
సాక్షి, హైదరాబాద్: దేశానికి ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ గాడితప్పుతోంది. పథకంపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. పూర్తిస్థాయి ఉన్నతాధికారి లేకపోవడం, ఇతర సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తుండటంతో సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులతో కలసి పలువురు అధికారులు, సిబ్బంది చేస్తున్న నిర్వాకాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి పరిశీలనలోనూ ఇవే అంశాలు బయటపడ్డాయి.
రాష్ట్రంలో వైద్య శాఖ పనితీరు, కేంద్ర పథకాల అమలును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్.. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించి వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఇన్‌చార్జి సీఈవో కె.మనోహర్ ఇచ్చిన నివేదికపై ప్రీతి అనేక సందేహాలు వ్యక్తం చేశారు. రోగులకు అవసరం లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలు జరుగుతున్నాయని, నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రస్టు సీఈవో చెప్పగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో లోపాలు సరిదిద్దాలని సూచించారు.