మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
కడప అర్బన్/చెన్నూరు : కడప నగర శివార్లలోని రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన ఓ బాలుని నిండు ప్రాణాలు వైద్యుల నిర్లక్ష్యం వల్ల గాలిలో కలిసిపోయాయి. బాలుని మృతదేహంతో కొన్ని గంటలపాటు తల్లిదండ్రులు, బంధువులు రిమ్స్ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా కొనసాగింది. బాలుని తల్లిదండ్రుల కథనం ప్రకారం.. చెన్నూరు మండలం కొక్కరాయపల్లెకు చెందిన శ్రీనివాసులు, స్వర్ణలతల కుమారుడు చెన్నూరు ధనుష్ (8). వీరికి మొదటి సంతానంగా అమృత (11) ఉన్నారు. వీరిరువురు తమ గ్రామంలోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో 2, 5 తరగతులు చదువుతున్నారు.
ఈక్రమంలో సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులు రమణయ్య, వీరనారాయణలు విధుల కోసం వచ్చారు. పాఠశాల ఆవరణంలోని చెత్తాచెదారాన్ని బయటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చెత్తాచెదారాన్ని తీసుకెళ్లి పారవేసే క్రమంలో ధనుష్‌ను ఏదో కుట్టింది. వెంటనే స్థానికులు ధనుష్‌ను చెన్నూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించారు. అక్కడ పనిచేస్తున్న వైద్య ఉద్యోగి కృష్ణారెడ్డి 108కు ఫోన్ చేశారు. అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో బైక్‌పైనే బాలుడిని బంధువులు రిమ్స్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1.30 సమయంలో రిమ్స్‌కు తీసుకురాగానే క్యాజువాలిటీలో వైద్యసేవల అనంతరం చిన్నపిల్లల వార్డుకు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. సాయంత్రం 4.30 సమయంలో «ధనుష్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.
విద్యార్థి బంధువుల ఆందోళన
రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన ధనుష్ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లే మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. చిన్నపిల్లల వార్డు వద్దనే రెండు గంటలపాటు ఆందోళన చేసిన తర్వాత రిమ్స్ సీఐ పురుషోత్తంరాజు తన సిబ్బందితో కలిసి మార్చురీలో ధనుష్ మృతదేహాన్ని పెట్టిస్తామని, మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీ వద్దకు తీసుకొచ్చినప్పటికీ లోపల పెట్టించేందుకు ఒప్పుకోలేదు. తమ పిల్లాడు ఏ కారణం చేత మృతిచెందాడన్న విషయాన్ని రిమ్స్ అధికారులు, డాక్టర్లు వెల్లడించాలని, ఆ విషయం తేలిన తర్వాతనే ఫిర్యాదు చేస్తామని పట్టుబట్టారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, సీఐలు పురుషోత్తంరాజు, హేమసుందర్‌రావు, రామకృష్ణ, దారెడ్డి భాస్కర్‌రెడ్డిలు, ఎస్‌ఐలు, సిబ్బంది బందోబస్తు ఏర్పాటుచేశా రు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే మృతుని బంధువులు ఫిర్యాదుచేయాలని, తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని, కచ్చితంగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు. కాగా రాత్రి 11గంటలకు కేసు నమోదు చేశారు.
రిమ్స్ అధికారుల వివరణ
ఈ సంఘటనపై రిమ్స్ అధికారులు మాట్లాడుతూ బాలుడిని మధ్యాహ్నం 1.38కు క్యాజువాలిటీకి తీసుకొచ్చారని, అప్పటికే పరిస్థితి విషమించిదన్నారు. అయినప్పటికీ చిన్నపిల్లల విభాగం వైద్య నిపుణులు తమవంతుగా కృషిచేసి వైద్యాన్ని అందించినప్పటికీ బాలుడు మృతి చెందాడన్నారు.
తేనెటీగలే కరిచాయి: ఎంఈఓ
పాఠశాల ప్రారంభం కాకముందే బడిబయట ఉన్న విద్యార్థి ధనుష్(7)ను తేనెటీగలు కరిచాయి. నొప్పి అని బాధపడుతుంటే అంతలో పాఠశాలకు వచ్చిన హెచ్‌ఎం రమణయ్య, ఉపాధ్యాయుడు వీరనారాయణలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి చెన్నూరు వైద్యశాలకు పంపారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. వ్యర్థాలు తొలగిస్తూ విషపురుగు కరిచిందనడంలో వాస్తవం లేదు.
Comments
Please login to add a commentAdd a comment