leprosy
-
Lanka Sita: బడుగు జీవుల దారిదీపం ఈ పెద్దక్క
లంక సీత వయసు 81. ఢిల్లీతో 61 ఏళ్ల అనుబంధం. ఢిల్లీలో ఉండనని ఏడ్చిన రోజులు... ఇంత నగరంలో ఎలా జీవించాలి... అనే ఆందోళన. జీవించడం ఎలాగో నేర్పిన గురువుది కూడా ఆ నగరమే. తెలుగుదనంతో ఢిల్లీలో అడుగుపెట్టిన నాటి తరం అమ్మాయి. తనలాగ ఎందరో... వాళ్లకు బతికే దారేది... అనుకుంది. అలాంటి అభాగ్యులకు అక్క అయింది... వారి జీవికకు దారి చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, తణుకులో పుట్టిన లంక సీత దేశ రాజధానితో ముడివడిన తన జీవిత గమనాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది అమ్మమ్మగారింట్లో తణుకులోనే, కానీ సొంతూరు నర్సాపురం. నాన్న ఉద్యోగరీత్యా నా చదువు కొంతకాలం నర్సాపురం, మరికొంత కాలం తణుకులో అమ్మమ్మగారింట్లో సాగింది. నాకు చదువంటే ఎంత ఇష్టమంటే ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి టేబుల్ అందకపోతే నిలబడి పరీక్ష రాశాను తప్ప పరీక్ష మానలేదు. ఎస్ఎస్ఎల్సీ తర్వాత అనుకోకుండా పెళ్లి సంబంధం రావడం, మంచి సంబంధం, అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని పెళ్లి చేసి మా వారితోపాటు నన్ను ఢిల్లీకి పంపించారు మా వాళ్లు. పంజాబీల ఇంట్లో అద్దెకుండేవాళ్లం. ఇంగ్లిష్ అయితే నెగ్గుకొచ్చేదాన్ని, కానీ హిందీ అక్షరం కూడా మాట్లాడలేని పరిస్థితి. నాకు ఢిల్లీ అలవాటయ్యే లోపే భూకంపం వచ్చింది. మా ఓనర్ నన్ను గట్టిగా పిలుస్తూ పంజాబీలో, హిందీలో ఏదో చెప్తోంది. అర్థం చేసుకునేలోపు ఆవిడే వచ్చి బయటకు లాక్కువెళ్లింది. ఆ తర్వాత తెలిసింది నాకు అది భూకంపం అని. ఢిల్లీలో ఉండనని ఏడవడం అప్పుడు మొదలైంది. ఆ తర్వాత ఒక రోజు కడుపు నొప్పి కారణంగా మా వారిని హాస్పిటల్లో చేర్చారు. అది గుండెనొప్పి అని ఆయన దూరమైన తర్వాత తెలిసింది నాకు. కంపాషన్ గ్రౌండ్స్‌లో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఇల్లు దాటి ఢిల్లీ వీథులు, సిటీ బస్సులతో నా జీవన యానం మొదలైంది. ఆఫీసులో ఉన్నా సరే నా కళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్న నీలిమేఘాల్లా ఉండేవి. ఉద్యోగంలో పని నేర్చుకోవడం, ప్రైవేట్‌గా చదువుకోవడం మొదలు పెట్టిన తర్వాత నా మీద నాకు నమ్మకం కలిగింది. నా కళ్లు కన్నీళ్లను మరచిపోయాయి. ► మళ్లీ చదువు! ఇంటర్, బీఏ, ఎంఏ, ఆ తర్వత జర్నలిజం చేశాను. చైనా సామాజిక జీవనం పట్ల అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో చైనీస్ భాష నేర్చుకోవడానికి లింగ్విస్టిక్స్‌లో చేరాను. కానీ ఉద్యోగంలో ప్రమోషన్ తర్వాత పని భారం కారణంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టలేకపోయాను. ఆర్థిక, సామాజిక పరిశోధన రంగంలో పని చేశాను. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో అమ్మ కోసం నాలుగేళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకున్నాను. ఉద్యోగంలో నా పని సామాజిక స్థితిగతుల మీద అధ్యయనం కావడంతో 2002లో సైరస్ (సీత ఆల్ ఇండియా రీసెర్చ్ అండ్ సోషల్ సర్వీసెస్) స్థాపించి విశ్రాంత జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేశాను. ► మహిళ పరిస్థితి మారలేదు! ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా దేశ రాజధాని నగరంలో నన్ను నేను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. నాలాగ తన కాళ్ల మీద తాము నిలబడాల్సిన స్థితిలో ఉన్న మహిళల కోసం ఏదైనా చేయాలనిపించింది. మహిళలు, యువకులు, వృద్ధులకు కూడా ఉపయోగపడేవిధంగా సైరస్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. మహిళలకు ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయడం, ఉపాధి మార్గాలను తెలియచేసి సహకారం అందించడం, తాగుబోతు భర్తల కారణంగా బాధలు పడుతున్న వాళ్లకు ఆసరాగా నిలవడం, మగవాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి తాగుడుకు బానిసలు