అనేది పగిలిపోవడంతో ఆపరస్మారక స్థితికి చేరుకొని ఆమె మృతి చెందిందని,ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయ అధికారి, ఇన్‌చార్జ్ డీఎంఅండ్ హెచ్‌ఓ ఎం. రమేష్ కిషోర్
తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యానికి బలి
నా భార్య సాధల మంగాదేవికి పురిటినొ ప్పులు రావడంతో అ క్టోబర్ 31న రంపచో డవరం ఏరియా ఆసు పత్రికి తీసుకువెళ్లాం. అక్కడి వైద్యులు రాజమహేంద్రవరం తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో అక్కడికి తీసుకువెళ్లగా వైద్యులు గురువారం పురిటినొప్పులు వస్తున్నా కనీసం పట్టించుకోలేదు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో గర్భిణిని పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయాడని, తక్షణం ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని హడావుడి చేసిన వైద్యులు ఆపరేషన్ చేసి మృతశిశువును అప్పగించారు. అది జరిగిన కొద్ది గంటల్లోనే నా భార్య బాలింత మంగాదేవి కూడా మృతి చెందింది. మాతా శిశు సంరక్షణ రికార్డులో మంగాదేవికి అక్టోబర్ ఆరో తేదీన కాన్పు తేదీని నమోదు చేశారు. ఇచ్చిన గడువుకు 25 రోజులు గడిచిన తర్వాత ఆసుపత్రికి వెళ్లినా.. అటు రంపచోడవరం, ఇటు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించలేదు.
– వెంకటరెడ్డి, మంగాదేవి భర్త
Comments
Please login to add a commentAdd a comment