సమగ్ర సర్వేపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
ఏ ఒక్క ఇంటినీ వదలకుండా సర్వే నిర్వహించండి
ఆటంకం కలిగించేవారిని ఉపేక్షించొద్దు.. ప్రజల అభ్యున్నతి కోసమే వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని, నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
మొదటి దశలో చేసిన నివాసాల లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా 1,16,14,349 ఇళ్లకు స్టిక్కరింగ్, మార్కింగ్ చేశామని తెలిపారు. వాటిలో ఏ ఒక్క ఇంటినీ వదిలేయకుండా.. ప్రతి ఇంటిలో సమగ్రంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌరుల అభ్యున్నతి కోసమే వివరాల సేకరణ జరుగుతోందని చెప్పారు. సర్వేను రాష్ట్ర గవర్నర్ వివరాల సేకరణతో ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆటంకం కలిగిస్తే ఉపేక్షించొద్దు..
సమగ్ర సర్వేలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని సీఎం పేర్కొన్నారు. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
44.1 శాతం పూర్తయింది..
శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం సర్వే పూర్తయిందని.. సర్వేలో 87,807 మంది సిబ్బంది, 8,788 మంది పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రజల నుంచి స్పందన బాగుందని వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment