జి.సిగడాం: జిల్లాలోని ఉద్దాన తీర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులపై పూర్తి స్థాయిలో సర్వే చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతిరావు వెల్లడించారు. స్థానిక 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఉద్దానం తీరప్రాంతాల్లో 7 మండలాల్లో 114 గ్రామాల్లో సుమారుగా 1.30లక్షల మందికి కిడ్నీ వ్యాధులపై సమగ్ర సర్వే జరుపుతామన్నారు. ఇంతవరకు 15 బృందాలతో 77 గ్రామాల్లో 47 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.
జిల్లాలోని రిమ్స్ కేంద్రంలో ఉచితంగా డెంగీ తనిఖీ, రక్తఫలకికల (ప్లేట్‌లెట్స్) నమూనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలో రోగులకు ఉచితంగా డెంగీ పరీక్ష చేస్తామని, అవసరమైన వారికి ప్లేట్‌లెట్స్ అందిస్తామని తిరుపతిరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా రాకుండా గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చామని వివరించారు. కొన్ని పంచాయతీల్లో తాగునీటిలో ఫ్లోరిన్ ఉండడంతో.. వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
స్వైన్‌ఫ్లూ రాకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం రిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. జ్వరాల కోసం జిల్లాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. రాజాం, పాలకొండ, టెక్కలి, పలాస, శ్రీకాకుళం రిమ్స్ ఆరోగ్యకేంద్రాల్లో 24 గంటలు ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేశామని తిరుపతిరావు తెలిపారు. వేసవిలో ఎండలు అధికంగా ఉన్నాయని, వీటి అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయనతోపాటు వైద్యఅధికారులు ముంజేటి కోటేశ్వరరావు, శివప్రసాద్, గౌతమి ప్రియాంకలతోపాటు సిబ్బంది ఉన్నారు.
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై సమగ్ర సర్వే
Published Wed, Mar 15 2017 11:13 PM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement