చిన్నారి జ్ఞానస మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతం
పెందుర్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు గుక్కెడు పాలు ఇవ్వలేని దుస్థితి ఆ తల్లిది. ఇంట్లో పెద్దోళ్లతో పంతానికి వెళ్లి పొత్తిళ్లలోని చిన్నారిని చంపుకున్న శాపం ఆమెది. ఎత్తుకుని లాలించి.. పాలిచ్చి పెంచిన చేతులతోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టిన కన్నీటి గాథ ఆ కన్నతల్లిది. అత్తమామలతో గొడవ పడి అర్ధరాత్రి ముక్కుపచ్చలారని చిన్నారితో గడప దాటి తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన దురవస్థ ఆమెది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పులగాలిపాలెంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కరక అప్పారావు, కుసుమలత దంపతులకు సోనిక, జ్ఞానస(ఏడాదిన్నర) ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 6న అప్పారావు విధులకు వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు రాత్రి కుసుమలతకు అత్తమామలు అప్పలకొండ, నూకాలుకు ఇంట్లో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుసుమలత అదే రోజు అర్ధరాత్రి దాటాక ఇంట్లో నుంచి చిన్న కుమార్తె జ్ఞానసను తీసుకుని బయటకు వెళ్లిపోయింది.
అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో తెలియని కుసుమలత చినముషిడివాడ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉన్న కొండ ఎక్కింది. అక్కడే నాలుగు రోజుల పాటు రేయింబవళ్లు ఉండి ఈ నెల 10న కిందకి ఒంటరిగా వచ్చింది (అప్పటికే కుసుమలత పుట్టింటివారు ఆమె కనిపించలేదంటూ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు). కొండ సమీపంలో నివాసం ఉంటున్న వారి వద్దకు వెళ్లి ఆకలేస్తోందని చెప్పడంతో వారు భోజనం పెట్టారు. కుసుమలత పరిస్థితి చూసినవారు ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. ‘పాప ఆకలికి చనిపోయింది. నేనే కొండ మీద పూడ్చిపెట్టాను’ అని చెప్పడంతో కంగారు పడ్డ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలంలో విలపిస్తున్న జ్ఞానస తండ్రి అప్పారావు
అంతా అయోమయం.. అనుమానాస్పదం..
అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కుసుమలత నేరుగా కొండ ప్రాంతానికి వెళ్లడం మిస్టరీగా మారింది. అంతేకాకుండా ఆమె ఫోన్‌లో ‘ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలం’ అని గూగూల్ సెర్చ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆమె కొండ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఎంత పంతం ఉన్నా.. చంటిపాప విషయంలో కన్నతల్లి అంత కఠినంగా ఉందా అన్నది మరో ప్రశ్న. అదే సమయంలో ఇంట్లో అత్తమామలతో గొడవ పడిన సందర్భం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని వారు ఏదైనా అన్నారా? ఆ కోపంలో చిన్నారిని ఆమె ఏదైనా చేసిందా అన్నది సందేహంగా మారింది. అయితే ఇంత జరిగినా కుసుమలత నోరు విప్పడం లేదు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పకపోవడంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదు. జ్ఞానస పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఇందులో పురోగతి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అత్తమామలతో పెద్ద స్థాయిలో గొడవలు లేవని తెలుస్తోంది. అసలు ఆమె అలా ఎందుకు చేసిందో ఏమాత్రం అర్థం కావడం లేదని భర్త వాపోతున్నారు. రైల్వే ఉద్యోగం కావడంతో రెండు మూడు రోజులు బయటకు వెళ్తుంటానని, ఎప్పుడూ ఇలా జరగలేదని అతను చెబుతున్నారు.
క్విక్ రియాక్షన్ బృందాల సహకారంతో..
జ్ఞానస చనిపోయిందని కుసుమలత చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను వెంటబెట్టుకుని కొండ ప్రాంతం అంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం క్విక్ రియాక్షన్ టీమ్ బృందాలు డాగ్ స్క్వాడ్ సహా రంగంలోకి దిగాయి. ఎట్టకేలకు చిన్నారిని పూడ్చిన ప్రదేశాన్ని కనుగొన్నారు. జ్ఞానస మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఏసీపీ స్వరూపారాణి ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment