గర్భిణి శశికళ. పక్కన ఎక్స్‌రేలో గుండె భాగంలో కనిపిస్తున్న సూది
టీ.నగర్(తమిళనాడు): వైద్యుల నిర్లక్ష్యం గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చింది. చేతికి ఇంజెక్షన్ వేస్తుండగా విరిగిన సూదిని వెంటనే తీయకపోవడంతో సూది గుండె వరకు వెళ్లింది. తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని గోవిందపురానికి చెందిన వడివేలు భార్య శశికళ (23) దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల కిందట శశికళ జ్వరంతో కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అక్కడ నర్సులు ఆమెకు ఇంజెక్షన్ వేయగా సూది విరిగిపోయి శశికళ చెయ్యి లోపలి భాగంలో ఉండిపోయింది.
ఇంటికి వెళ్లిన శశికళకు చేతి నొప్పి ఎక్కువైంది. ఆస్పత్రికి వెళ్లి ఎక్స్‌రే తీసి చూడగా విరిగిన సూది చేతిలోపలి భాగంలో ఉన్నట్లు తేలింది. తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకోగా ఆ సమయంలో వైద్యులు సూదిని తొలగించినట్లు చెప్పారు. మూడు నెలల గర్భిణి అయిన శశికళకు శుక్రవారం గుండెనొప్పి వచ్చింది. దీంతో ఇంటి సమీపంలో ఉన్న డాక్టర్ వద్ద ఎక్స్‌రే తీసి చూడగా చేతిలో విరిగిన సూది గుండె వద్దకు చేరుకున్నట్లు తెలిసింది. దీనిపై శశికళ మాట్లాడుతూ.. వైద్యులు సూదిని తొలగించామని చెప్పి మోసగించారని.. సూది గుండె వద్దకు చేరుకుని ప్రాణాల మీదకు వచ్చిందని కన్నీటిపర్యంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment