వివరాలు వెల్లడిస్తున్న కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఎస్‌ఐ షఫీ,తన్తిత (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ప్రియుడిపై మోజుతో కన్నబిడ్డనే కడతేర్చిందో కసాయి తల్లి. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందినట్టు చిత్రీకరించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయింది. కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు.
ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడకు చెందిన నాయక్‌వడి రమేష్ (30) కల్యాణి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల కూతురు తన్విత సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లి, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు.
కల్యాణి కుషాయిగూడ మార్కెట్‌లో పని చేస్తూ.. సమీపంలో కూతురు తన్వితతో కలిసి ఉంటోంది. ఈ నెల 1న కల్యాణి కూతురు తన్వితకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అంతా కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే వైద్యులు తన్విత చనిపోయినట్లు ప్రకటించారు. రోజూ మాదిరిగానే స్కూల్‌కు వెళ్లి వచ్చిన కూతురు భోజనం చేసి పడుకుందని, నిద్రలోనే ఇలా జరిగిందని కల్యాణి అందరినీ నమ్మించింది.
అనుమానంతో ఫిర్యాదు...
భార్య తీరుపై అనుమానం కలిగిన తండ్రి రమేష్ తన కూతురు చనిపోలేదని, చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఊపిరాడకపోవడంతో చిన్నారి చనిపోయినట్టు వెల్లడైంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా వాస్తవం వెలుగులోకి వచ్చింది.
అడ్డు తొలగించుకోవాలని...
కల్యాణికి జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన ఇండ్ల నవీన్‌కుమార్ (19) అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. కుషాయిగూడలో కూతురుతో కలిసి ఉంటున్న కల్యాణి వద్దను అతను తరచూ వచ్చేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. కల్యాణి భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. విడాకులు సాధ్యం కాకపోవడంతో కూతురు తన్వితను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 1న స్కూల్ కు వెళ్లి వచ్చిన తన్విత నిద్రలో ఉండగా ముందే వేసుకున్న ఫ్లాన్ ప్రకారం ముఖంపై బెడ్‌షీట్ కప్పి దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. నిందితులు కల్యాణి, నవీన్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. చిన్నారి హత్య కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ షేక్ షఫీలను డీసీపీ జానకి, ఏసీపీ వెంకట్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment