కలెక్టర్ శరత్
కలెక్టర్ ఎదుట కంట తడిపెట్టి రహ్మాన్
సాక్షి, జగిత్యాల: ‘సార్ నా భార్య బాబు కావాలని అడుగుతుంది. ఏం తింటలేదు.. చచ్చి పోయిన బాబును ఎక్కడ్నుంచి తేవాలి? మీరే ఒకసారి వచ్చి మా భార్యకు నచ్చజెప్పుండి’అని ఇర్ఫానా భర్త రహ్మాన్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు. జగిత్యాల ఆస్పత్రిలో జూలై 7న సెల్‌ఫోన్‌లో వైద్యం చేసిన నేపథ్యంలో శిశువు చనిపోయిన విషయం తెలిసిందే. సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చిన కలెక్టర్ శరత్ మీడియాతో మాట్లాడుతున్న ప్పుడు అక్కడికి వచ్చిన రహ్మాన్ తన భార్య బాధను వివరించాడు. అయితే.. ఇంత వరకు ఇర్ఫానాకు ఆమె బిడ్డ చనిపోయిన విషయం తెలియకపోవడం.. కలెక్టర్ వెళితే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందని వైద్యాధికారి చెప్పడంతో కలెక్టర్ ఇర్ఫానాను పరామర్శించకుండానే వెనుదిరిగారు.
జగిత్యాల ఆస్పత్రి వార్డ్‌బాయ్ సస్పెండ్
ఫోన్‌లో వైద్యం, శవాన్ని ఎలుకలు పీక్కుతిన్న ఘటనలపై విచారణ
ఆస్పత్రిలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్: కలెక్టర్ శరత్
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన జగిత్యాల ధర్మాస్పత్రి సిబ్బందిపై వేటుపడింది. ఈ నెల 9న రాత్రి ఆస్పత్రిలోని మార్చురీలో శవాన్ని ఎలుకలు పీక్కుతిన్న సంఘటన కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. దీనిపై స్పందించిన కలెక్టర్ డాక్టర్ శరత్ ఆస్పత్రి మార్చురీలో రెండు ఫ్రీజర్లు ఉన్నా.. శవాన్ని ఎలుకలు తినేలా నిర్లక్ష్యంగా కింద పడేసిన వార్డుబాయ్ సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. ఈ నెల 7న రాత్రి జగిత్యాలకు చెందిన ఇర్ఫానా ఘటనలో సెల్‌ఫోన్‌లో డాక్టర్ చెప్పినట్లు స్థానిక సిబ్బంది వైద్యం అందించగా శిశువు మృతి చెందింది. ఈ సంఘటనపై ఆర్డీవో నరేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుగంధినిని విచారణకు ఆదేశించారు.
అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్య తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఇటీవల జిల్లా కేంద్రాస్పత్రిలో చోటుచేసుకున్న వరుస సంఘటనల నేపథ్యంలో ఆయన జిల్లాస్పత్రి ని సోమవారం సందర్శించి వైద్య, పారిశుధ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. విధులను నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బంది సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.