
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రానికి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మంజూరు కాదని తేలడంతో బీబీనగర్‌లోని క్యాంపస్‌ను రాష్ట్ర స్థాయి ఉత్తమ సంస్థగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వైద్య సేవల సంస్థగా పేరొందిన నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) బీబీనగర్ క్యాంపస్‌పై కదలిక వస్తోంది. వైద్యసేవల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకంకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపూర్‌లోని నిమ్స్ విశ్వవిద్యాలయం క్యాంపస్ పూర్తి స్థాయి కార్యకలాపాల నిర్వహణకు కొత్తగా 873 పోస్టులు అవసరమవుతాయని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు గత నెల 28న కొత్తగా పోస్టులను మంజూరు చేసింది.
కొత్తగా మంజూరైన పోస్టులు కావడంతో ఏ విధానంలో భర్తీ చేయాలనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి అనుసరించే ప్రక్రియపై అనుమతికోసం వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఆమోదం రాగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీబీనగర్ నిమ్స్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులలో 248 బోధన సిబ్బంది కేటగిరీవి ఉన్నాయి. మరో 625 బోధనేతర (వైద్య సహాయక, పరిపాలన, సాంకేతిక) పోస్టులు ఉన్నాయి.
ఎయిమ్స్ తరహాలోనే నిమ్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని వైద్య శాఖ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో పేర్కొంది. ప్రతిపాదనల ప్రకారం బోధన సిబ్బంది పోస్టులను నిమ్స్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. నిమ్స్ ఉన్నతస్థాయి కమిటీ బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తుంది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య సంచాలకుడు, నిమ్స్ డైరెక్టర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరో ఉన్నతాధికారి ఈ కమిటీలో ఉంటారు. మొత్తం బోధన సిబ్బంది పోస్టులను మెరిట్ ఆధారంగా ఈ కమిటీ భర్తీ చేస్తుంది. జనవరిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో...
బీబీనగర్ నిమ్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మొత్తం 873 పోస్టులు 58 కేటగిరీలో ఉన్నాయి. వీటిని మినహాయించి 50 కేటగిరీలోని 625 పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) భర్తీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment