గర్భశోకం
⇒వైద్యుల నిర్లక్ష్యంతో మగ శిశువు మృతి
⇒పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే కడుపుకోత మిగిల్చిన వైనం
⇒పిండం సరిగా కదలడం లేదని చెప్పినా పట్టించుకోని దుస్థితి
⇒ ఆందోళన చేసిన కుటుంబ సభ్యులు
అనంతపురం మెడికల్: సర్వజనాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఆదివారం ఉదయం మగశిశువు మృతి చెందాడు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గొల్లవాండ్లపల్లికి చెందిన జయలక్ష్మి, నాగరాజు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. రెండో సారి గర్భం దాల్చడంతో డోన్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీ ఈడీడీ (ప్రసవం అయ్యే తేదీ) అంచనా వేశారు. ఇటీవల స్కానింగ్ చేయించుకోగా 16వ తేదీ అవుతుందని ఈడీఈ వచ్చింది. అనుకున్న సమయానికి ప్రసవం కాకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. అనంతపురం సర్వజనాస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు బాగా అందిస్తారని, పుట్టిన పిల్లలకు అనారోగ్యం చేస్తే ఎస్‌ఎన్‌సీయూలో ఉంచి వైద్యం చేస్తారని అదే గ్రామానికి చెందిన కొందరు చెప్పడంతో ఇక్కడే ప్రసవం చేయించుకోవాలనుకుంది. శనివారం ఉదయం 11.49 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి సర్వజనాస్పత్రికి వచ్చి గైనిక్ ఓపీ చూపించుకుంది. 12.38 గంటలకు అడ్మిషన్ చేయించుకున్నారు.
అడుగడుగునా నిర్లక్ష్యమే..
అడ్మిషన్ అయిన తర్వాత జయలక్ష్మికి పలు రకాల పరీక్షలు చేశారు. అయితే ఆంటినేటల్ వార్డులో ఆమెకు ఎలాంటి సౌకర్యమూ కల్పించలేదు. కనీసం బెడ్డు కూడా ఇవ్వలేదు. దీంతో అక్కడే కూర్చుండిపోయింది. వార్డులోకి వెళ్లి నడుము నొప్పిగా ఉందని చెప్పినా పట్టించుకోలేదు. గర్భంలో పిండం కదలికలు సరిగా లేవని చెప్పినా చెవికేసుకోలేదు. చివరకు రాత్రి 8 గంటల నుంచి ప్రసవ నొప్పులు ప్రారంభం అయ్యాయి. భర్తతోపాటు తల్లి మల్లమ్మను వెంట బెట్టుకుని డెలివరీ రూం వద్దకు వెళితే ‘ఇప్పుడే డెలివరీ కాదులే’ అంటూ గెంటేసేంత పని చేశారు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. భార్య పడే కష్టాన్ని చూసిన భర్త గట్టిగా మాట్లాడడంతో లోపలికి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7.10 గంటలకు జయలక్ష్మి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పిన వైద్య సిబ్బంది.. టవల్‌ను తెచ్చుకోవాలని మల్లమ్మకు సూచించారు. ఆమె తెచ్చేలోగానే బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, పుట్టిన వెంటనే ఏడవలేదంటూ ఎస్‌ఎన్‌సీయూకు పంపారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు.
వైద్యుల తీరుపై ఆగ్రహం
తమ బిడ్డ మృతికి వైద్యులే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. అక్కడే ఆందోళనకు దిగారు. ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి నరకయాతన అనుభవించామని, తీరా ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెప్పడం ఎంత వరకు న్యాయమని రోదిస్తూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఎంఓ డాక్టర్ లలిత అక్కడికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జయలక్ష్మి ఇక్కడికి వచ్చే సమయానికే గర్భంలోని శిశువు పరిస్థితి బాగా లేదని చెప్పారు. అయితే దీన్ని బాధితులు ఖండించారు. మీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలా చెబుతారా అని ప్రశ్నించారు. దీంతో విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పడంతో నాగరాజు తన బిడ్డను తీసుకుని ఖననం చేసేందుకు వెళ్లిపోయాడు.
బాగా చూస్తారని వస్తే చంపేశారయ్యా..
కాగా బిడ్డ మృతి చెందిన విషయం తల్లికి ఆలస్యంగా తెలిసింది. ప్రసవానంతరం ఆమెను పోస్ట్‌నేటల్ వార్డులోకి తీసుకెళ్లిన తర్వాత శిశువుకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రెండు గంటల తర్వాత ఈ విషయం చెప్పడంతో జయలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. ‘బాగా చూస్తారని వస్తే చంపేశారయ్యా.. రాత్రి నుంచి చెబుతానే ఉన్నా..ఎవరూ పట్టించుకోలేదు’ అని రోదించింది. పక్కనే ఉన్న బాలింతలు సర్దిచెప్పినా ఆమె కన్నీరు మాత్రం ఆగలేదు.
ఇదేం ఆస్పత్రయ్యా : మల్లమ్మ, జయలక్ష్మి తల్లి
ఈ ఆస్పత్రికి గురించి ఎంతో గొప్పగా చెబుతారు. కానీ ఇక్కడేందయ్యా ఇలాగుంది. నా బిడ్డ నొప్పులతో బాధపడుతుంటే పట్టించుకునే వాళ్లే లేరు. నా అల్లుడు గొడవ పెట్టుకుంటే డెలివరీకి తీసుకెళ్లారు. మగ బిడ్డ మూడు కేజీలుంది. కానీ ఏం లాభం? అంతా కలిసి చంపేశారు.