జిల్లాల వారీగా సమీక్షలో అధికారుల వెల్లడి
సాక్షి, అమరావతి: కుష్టువ్యాధిని పూర్తిగా నిర్మూలించామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. తాజాగా నమోదైన కేసులు కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. గడిచిన ఒక్క ఏడాదిలోనే 590 మందికిపైగా చిన్నారులకు కుష్టు వ్యాధి సోకినట్లు తేలింది. ఈ ఏడాది 4,200 కేసులకుపైగా నమోదయ్యాయి. కుష్టువ్యాధి (లెప్రసీ)పై అన్ని జిల్లాల అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలు బయటపడ్డాయి. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలోనే గడచిన ఏడాది కాలంలో 67 కుష్టు వ్యాధి కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించడం కలకలం రేపుతోంది.
కృష్ణా జిల్లాలోనూ 2016–17లో 41 కేసులు నమోదయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం భారీగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆర్బీఎస్‌కే (రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం) పథకం అమలు అధ్వానంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో చిన్నారుల్లో తొలి దశలోనే వ్యాధి లక్షణాలు గుర్తించే అవకాశం లేకుండా పోతోందని తెలుస్తోంది. 2016–17లో రూ.2 కోట్లకుపైగా నిధులిస్తే అందులో 25 శాతం కూడా ఖర్చు చేయలేక పోయారని ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు.
590 మంది చిన్నారులకు కుష్టు వ్యాధి
Published Thu, Feb 23 2017 2:37 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement