ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు పసికందుల మృతి
వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆందోళన
కామారెడ్డి క్రైం (కామారెడ్డి): కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో బుధవారం అప్పుడే పుట్టిన ఇద్దరు పసికందులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వారి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగగా, పోలీసులు వచ్చి సముదాయించారు. కామారెడ్డి మండలం సరంపల్లికి చెందిన కొత్తూరి పెద్దబాపురాజు భార్య మణెమ్మ బుధవారం ఉదయం మూడో కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే ఆమె కడుపులో కవలలున్నట్లు వైద్యులు నిర్ధారించగా, ఉదయం 9.45 గంటలకు ఆడశిశువుకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం 1 గంట వరకు రెండో శిశువు సాధారణ డెలీవరీ కోసం వైద్యులు ప్రయత్నించారు.
తర్వాత ఆపరేషన్ చేశారు. అప్పటికే కడుపులో శిశువు మృతి చెందింది. వైద్యులు ఆలస్యం చేయడంతోనే శిశువు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. కాగా, ఆస్పత్రికి మంగళవారం రాత్రి భిక్కనూర్‌కు చెందిన గొండ్ల నవీన్ తన భార్య శిరీషను మొదటి డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సాధారణ డెలివరీ కాగా, పుట్టిన మగశిశువుకు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డెలివరీ చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు పరిస్థితి విషమంగా మారిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న శీరీష కుమారుడిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయాడు. దీంతో వారి బంధువులు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు గంటలపాటు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను సముదాయించారు.