Baby death
-
తండ్రి అనుమానమే నిజమైంది.. ప్రియుడి మోజులో కన్నకూతుర్ని..
సాక్షి, హైదరాబాద్: ప్రియుడిపై మోజుతో కన్నబిడ్డనే కడతేర్చిందో కసాయి తల్లి. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందినట్టు చిత్రీకరించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయింది. కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు. ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడకు చెందిన నాయక్వడి రమేష్ (30) కల్యాణి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల కూతురు తన్విత సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లి, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. కల్యాణి కుషాయిగూడ మార్కెట్లో పని చేస్తూ.. సమీపంలో కూతురు తన్వితతో కలిసి ఉంటోంది. ఈ నెల 1న కల్యాణి కూతురు తన్వితకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అంతా కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే వైద్యులు తన్విత చనిపోయినట్లు ప్రకటించారు. రోజూ మాదిరిగానే స్కూల్‌కు వెళ్లి వచ్చిన కూతురు భోజనం చేసి పడుకుందని, నిద్రలోనే ఇలా జరిగిందని కల్యాణి అందరినీ నమ్మించింది. అనుమానంతో ఫిర్యాదు... భార్య తీరుపై అనుమానం కలిగిన తండ్రి రమేష్ తన కూతురు చనిపోలేదని, చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఊపిరాడకపోవడంతో చిన్నారి చనిపోయినట్టు వెల్లడైంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా వాస్తవం వెలుగులోకి వచ్చింది. అడ్డు తొలగించుకోవాలని... కల్యాణికి జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన ఇండ్ల నవీన్‌కుమార్ (19) అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. కుషాయిగూడలో కూతురుతో కలిసి ఉంటున్న కల్యాణి వద్దను అతను తరచూ వచ్చేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. కల్యాణి భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. విడాకులు సాధ్యం కాకపోవడంతో కూతురు తన్వితను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 1న స్కూల్ కు వెళ్లి వచ్చిన తన్విత నిద్రలో ఉండగా ముందే వేసుకున్న ఫ్లాన్ ప్రకారం ముఖంపై బెడ్‌షీట్ కప్పి దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. నిందితులు కల్యాణి, నవీన్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చిన్నారి హత్య కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ షేక్ షఫీలను డీసీపీ జానకి, ఏసీపీ వెంకట్‌రెడ్డి అభినందించారు. -
'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు'
ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్ సమరానికి అంతా సిద్ధమైంది. ఇప్పటికే వరల్డ్‌కప్‌లో పాల్గొననున్న జట్లన్నీ ఖతార్‌కు చేరుకున్నాయి. ఈసారి ఎవరో విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా దేశం తరపున వరల్డ్‌కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే పియర్స్ మోర్గాన్ అనే బ్రిటిష్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు మేనేజర్ నాకు ద్రోహం చేశారంటూ ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పియర్స్ మోర్గాన్ ఇంటర్య్వూ రెండో భాగం కూడా బయటికి వచ్చింది. ఇందులో రొనాల్డో చనిపోయిన తన కొడుకు గురించి తలచుకొని ఎమోషనల్ అయ్యాడు. విషయంలోకి వెళితే.. రొనాల్డో ప్రస్తుతం అర్జెంటీనాకు చెందిన మోడల్ జార్జినా రోడ్రిగ్జ్‌తో సహజీవనం చేస్తున్నాడు. వీరికి 2017లోనే ఒక కుమార్తె పుట్టింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంటకు కవలలు పుట్టారు. అయితే కవలల్లో అమ్మాయి బతకగా.. అబ్బాయి మాత్రం చనిపోయాడు. ఇది రొనాల్డోనూ చాలా బాధించింది. తనకు వారసుడు పుట్టాడనే ఆనందం అంతలోనే ఆవిరైందన్న బాధ రొనాల్డోలో స్పష్టంగా కనిపించింది. తాజాగా ఇదే విషయాన్ని రొనాల్డో పియర్స్ మోర్గాన్ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''మనకు పిల్లలు పుట్టబోతున్నారని తెలిస్తే అంతా నార్మల్‌గా జరగాలని కోరుకుంటాం. కానీ పుట్టిన సమయంలో సమస్య తలెత్తి పురిట్లోనే బిడ్డ చనిపోతే ఎలా ఉంటుంది. ఆ బాధను నేను దగ్గరి నుంచి అనుభవించాను. ఈ విషయంలో నాకంటే జార్జినా ఎక్కువగా బాధపడడం సహజం. ఎందుకంటే మాతృత్వం అనేది చాలా గొప్పది. ఆ క్షణంలో అలా జరిగిపోయేసరికి మాకు చాలా క్లిష్టంగా అనిపించింది. నిజంగా ఆ సమయంలో మా జీవితంలో ఏం జరిగిందో కూడా కొంతకాలం అర్థం కాలేదు. నిజంగా నా కొడుకుకు పురిట్లోనే పోగొట్టుకోవడం చాలా బాధించింది. మా నాన్న చనిపోయిన రోజున ఎంత బాధపడ్డానో అదే బాధను నా కొడుకు చనిపోయిన రోజున అనుభవించాను. మనల్ని ద్వేషించే వాడికి కూడా ఈ కష్టం రాకూడదని ఆరోజు కోరుకున్నా'' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ రెండు బాగాలుగా విడుదల చేశారు. ఈ బుధవారం, గురువారం రొనాల్డో ఫుల్ ఇంటర్య్వూ వీడియోను అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో వీక్షించొచ్చు "That moment was probably the most difficult moment that I have in my life." Cristiano Ronaldo opens up about the devastating death of his baby son, telling Piers Morgan: "We don't understand why it happened to us."@cristiano | @piersmorgan | @TalkTV | #PMU pic.twitter.com/tOba0WJpBf — Piers Morgan Uncensored (@PiersUncensored) November 15, 2022 చదవండి: Cristiano Ronaldo: 'ద్రోహం చేశారు'.. రొనాల్డో సంచలన వ్యాఖ్యలు -
గర్భిణి నరకయాతన
కర్ణాటక, యశవంతపుర: ప్రసవం కోసం ఓ గర్భిణి ఎనిమిది గంటల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా బెడ్లు లేవని కారణంతో ఆమెను చేర్చుకోకపోవడంతో చివరకు ఆమె ఆటోలోనే ప్రసవించిన ఘటన బెంగళూరు చోటు చేసుకుంది. వివరాలు... శ్రీరామపురకు గర్భిణికి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆటోలో ఆస్పత్రికి బయలుదేరారు. శ్రీరామపుర ప్రభుత్వ ఆస్పత్రి, విక్టోరియా, వాణి విలాస్‌తో పాటు 10 ఆస్పత్రులకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లిన బెడ్‌లేదంటూ చెప్పటంతో కేసీ జనరల్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ కూడా బెడ్ లేదని చెప్పారు. దీంతో గర్భిణి ఆటోనే ప్రసవించారు. ఆ కొద్ది సేపటికే శిశువు మరణించింది. స్పందించిన ఆస్పత్రి సిబ్బంది అరగంట తరువాత ఆస్పత్రిలో చేరుకున్నారు. ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతోనే శిశువు మృతి చెందిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
కారు చీకట్లో.. కనుమరుగైన కనుపాప
పెందుర్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు గుక్కెడు పాలు ఇవ్వలేని దుస్థితి ఆ తల్లిది. ఇంట్లో పెద్దోళ్లతో పంతానికి వెళ్లి పొత్తిళ్లలోని చిన్నారిని చంపుకున్న శాపం ఆమెది. ఎత్తుకుని లాలించి.. పాలిచ్చి పెంచిన చేతులతోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టిన కన్నీటి గాథ ఆ కన్నతల్లిది. అత్తమామలతో గొడవ పడి అర్ధరాత్రి ముక్కుపచ్చలారని చిన్నారితో గడప దాటి తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన దురవస్థ ఆమెది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పులగాలిపాలెంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కరక అప్పారావు, కుసుమలత దంపతులకు సోనిక, జ్ఞానస(ఏడాదిన్నర) ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 6న అప్పారావు విధులకు వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు రాత్రి కుసుమలతకు అత్తమామలు అప్పలకొండ, నూకాలుకు ఇంట్లో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుసుమలత అదే రోజు అర్ధరాత్రి దాటాక ఇంట్లో నుంచి చిన్న కుమార్తె జ్ఞానసను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో తెలియని కుసుమలత చినముషిడివాడ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉన్న కొండ ఎక్కింది. అక్కడే నాలుగు రోజుల పాటు రేయింబవళ్లు ఉండి ఈ నెల 10న కిందకి ఒంటరిగా వచ్చింది (అప్పటికే కుసుమలత పుట్టింటివారు ఆమె కనిపించలేదంటూ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు). కొండ సమీపంలో నివాసం ఉంటున్న వారి వద్దకు వెళ్లి ఆకలేస్తోందని చెప్పడంతో వారు భోజనం పెట్టారు. కుసుమలత పరిస్థితి చూసినవారు ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. ‘పాప ఆకలికి చనిపోయింది. నేనే కొండ మీద పూడ్చిపెట్టాను’ అని చెప్పడంతో కంగారు పడ్డ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో విలపిస్తున్న జ్ఞానస తండ్రి అప్పారావు అంతా అయోమయం.. అనుమానాస్పదం.. అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కుసుమలత నేరుగా కొండ ప్రాంతానికి వెళ్లడం మిస్టరీగా మారింది. అంతేకాకుండా ఆమె ఫోన్లో ‘ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలం’ అని గూగూల్ సెర్చ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆమె కొండ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఎంత పంతం ఉన్నా.. చంటిపాప విషయంలో కన్నతల్లి అంత కఠినంగా ఉందా అన్నది మరో ప్రశ్న. అదే సమయంలో ఇంట్లో అత్తమామలతో గొడవ పడిన సందర్భం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని వారు ఏదైనా అన్నారా? ఆ కోపంలో చిన్నారిని ఆమె ఏదైనా చేసిందా అన్నది సందేహంగా మారింది. అయితే ఇంత జరిగినా కుసుమలత నోరు విప్పడం లేదు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పకపోవడంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదు. జ్ఞానస పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఇందులో పురోగతి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అత్తమామలతో పెద్ద స్థాయిలో గొడవలు లేవని తెలుస్తోంది. అసలు ఆమె అలా ఎందుకు చేసిందో ఏమాత్రం అర్థం కావడం లేదని భర్త వాపోతున్నారు. రైల్వే ఉద్యోగం కావడంతో రెండు మూడు రోజులు బయటకు వెళ్తుంటానని, ఎప్పుడూ ఇలా జరగలేదని అతను చెబుతున్నారు. క్విక్ రియాక్షన్ బృందాల సహకారంతో.. జ్ఞానస చనిపోయిందని కుసుమలత చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను వెంటబెట్టుకుని కొండ ప్రాంతం అంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం క్విక్ రియాక్షన్ టీమ్ బృందాలు డాగ్ స్క్వాడ్ సహా రంగంలోకి దిగాయి. ఎట్టకేలకు చిన్నారిని పూడ్చిన ప్రదేశాన్ని కనుగొన్నారు. జ్ఞానస మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఏసీపీ స్వరూపారాణి ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సూది వేయగానే స్పృహ కోల్పోయి కోమాలోకి
సాక్షి, బెంగళూరు: ముద్దులొలికే పసిపాపకు అప్పుడే నూరేళ్లు నిండాయా? అని తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మూడు నెలల చిన్నారి కన్నుమూసినట్లు తెలిసింది. ఈ ఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా హుణశ్యాళ పీజీ గ్రామంలో శనివారం జరిగింది. చిన్నారికి జ్వరం వస్తే చూపిద్దామని అంగన్వాడీ సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడి నర్స్ పెంటాపెస్ట్ అనే ఇంజెక్షన్‌ను పాపకు ఇచ్చింది. సూది వేసిన వెంటనే చిన్నారి స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లిపోయిందని, తర్వాత కొంత సేపటికి మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. సాధారణంగా అంటువ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే పెంటాపెస్ట్ ఇంజెక్షన్ ఇస్తారని, జ్వరం వచ్చినప్పుడు ఉపయోగించరని, కానీ ఈ నర్స్ చేసిన పనికి తమ చిన్నారిని పోగొట్టుకున్నట్లు వారు ఆరోపించారు. గోకాక్‌లోని ఆస్పత్రిలో చిన్నారి మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళన చేశారు. నర్స్ నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మరణించిందని విలపించారు. చదవండి: టీచర్‌కు అయిదేళ్ల జైలు తనకు దక్కదని.. మరెవరికీ దక్కొద్దని.. -
ఐదేళ్ల కూతురి హత్య..
నాగోలు: మద్యం మత్తులో ఓ తండ్రి తన ఐదేళ్ల కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంద్రవరం మండలం వెలగదురు గ్రామానికి చెందిన దుర్గారావు, గంగాభవాని దంప తులకు సింధు (7), యామిని (5) సంతానం. ఎల్బీనగర్ మన్సూరాబాద్ బాలాజీనగర్‌లోని భాస్కర నిలయం అపార్ట్మెంట్లో దుర్గారావు వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే కుటుంబంతో ఉంటున్నాడు. భార్య స్థానికంగా ఇళ్ల లో పనిచేస్తోంది. మద్యానికి బానిసైన దుర్గారావు తరచూ భార్య, పిల్లలను కొట్టేవాడు. శుక్రవారం ఇదే విషయమై భార్యతో గొడవపడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో పిల్లలను చంపేస్తానని బెదిరించి పడుకున్నాడు. శనివారం ఉదయం పనికివెళ్తున్న గంగాభవాని పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లాలని అదే కాలనీలో ఉండే తన సో దరుడికి ఫోన్ చేసి చెప్పింది. సోదరుడు వచ్చి సింధూను పాఠశాలకు తీసుకెళ్లా డు. యామినిని తన వద్ద ఉంచాలని దు ర్గారావు కోరడంతో అక్కడే వదిలి వెళ్లా డు. కాగా, భార్యపై కోపంతో దుర్గారావు యామినీని గొంతు నులిమి హత్య చేశాడు. గంగాభవాని ఇంటికి తిరిగి వచ్చేసరికి యామి ని విగతజీవిగా పడి ఉంది. వెంటనే చిన్నారిని ఎల్బీనగర్లోని లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. యామిని చనిపోయిన ట్లు ధ్రువీకరించారు. గంగాభవాని ఫిర్యాదుతో పో లీసులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. -
లైంగికదాడి.. హత్య!
బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. ప్రశ్నిస్తే పెళ్లి బస్సు సిబ్బంది అన్నాడు.. గురువారం రాత్రి పెళ్లికి వచ్చిన ఆ అగంతకుడు .. ఓసారి పెళ్లికొడుకు తరఫు మనిషినని.. మరోసారి పెళ్లికుమార్తె తరఫున అని పొంతన లేకుండా చెప్పాడని.. మరి కొందరితో పెళ్లి బస్సు సిబ్బంది అని చెప్పాడని పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో అతనే హంతకుడై ఉంటాడని అనుమానిస్తున్నారు. హంతకుడు కర్ణాటక వాసి? కల్యాణమండపంలో సంచరించిన హంతకుడి ఆనవాళ్లను సీసీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు కర్ణాటక వాసిగా నిర్థారణకు వచ్చారు. దీంతో అతనికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, కోలార్, కేజీఎఫ్ జిల్లాలోని డీసీఆర్‌బీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మానవ మృగాల ఆట కట్టిస్తాం అభం శుభం తెలియని చిన్నారులను బలిగొనే మానవ మృగాల ఆట కట్టిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. దారుణ హత్యాచారానికి గురయిన బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాళ్యంకు చెందిన వర్షిత (5) కుటుంబాన్ని శనివారం ఆమె తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్షిత హంతకుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
ఆక్సిజన్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్.. పసికందు మృత్యువాత
హిందూపురం: ఆక్సిజన్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించటంతో పుట్టిన కొన్ని గంటల్లోనే పసికందు మృత్యువాత పడిన దుర్ఘటన అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వివరాలివీ.. హిందూపురం పట్టణ సమీపంలోని కొట్నూరుకు చెందిన సుహేల్ భార్య మదీన బేగంకు పురిటినొప్పులు రాగా, శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవం అవుతుందన్నారు. తర్వాత కొద్దిసేపటికి అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వస్తుందని చెప్పి ఆపరేషన్ చేశారు. మగబిడ్డ పుట్టాడు. కొంత సమయం తర్వాత బిడ్డ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడంటూ కృత్రిమంగా ఆక్సిజన్ ఇవ్వాలని చిన్నపిల్లల వార్డుకు తరలించారు. ఆక్సిజన్ ఇస్తున్న సమయంలో సంబంధిత యూనిట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో పసిబిడ్డ మృతి చెందింది. బిడ్డ చనిపోవడంతో బాధితులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సూపరింటెండెంట్ కేశవులు మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని, బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణంతోనే మృతి చెందినట్లు చెప్పారు. -
పురిటిలోనే పసిగుడ్డు మృతి.. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున పురిటిలోనే ఓ శిశువు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బాధిత బంధువులు ఆస్పత్రిపై దాడిచేశారు. డిచ్పల్లి మండలం ఇస్లాంపుర కాలనీకి చెందిన ముస్కాన్ నిండు గర్భిణి. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు డెలివరీ కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చింది. సాధారణ ప్రసవం కోసం వైద్యులు పరిశీలనలో ఉంచారు. సాయంత్రం మరోసారి సాధారణ డెలివరీ కోసం ప్రయత్నం చేశారు. గర్భిణి, శిశువు ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని వైద్యులు గుర్తించారు. రాత్రి ఒంటి గంటకు సదరు గర్భిణికి బ్లీడింగ్ కావడంతో హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసే సరికి అప్పటికే శిశువు మృతిచెందింది. విషయం తెలుసుకున్న బాలింత బంధువులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆగ్రహించారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌ను ధ్వంసం చేశారు. అత్యవసర విభాగంలోని గదులను ధ్వంసం చేశారు. కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. నలుగురు వ్యక్తులు వైద్యులను సైతం బెదిరించారని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు పేర్కొన్నారు. ఈ సంఘటనపై అధికారులు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడులు చేయడం అమానుషం.. ఆస్పత్రిపై దాడికి నిరసనగా వైద్యులపై దాడికి యత్నించడంతో ఆస్పత్రిలోని వైద్యులు బుధవారం నిరసనకు దిగారు. విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు, ఐఎంఏ వైద్యులు కలిసి ఆస్పత్రి ప్రవేశ మార్గం వద్ద నిరసన తెలిపారు. తక్షణమే దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఐఎంఏ అధ్యక్షురాలు కవిత రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు చేయడం అమానుషమన్నారు. ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉన్నప్పటికి ఉన్న వైద్యులు భారంగా వైద్య సేవలు అందిస్తున్నారని ఇలాంటి సమయంలో దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ప్రతి వైద్యుడు ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తాడని కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రిపై, డాక్టర్లపై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఐఎంఏ కార్యదర్శి సవిత, రాణి, వైద్యులు పాల్గొన్నారు. -
కన్నతండ్రే కాలయముడయ్యాడు..
చౌటుప్పల్: ఆ చిన్నారి పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు.. భార్యపై ఉన్న కోపాన్ని పసిబిడ్డపై చూపించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన సిలివేరు శివకు హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన అక్షరతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయిన నాటినుంచే శివ, భార్యపై అయిష్టంగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో అక్షర గర్భం దాల్చింది. ఈ విషయం నచ్చని శివ అబార్షన్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోక మొదటి కాన్పు కావడంతో ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. 3 నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు నిహారిక అని పేరు పెట్టారు. ఇటీవల అక్షర బిడ్డతో కలసి భర్త వద్దకు వచ్చింది. ఆదివారం భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. కొద్ది సేపటి తర్వాత అక్షర పడక గది నుంచి బయటకు వెళ్లింది. అంతలోనే శివ, పసిపాప నిహారిక గొంతు నులుముతుండటం చూసి వెంటనే బిడ్డను లాక్కుంది. అప్పటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పాపను హుటాహుటిన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున పాప మృతిచెందింది. -
గర్భశోకం
⇒వైద్యుల నిర్లక్ష్యంతో మగ శిశువు మృతి ⇒పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే కడుపుకోత మిగిల్చిన వైనం ⇒పిండం సరిగా కదలడం లేదని చెప్పినా పట్టించుకోని దుస్థితి ⇒ ఆందోళన చేసిన కుటుంబ సభ్యులు అనంతపురం మెడికల్: సర్వజనాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఆదివారం ఉదయం మగశిశువు మృతి చెందాడు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గొల్లవాండ్లపల్లికి చెందిన జయలక్ష్మి, నాగరాజు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. రెండో సారి గర్భం దాల్చడంతో డోన్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీ ఈడీడీ (ప్రసవం అయ్యే తేదీ) అంచనా వేశారు. ఇటీవల స్కానింగ్ చేయించుకోగా 16వ తేదీ అవుతుందని ఈడీఈ వచ్చింది. అనుకున్న సమయానికి ప్రసవం కాకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. అనంతపురం సర్వజనాస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు బాగా అందిస్తారని, పుట్టిన పిల్లలకు అనారోగ్యం చేస్తే ఎస్‌ఎన్‌సీయూలో ఉంచి వైద్యం చేస్తారని అదే గ్రామానికి చెందిన కొందరు చెప్పడంతో ఇక్కడే ప్రసవం చేయించుకోవాలనుకుంది. శనివారం ఉదయం 11.49 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి సర్వజనాస్పత్రికి వచ్చి గైనిక్ ఓపీ చూపించుకుంది. 12.38 గంటలకు అడ్మిషన్ చేయించుకున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యమే.. అడ్మిషన్ అయిన తర్వాత జయలక్ష్మికి పలు రకాల పరీక్షలు చేశారు. అయితే ఆంటినేటల్ వార్డులో ఆమెకు ఎలాంటి సౌకర్యమూ కల్పించలేదు. కనీసం బెడ్డు కూడా ఇవ్వలేదు. దీంతో అక్కడే కూర్చుండిపోయింది. వార్డులోకి వెళ్లి నడుము నొప్పిగా ఉందని చెప్పినా పట్టించుకోలేదు. గర్భంలో పిండం కదలికలు సరిగా లేవని చెప్పినా చెవికేసుకోలేదు. చివరకు రాత్రి 8 గంటల నుంచి ప్రసవ నొప్పులు ప్రారంభం అయ్యాయి. భర్తతోపాటు తల్లి మల్లమ్మను వెంట బెట్టుకుని డెలివరీ రూం వద్దకు వెళితే ‘ఇప్పుడే డెలివరీ కాదులే’ అంటూ గెంటేసేంత పని చేశారు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. భార్య పడే కష్టాన్ని చూసిన భర్త గట్టిగా మాట్లాడడంతో లోపలికి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7.10 గంటలకు జయలక్ష్మి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పిన వైద్య సిబ్బంది.. టవల్‌ను తెచ్చుకోవాలని మల్లమ్మకు సూచించారు. ఆమె తెచ్చేలోగానే బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, పుట్టిన వెంటనే ఏడవలేదంటూ ఎస్ఎన్సీయూకు పంపారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. వైద్యుల తీరుపై ఆగ్రహం తమ బిడ్డ మృతికి వైద్యులే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. అక్కడే ఆందోళనకు దిగారు. ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి నరకయాతన అనుభవించామని, తీరా ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెప్పడం ఎంత వరకు న్యాయమని రోదిస్తూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ డాక్టర్ లలిత అక్కడికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జయలక్ష్మి ఇక్కడికి వచ్చే సమయానికే గర్భంలోని శిశువు పరిస్థితి బాగా లేదని చెప్పారు. అయితే దీన్ని బాధితులు ఖండించారు. మీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలా చెబుతారా అని ప్రశ్నించారు. దీంతో విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పడంతో నాగరాజు తన బిడ్డను తీసుకుని ఖననం చేసేందుకు వెళ్లిపోయాడు. బాగా చూస్తారని వస్తే చంపేశారయ్యా.. కాగా బిడ్డ మృతి చెందిన విషయం తల్లికి ఆలస్యంగా తెలిసింది. ప్రసవానంతరం ఆమెను పోస్ట్‌నేటల్ వార్డులోకి తీసుకెళ్లిన తర్వాత శిశువుకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రెండు గంటల తర్వాత ఈ విషయం చెప్పడంతో జయలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. ‘బాగా చూస్తారని వస్తే చంపేశారయ్యా.. రాత్రి నుంచి చెబుతానే ఉన్నా..ఎవరూ పట్టించుకోలేదు’ అని రోదించింది. పక్కనే ఉన్న బాలింతలు సర్దిచెప్పినా ఆమె కన్నీరు మాత్రం ఆగలేదు. ఇదేం ఆస్పత్రయ్యా : మల్లమ్మ, జయలక్ష్మి తల్లి ఈ ఆస్పత్రికి గురించి ఎంతో గొప్పగా చెబుతారు. కానీ ఇక్కడేందయ్యా ఇలాగుంది. నా బిడ్డ నొప్పులతో బాధపడుతుంటే పట్టించుకునే వాళ్లే లేరు. నా అల్లుడు గొడవ పెట్టుకుంటే డెలివరీకి తీసుకెళ్లారు. మగ బిడ్డ మూడు కేజీలుంది. కానీ ఏం లాభం? అంతా కలిసి చంపేశారు. -
చచ్చిపోయిన బాబును ఎట్ల తేవాలి సార్?
కలెక్టర్ ఎదుట కంట తడిపెట్టి రహ్మాన్ సాక్షి, జగిత్యాల: ‘సార్ నా భార్య బాబు కావాలని అడుగుతుంది. ఏం తింటలేదు.. చచ్చి పోయిన బాబును ఎక్కడ్నుంచి తేవాలి? మీరే ఒకసారి వచ్చి మా భార్యకు నచ్చజెప్పుండి’అని ఇర్ఫానా భర్త రహ్మాన్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు. జగిత్యాల ఆస్పత్రిలో జూలై 7న సెల్ఫోన్లో వైద్యం చేసిన నేపథ్యంలో శిశువు చనిపోయిన విషయం తెలిసిందే. సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చిన కలెక్టర్ శరత్ మీడియాతో మాట్లాడుతున్న ప్పుడు అక్కడికి వచ్చిన రహ్మాన్ తన భార్య బాధను వివరించాడు. అయితే.. ఇంత వరకు ఇర్ఫానాకు ఆమె బిడ్డ చనిపోయిన విషయం తెలియకపోవడం.. కలెక్టర్ వెళితే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందని వైద్యాధికారి చెప్పడంతో కలెక్టర్ ఇర్ఫానాను పరామర్శించకుండానే వెనుదిరిగారు. జగిత్యాల ఆస్పత్రి వార్డ్బాయ్ సస్పెండ్ ఫోన్లో వైద్యం, శవాన్ని ఎలుకలు పీక్కుతిన్న ఘటనలపై విచారణ ఆస్పత్రిలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్: కలెక్టర్ శరత్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన జగిత్యాల ధర్మాస్పత్రి సిబ్బందిపై వేటుపడింది. ఈ నెల 9న రాత్రి ఆస్పత్రిలోని మార్చురీలో శవాన్ని ఎలుకలు పీక్కుతిన్న సంఘటన కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. దీనిపై స్పందించిన కలెక్టర్ డాక్టర్ శరత్ ఆస్పత్రి మార్చురీలో రెండు ఫ్రీజర్లు ఉన్నా.. శవాన్ని ఎలుకలు తినేలా నిర్లక్ష్యంగా కింద పడేసిన వార్డుబాయ్ సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. ఈ నెల 7న రాత్రి జగిత్యాలకు చెందిన ఇర్ఫానా ఘటనలో సెల్ఫోన్లో డాక్టర్ చెప్పినట్లు స్థానిక సిబ్బంది వైద్యం అందించగా శిశువు మృతి చెందింది. ఈ సంఘటనపై ఆర్డీవో నరేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుగంధినిని విచారణకు ఆదేశించారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్య తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఇటీవల జిల్లా కేంద్రాస్పత్రిలో చోటుచేసుకున్న వరుస సంఘటనల నేపథ్యంలో ఆయన జిల్లాస్పత్రి ని సోమవారం సందర్శించి వైద్య, పారిశుధ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. విధులను నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బంది సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. -
ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు పసికందుల మృతి
వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆందోళన కామారెడ్డి క్రైం (కామారెడ్డి): కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో బుధవారం అప్పుడే పుట్టిన ఇద్దరు పసికందులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వారి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగగా, పోలీసులు వచ్చి సముదాయించారు. కామారెడ్డి మండలం సరంపల్లికి చెందిన కొత్తూరి పెద్దబాపురాజు భార్య మణెమ్మ బుధవారం ఉదయం మూడో కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే ఆమె కడుపులో కవలలున్నట్లు వైద్యులు నిర్ధారించగా, ఉదయం 9.45 గంటలకు ఆడశిశువుకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం 1 గంట వరకు రెండో శిశువు సాధారణ డెలీవరీ కోసం వైద్యులు ప్రయత్నించారు. తర్వాత ఆపరేషన్ చేశారు. అప్పటికే కడుపులో శిశువు మృతి చెందింది. వైద్యులు ఆలస్యం చేయడంతోనే శిశువు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. కాగా, ఆస్పత్రికి మంగళవారం రాత్రి భిక్కనూర్‌కు చెందిన గొండ్ల నవీన్ తన భార్య శిరీషను మొదటి డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సాధారణ డెలివరీ కాగా, పుట్టిన మగశిశువుకు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డెలివరీ చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు పరిస్థితి విషమంగా మారిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న శీరీష కుమారుడిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయాడు. దీంతో వారి బంధువులు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు గంటలపాటు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. -
భార్యా పిల్లలను కత్తితో పొడిచి..
గొంతుకోసుకుని భర్త ఆత్మహత్య తిరుపతిలో దారుణం కత్తిపోట్లతో భార్య కడుపులో శిశువు మృతి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏం కష్టమొచ్చిందో.. ఏం గొడవ జరిగిందో తెలీదు కానీ ఓ యువకుడు భార్యా బిడ్డలను దారుణంగా కత్తితో పొడిచి తనూ ఆత్యహత్య చేసుకున్నాడు. కత్తి పోట్లతో భార్య కడుపులో ఉన్న శిశువు మృతి చెందగా.. భార్య, కుమార్తె ప్రాణాలతో కొట్టుమిట్టా డుతున్నారు. ఈ ఘటన బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతిలోని అబ్బన్న కాలనీలో చోటుచేసుకుంది. తిరుపతి నగరానికి చెందిన సాత్విక్కుమార్(27) భార్య మహాలక్ష్మి (24), కుమార్తె సాహితి (3)తో కలసి ఉంటున్నాడు. సాత్విక్ కొన్నాళ్ల పాటు ఓ సెల్యులార్ సంస్థలో ఉద్యోగం చేశాడు. మూడు నెలల కిందటే ఉద్యోగం మానేసి ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తున్నాడు. బుధవారం ఉదయం స్కూలుకు వెళ్లి కుమార్తె సాహితిని ఇంటికి తీసుకొచ్చి మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్నాడు. తిరుత్తణి ఆలయంలో ఉన్న అత్త శ్యామలతో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి ఇంట్లోకి వస్తూనే భార్యపై కత్తితో దాడి చేశాడు. పక్కనే ఉన్న కూతురును కూడా పొడిచాడు. అదే కత్తితో అతనూ గొంతుకోసుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల తో ఉన్న చిన్నారి సాహితీని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చావు బతుకుల్లో ఉన్న మహాలక్ష్మి 9 నెలల నిండు గర్భిణి. బుధవారం ఆమె జన్మదినం కూడా. కత్తిపోట్ల కారణంగా ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందింది. మహాలక్ష్మి, సాహితీల పరిస్థితి విషమంగా ఉంది. -
క్షుద్ర పూజలకు పసికందు బలి
28 రోజుల పసిగుడ్డును చంపేసిన తండ్రి ఒంగోలు క్రైం: క్షుద్ర పూజల కోసం ఒక తండ్రి కొడుకునే బలిచ్చిన దుర్ఘటన సోమవారం ఒంగోలులో జరిగింది. ఒంగోలు నగరం వెంగముక్కపాలెం రోడ్డులోని మదర్ థెరిస్సా కాలనీకి చెందిన సిద్ది రాజారెడ్డి అలియాస్ దెయ్యాల రాజారెడ్డి (50) క్షుద్రపూజలు చేస్తుంటాడు. రెండేళ్ల కిందట మతి స్థిమితం లేని మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి నెల కిందట మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు పక్కింట్లోని బాలింత కళావతి తన స్తన్యాన్నిచ్చి ఆకలి తీర్చేది. ఇలా పాలివ్వడానికి వచ్చిన ఆమెకు పసిబిడ్డ కనిపించలేదు. రాజారెడ్డిని నిలదీసినా ఫలితం లేకపోవడంతో స్థానికులు వచ్చి దేహశుద్ధి చేశారు. దీంతో బిడ్డను తానే చంపానని మూలన పడేసిన మృతదేహాన్ని చూపించాడు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
భద్రాచలంలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఉదయం వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందింది. మహిళ ప్రసవ సమయంలో వైద్యులు అలసత్వం ప్రదర్శించారని, అందువల్లే శిశువు మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దాంతో ఆసుపత్రి ఎదుట బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.