శవాలపై చిల్లర ఏరుకుంటున్నారు!
మృతదేహాల తరలింపులో కాసుల కక్కుర్తి
⇒ ఉచిత వాహనాలున్నా బాధితులను డబ్బులు డిమాండ్ చేస్తున్న సిబ్బంది
⇒ 3 నెలల్లో పేద బాధితుల సొంతూళ్లకు 3,390 మృతదేహాల తరలింపు
⇒ మరో 50 వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉంచిన ఉచిత శవాల తరలింపు వాహనాల (పార్థివ)కు డిమాండ్ ఏర్పడడంతో కొన్నిచోట్ల వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వద్ద మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన భర్త శవాన్ని తరలించేందుకు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఉచిత వాహన సదుపాయానికి అక్కడి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆమె ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటుండడంతో మృతదేహాలను ఉచితంగా తరలించాలన్న వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యానికి తూట్లుపడుతు న్నాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బాధితులు సూచిస్తున్నారు.
ఎక్కడైనా ఉచిత తరలింపు వాహనాలకు డబ్బులు డిమాండ్ చేస్తే సహించబోమని.. సస్పెండ్, బదిలీ వంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి కార్యాలయం హెచ్చరించింది. సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి సూపరింటెం డెంట్ లేదా ఆర్‌ఎంవోను కలసి పార్థివ వాహన సౌకర్యంకోసం సంప్రదించాలని, తక్షణమే వారు వాహనాన్ని సమకూర్చుతా రని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతోనే స్వగ్రామాలకు మృతదేహాలను తరలిస్తార ని... ఎవరికీ ఒక్కపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
3 నెలల్లో 3,390 శవాల తరలింపు..
మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం పేదల శవాలను వారి సొంతూళ్లకు ఉచితం గా తరలించేందుకు 50 వాహనాలను సమకూర్చిన సంగతి తెలిసిందే. గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే కేన్సర్ తదితర ఆసుపత్రుల వద్ద 32 వాహనాలను అందుబాటులో ఉంచారు. ఇక మిగిలిన వాహనాలను పాత జిల్లా కేంద్రాలకు రెండు మూడు చొప్పున కేటాయించారు. గతేడాది నవంబర్ 18వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు 3,390 మృతదేహాలను ఉచితంగా తరలించారు. అందులో ఒక్క హైదరాబాద్ నుంచే 2,463 శవాలను తరలించారు. వరంగల్ నుంచి 202 శవాలను తరలించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 155 శవాలను, కరీంనగర్‌లో 79, ఖమ్మం జిల్లాలో 144, మహబూబ్‌నగర్‌లో 83, మెదక్‌లో 79, నల్లగొండ జిల్లాలో 92, నిజామాబాద్‌లో 93 మృతదేహాలను తరలించారు.
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో రోజుకు సరాసరి 30 మంది చొప్పున చనిపోతుంటారని అంచనా. వారంతా కూడా దాదాపు పేదలే ఉంటారు. వారికి ఈ వాహనాలు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుదూరంలో ఉన్న ప్రాంతానికి శవాన్ని తరలించాలంటే కనీసం రూ. 15 వేలు అడుగుతున్న నేపథ్యంలో ఉచిత సర్వీసులు చాలా ఉపయోగపడు తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధాన ఆసుపత్రుల వద్దే కాకుండా సమీపంలో ఎక్కడైనా ప్రమాదం జరిగి చనిపోతే ఆ శవాలను కూడా తరలించడానికి పార్థివ వాహనాలను ఉపయోగిస్తున్నారు.
మరో 50 కొత్త వాహనాలు
మృతదేహాల తరలింపు వాహనాలను పేదలు ఉపయోగించుకుంటున్న నేప థ్యంలో మరో 50 వాహనాలను సమకూ ర్చాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇవి అందుబాటులోకి వస్తే కొత్త జిల్లా కేంద్రా ల్లోనూ సేవలు అందించే అవకాశం ఉంది.