కాకుండా కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించే వరకు పర్యవేక్షిస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టాం. పిల్లలకు పోషకాహారం అందించడం, స్కూలుకి పంపేలా చూడడం, వృద్ధుల ఆరోగ్య సంరక్షణతోపాటు వారిని సమాజంలో ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయడం, యువతను చైతన్యవంతం చేయడం వంటి కార్యక్రమాలతో పని చేస్తోంది సైరస్. ► వర్తమానమే ప్రధానం! మా సైరస్ సంస్థలో పన్నెండు మందిమి ఉన్నాం. మేమందించే మా సేవలలో మాకు సహకరించే డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, వాలంటీర్లున్నారు. మేము ఎవరి దగ్గరా ఆర్థిక సహకారం తీసుకోలేదు. మా కార్యక్రమాలకు వస్తురూపేణా సహకరించేవాళ్లున్నారు. నా పెన్షన్‌లో సగం ఈ సర్వీస్‌కే ఖర్చవుతుంది. నాకు పిల్లలు లేరు. పిల్లలతో కలిసి గడపడానికి ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నా పిల్లలకే చేసినట్లు సంతోషపడుతుంటాను. సమాజానికి సేవ చేయడంతోపాటు తెలుగు కథలు, వ్యాసాలు రాయడం, అనేక ప్రదేశాల్లో పర్యటించడం, పరిశోధన వ్యాసాలు రాయడం నా హాబీలు. నేను నమ్మే తాత్వికత ఒక్కటే... ‘గతాన్ని మార్చలేం. అందుకే గతంలో జరిగిన చేదు సంఘటనల గుర్తు చేసుకుంటూ మనసు పాడు చేసుకోకూడదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేం. మనం వండుకున్న అన్నాన్ని తినే వరకు ఉంటామో లేదో మనకే తెలియదు. అలాంటప్పుడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉండడం వృథా. ఇక వర్తమానమే ప్రధానం. వర్తమానంలో జీవించాలి’ ఇదే నన్ను నడిపిస్తున్న చోదక శక్తి’’ అన్నారు లంక సీత. లెప్రసీ ఆశ్రమం దత్తత వైజాగ్‌లో వొకేషనల్ సెంటర్ ప్రారంభించి చదువు మానేసిన వాళ్లకు కుట్లు, అల్లికలతోపాటు టైలరింగ్, వెదురుతో కళాకృతుల తయారీ, టీవీ మెకానిజం, ఏసీ రిపేర్లలో సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించాం. కరోనా వరకు నిరంతరాయంగా సాగాయి. ఇప్పుడు వాటిని తిరిగి గాడిలో పెట్టాలి. హైదరాబాద్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో మెడికల్ క్యాంపులు పెట్టి అవసరమైన వారిని అనంతర చికిత్స కోసం ఉచితంగా వైద్యమందించే హాస్పిటల్స్‌తో అనుసంధానం చేస్తాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే వంటి సందర్భాల్లో పిల్లలకు పోటీలు నిర్వహిస్తాం. ఢిల్లీలో అల్పాదాయ వర్గాలు నివసించే నాలుగు కాలనీలు, ఒక లెప్రసీ ఆశ్రమాన్ని దత్తత తీసుకున్నాం. దుస్తులు, పాత్రలు, బ్యాండేజ్ క్లాత్, మందులు పంపిణీ చేస్తాం. దత్తత తీసుకున్న కాలనీల పిల్లలకు స్కూలుకు వెళ్లడానికి అవసరమైన సమస్తం సమకూరుస్తున్నాం. – లంక సీత, ప్రెసిడెంట్, సైరస్ స్వచ్ఛంద సంస్థ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. -
చిన్న చూపు వద్దు.. తరిమేస్తే బెస్టు
సిద్దిపేట: కుష్టు వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యాధి కొంతవరకు తగ్గుముఖం పట్టింది. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో సుమారు ఎనిమిది నెలలుగా ఎలాంటి వ్యాధి గుర్తింపు చర్యలు చేపట్టలేదు. అయినా రెండు, మూడు నెలలుగా నిర్వహించిన సర్వేలో ఈ యేడు కేసులు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. నేడు జాతీయ కుష్టు నిర్మూలన దినోత్సవంలో భాగంగా నేటి నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కుష్టు వ్యాధి సోకిన వ్యక్తిని సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఈ వ్యాధి ప్రమాదకరమైనదేమి కాదని, ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి కాదని, దీనిని సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చని జిల్లా టీబీ, కుష్టు వ్యాధి నివారణ అధికారిణి డాక్టర్ శ్రీదేవి తెలుపుతున్నారు. వ్యాధి లక్షణాలు.. మైకో బ్యాక్టీరియం లెప్రి అనే సూక్ష్మక్రిమి ద్వారా కుష్టు వ్యాధి సంక్రమిస్తుంది. శరీరంపై తెల్లని, రాగి రంగులో స్పర్శలేని మచ్చలు ఉంటే దానిని వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు. ఐదు కన్నా తక్కువ మచ్చలు ఉంటే పాసీ బెసలరి లెప్రసీ అని, ఐదు కన్నా ఎక్కువ మచ్చలు ఉంటే దానిని మల్టీ బెసలరి లెప్రసీ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారి చర్మంపై తెల్లని రాగి రంగులో మచ్చలు ఏర్పడుతాయి. అరచేతిలో, అరికాళ్లలో కండరాల బలహీనత, అంగవైకల్యం వంటివి కనిపిస్తాయి. చికిత్స విధానం.. ఈ వ్యాధి బారిన పడిన వారి శరీరంపై తెల్లని రాగి రంగులో ఐదు కన్నా తక్కువ మచ్చలు ఉంటే వారు ఆరు నెలలపాటు (మల్టీ డ్రగ్ థెరపీ) బహుళ ఔషధ చికిత్స విధానం తీసుకోవాలి ఐదు కంటే ఎక్కువ స్పర్శలేని మచ్చలు ఉంటే సంవత్సర కాలం పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా అంగవైకల్యం వంటి బారి నుంచి కాపాడవచ్చని వైద్యాధికారులు తెలుపుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఈ వ్యాధి బారిన పడిన వారు వైద్యుల సూచన మేరకు తప్పకుండా చికిత్స తీసుకొని మందులు వాడాల్సి ఉంటుంది. వీరికి వస్తువులను తాకినపుడు స్పర్శ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వేడి వస్తువులకు దూరంగా ఉంటూ వాటిపై జాగ్రత్తగా ఉండాలి. స్పర్శ కోల్పోయిన కాళ్లు, చేతుల భాగాలపై జాగ్రత్తగా ఉండాలి. స్పర్శలేని కాళ్లకు మైక్రో సెల్యూలర్ రబ్బర్ చెప్పులు ధరించాలని, ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా పాదరక్షకాలు అందజేస్తుంది. మచ్చలు ఉన్న ప్రాంతంలో ప్రతీరోజు వేడి నీటితో శుభ్రం చేయాలి. చికిత్స తీసుకునే సమయంలో మూత్ర విసర్జనలో మార్పులు కనిపించినా ఎలాంటి అనర్థాలు ఉండవని వైద్యులు సూచిసున్నారు. మొదట్లోనే చికిత్స తీసుకోవాలి శరీరంపై తెల్లని, రాగి రంగులో స్పర్శలేని మచ్చలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దీనిని మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. ఈ వ్యాధి సోకిన వారికి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. జాతీయ కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి వచ్చే నెల 13 వరకు గ్రామాల్లో ప్రజలకు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. – డాక్టర్ శ్రీదేవి, టీబీ, కుష్టు వ్యాధి నియంత్రణ జిల్లా అధికారిణి -
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రూ.500 పారితోషికం
సాక్షి, నారాయణఖేడ్: కుష్టు, క్షయ(టీబీ) వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. గత ఏడాది పలువురిలో ఈ వ్యాధుల లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు వ్యాధులపై ఏకకాలంలో సర్వే నిర్వహించి నిర్మూలన చర్యలను చేపట్టాలని వైద్యశాఖ భావిస్తోంది. క్షయ, కుష్టు బాధితులు పెరుగుతుండడం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వ్యాధులకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించి నయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని కేంద్రం ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రారంభించింది. జిల్లా స్థాయిలో సూపర్వైజర్లు, పీహెచ్‌సీల స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై శిక్షణ పొందారు. వారు ఈ నెల 26న ప్రారంభించిన సర్వే సెప్టెంబర్ 12 వరకు పల్లెలు, పట్టణాల్లో కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో 2007 నుండి సర్వే కొనసాగిస్తున్నారు. తాజాగా మూడో విడత సర్వేపై వైద్యారోగ్య శాఖ సిబ్బంది దృష్టిసారించారు. కేసులు ఎక్కువగానే.. ప్రస్తుత కాలంలో కుష్టుతోపాటు క్షయ వ్యాధి రోగులు సైతం పెరుగుతున్నారు. వ్యాధి గాలిలోనే విస్తరించే అవకాశం ఉన్నందున బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధిపై నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ వ్యాధి విస్తరించడంతో కుష్టు, క్షయ వ్యాధుల రోగుల సంఖ్యను పక్కాగా లెక్కించి చికిత్సలు అందించాలని వైద్యాధికారులు భావిస్తున్నారు. పరీక్షలు ఇలా.. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తాయి. ఆశా కార్యకర్తలు మహిళలను, స్వచ్ఛంద పురుష కార్యకర్తలు పురుషులను పరీక్షిస్తారు. ఒకవేళ కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే పీహెచ్‌సీకి పంపిస్తారు. క్షయవ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. సాయంత్రం సమయంలో దగ్గు, జ్వరం వస్తుంటే వారి తెమడను తీసుకొని ఒక డబ్బాలో పొందుపరిచి క్షయ నియంత్రణ విభాగానికి పరీక్షల కోసం పంపిస్తారు. సీబీనాట్ పరికరంతో వ్యాధిని నిర్దారిస్తారు. జిల్లాలో 948 బృందాలు.. జిల్లాలో 948 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 15లక్షల మంది జనాభా ఉంది. 14లక్షల జనాభాకు అంటే 90శాతం మందిని సర్వే చేయాలనే లక్ష్యంగా వైద్యాధికారులు ఉన్నారు. రోజూ లక్ష మందిని పరిశీలించనున్నారు. సర్వే చేసేందుకు 948 మంది ఆశ కార్యకర్తలు, 243సబ్‌సెంటర్లకు సంబంధించి 243 ఏఎన్ఎంలు, 35మంది సూపర్వైజర్లు, 35మంది వైద్యాధికారులు సర్వేలో పాల్గొంటారు. నిత్యం పట్టణ ప్రాంతాల్లో 30 నివాసాలు, గ్రామీణ ప్రాంతాల్లో 26 ఇళ్లలో సర్వే చేస్తారు. రెండేళ్ల క్రితం సర్వే నిర్వహించి 45మంది కుష్టు రోగులను గుర్తించారు. గత ఏడాది 35మందిని గుర్తించగా ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలో ఇప్పటివరకు నలుగురు కుష్టు రోగులను గుర్తించారు. వ్యాధుల బారిన పడినవారిని గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్సలు అందజేస్తారు. క్షయబారిన పడిన రోగులకు 6 నెలలు, 12నెలల కోర్సుగా ఏడాది పొడవునా ఉచితంగా మందులను అందజేయనున్నారు. క్షయ వ్యాధిబారిన పడిన రోగులు వ్యాధి నయం అయ్యే వరకు మందులు వాడుతుంటే వారికి ప్రతీ నెలా రూ.500 చొప్పున పోషకహారం తీసుకునేందుకు పారితోషికం అందజేస్తాయనున్నట్లు జిల్లా లెప్రసీ ఉపగణాంక అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. కుష్టు లక్షణాలు ఇవీ.. చర్మ పాలిపోవడం, స్పర్శజ్ఞానం లేని మచ్చలు కాళ్లు, చేతులు, నరాల వాపు, నొప్పి, తిమ్మిర్లు ముఖంపై చెవి బయట నూనె పూసినట్లుగా ఉండడం కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతుండడం ముఖం, కాళ్లు, చేతులపై నొప్పి లేని బుడిపెలు కనురెప్పలు పూర్తిగా మూతపడకపోవడం చేతివేళ్లు స్పర్శ కోల్పోయి వంకర పోవడం క్షయ లక్షణాలు ఇవీ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఆకలి లేకపోవడం, పెరుగుదల లేకపోవడం మెడపై వాచి గ్రంథులు, గడ్డలు రావడం పరీక్షించి ఉచిత మందులు.. జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోంది. 14రోజులపాటు ఈ సర్వే నిర్వహిస్తాం. రోగులను గుర్తించి పూర్తిస్థాయిలో చికిత్సలు అందజేస్తాం. లక్షణాలు ఉంటే పరీక్షించి ఉచితంగా మందులను అందజేస్తాం. క్షయవ్యాధి గ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధిని వెంటనే నయం చేసుకునే వీలుంది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ వైద్యులు క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తే వారికి రూ.500 పారితోషికం అందజేస్తాం. ఆర్ఎంపీలు, విద్యావంతులు అవగాహన కల్పించి రోగులు చికిత్సలు పొందేలా చూడాలి. – డి.అరుణ, డీపీపీఎం జిల్లా కోఆర్డినేటర్ -
590 మంది చిన్నారులకు కుష్టు వ్యాధి
జిల్లాల వారీగా సమీక్షలో అధికారుల వెల్లడి సాక్షి, అమరావతి: కుష్టువ్యాధిని పూర్తిగా నిర్మూలించామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. తాజాగా నమోదైన కేసులు కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. గడిచిన ఒక్క ఏడాదిలోనే 590 మందికిపైగా చిన్నారులకు కుష్టు వ్యాధి సోకినట్లు తేలింది. ఈ ఏడాది 4,200 కేసులకుపైగా నమోదయ్యాయి. కుష్టువ్యాధి (లెప్రసీ)పై అన్ని జిల్లాల అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలు బయటపడ్డాయి. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలోనే గడచిన ఏడాది కాలంలో 67 కుష్టు వ్యాధి కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లాలోనూ 2016–17లో 41 కేసులు నమోదయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం భారీగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆర్బీఎస్కే (రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం) పథకం అమలు అధ్వానంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో చిన్నారుల్లో తొలి దశలోనే వ్యాధి లక్షణాలు గుర్తించే అవకాశం లేకుండా పోతోందని తెలుస్తోంది. 2016–17లో రూ.2 కోట్లకుపైగా నిధులిస్తే అందులో 25 శాతం కూడా ఖర్చు చేయలేక పోయారని ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. -
సమష్టిగా కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం
– జాతీయ కుష్టు వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : చేయి చేయి కలుపుదాం–కుష్టు వ్యాధిని నిర్మూలిద్దామని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మీనాక్షి మహదేవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జాతీయ కుష్టు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిన నుంచి జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ కుష్టువ్యాధి నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ..వ్యాధి గ్రస్తులు భయపడాల్సిన అవసరం లేదని మల్టీ డ్రగ్ «థెరపీ(ఎండీటీ) పద్ధతిలో సులభంగా నయం చేసుకోవచ్చన్నారు. అంతకుముందు నిలయం స్వచ్ఛంద సంస్థ కళాకారుల బృందం పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యాధికారి రూపశ్రీ, అధికారులు అంకిరెడ్డి, శివశంకరరావు, పీటీ మనోహర్, గీతాంజలి నర్సింగ్, కేవీఆర్ కళాశాలల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కుష్టువ్యాధికి మందులున్నాయి
నిజామాబాద్ నాగారం : సాధారణ వ్యాధులలాగే కుష్టు వ్యాధికి కూడా చికిత్స అందుబాటులో ఉందని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులు కలతచెందాల్సిన అవసరం లేదని, మందులతో వ్యాధి నయం అవుతుందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యాధులను దాచుకోవద్దని, డాక్టర్ల సంప్రదించి చికిత్సపొందాలని సూచించారు. రోగుల్లో అపోహలు తొలగించి, ధైర్యం నింపాలన్నారు. వ్యాధిపై ప్రజలల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 51 కుష్టు వ్యాధి కేసులను గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఇంకా పరిశీలించి ఎవరైనా ఉంటే అందరికీ చికిత్సలు అందిస్తామన్నారు. వ్యాధిగ్రస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, అద్దాలు ఇచ్చామన్నారు. శనివారం నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు జాతీయ కుష్టు నివారణ పక్షోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతకుముందు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలవేసి, నివాళులు అర్పించారు. రోగులకు బ్రెడ్ అందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకట్, జిల్లా టీ బీ ఇన్చార్జి అధికారి దినేశ్ కుమార్, ఇన్చార్జి డీసీహెచ్ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
'కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించాలి'
చిత్తూరు రూరల్ : కుష్ఠు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్వీస్ కామన్ ఇండియా కన్స్ల్టెంట్ రాజన్‌బాబు అన్నారు. ఆయన గురువారం చిత్తూరు రూరల్ మండలంలోని బిఎన్ఆర్ పేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా నిర్మూలించవచ్చని చెప్పారు. కుష్ఠు వ్యాధి రోగులను గుర్తిస్తే వారికి వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. -
ఆరేళ్ల వనవాసం...
రోజూ కనబడే కథలు లింగుబాయి వయసు 50. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని కొమ్ముగూడలో ఆమె నివాసం. ఆరేళ్ల క్రితం ‘ఊరి నుంచి వెళ్లిపొమ్మ’ని ఊళ్లో జనాలు గగ్గోలు పెట్టడంతో తప్పక ఊరికి మైలు దూరంలో చెట్ల కిందే తలదాచుకుంది. లింగుబాయి చేసిన నేరమేమిటంటే.. కుష్టువ్యాధి బారిన పడటం. జబ్బు చేసిందని జాలి తలచడం మాని, సాటి మనుషులే ఆమెను ఉన్న ఇంటి నుంచి, ఊరి నుంచి దూరంగా వెళ్లగొట్టారు. వేరే గత్యంతరం లేక ఊరికి దూరంగా పొలాల్లో బిక్కుబిక్కు మంటూ ఆరేళ్లపాటు బతుకుతో పోరాడుతూ... ఇటీవలే ఊరు చేరింది. లింగుబాయి ఏం చేస్తోందో చూడ్డానికి వెళితే.. పూర్తిగా పాడుబడ్డ ఇంటిని బాగు చేసుకుంటూ కనిపించింది. యోగక్షేమాలు అడిగితే.. ‘‘పెద్ద సార్ల పుణ్యాన ఇన్నాళ్లకు ఇల్లు చేరాను. ఇల్లు చూడండ్రి ఎట్లా పడావు పడిందో.. ఊరికి దూరమైనంక నా భర్తను పోగొట్టుకున్నాను. కొడుకు సదువు ఆగమైపోయింది. పరాయి వాళ్లకు కూడా నాలాంటి కష్టం రాకూడద’ని కన్నీరు పెట్టుకుంది. ఊరొదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని అడిగితే.... ‘‘ఆరేళ్ల క్రితం చేతులకు పుండ్లు అయినవి. ఎంతకు తగ్గేవి కాదు. అందరు పెద్దరోగం అంటే, దావఖాన్లకు పోయిన. మందులు ఇచ్చిండ్రు. తక్కువ కాలేదు. ఈ రోగం ఎందుకొచ్చిందని బాధపడుతుంటే... ఊళ్ల ఇంకో బాధ మొదలైంది. మా గూడెం నుంచి పిల్లను ఎవ్వరూ చేసుకోవడం లేదని, పిల్లను చూడ్డానికి వచ్చి, ఊళ్లో నాకీ రోగం ఉందని తిరిగిపోతున్నారని, అక్కడి పిల్లను ఇక్కడికి ఎవ్వరు ఇస్తలేరని ఊరొళ్లు అన్నరు. నీకు రోగం ఉన్నందునే మా గూడెంలో పెండ్లిళ్లు అయితలేవన్నరు. వేరే ఎక్కడికైన పోయి ఉండమన్నారు. కండ్లకు నీళ్లచ్చినవి.. కాని ఊరి కోసం తప్ప లేదు. నాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్త, నా పెద్ద బిడ్డ గంగుబాయి పొలం దగ్గర ఒక గుడిసె వేసిండ్రు. అక్కడే పడుకునేదాన్ని. రోజూ నా బిడ్డ గంగు సద్ది నా కొడుకుతో పంపేది. అది తిని అక్కడ్నే గడిపేదాన్ని. నా ఇంటికి పోవాలనిపిచ్చేది. కాని ఊరోళ్లు ఏమన్న అంటరేమో అనే భయంతో పోయేదాన్ని కాదు. పొర్లి పొర్లి ఏడ్చిన... నేను ఊరి నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి నా భర్త లచ్చు నా మీద బెంగ పెట్టుకున్నడో ఏమో.. అప్పటి నుంచి కల్లు తెగ తాగేవాడంట. నేను అడవి పట్టిన రెండు నెలలు కూడా గడవకముందే నా భర్త చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు ఊరోళ్లను బతిమాలుకున్న. ఒక్కసారి చూసిపోతా.. అని ఏడ్చిన. ఆళ్లు ఒప్పుకుంటే చూసెటందుకు వచ్చిన. ఏందీ మాకీ కష్టం అని చాల ఏడ్చిన. నా భర్త శవాన్ని చూసినంక, వెంటనే వెళ్లి పొమ్మన్నరు. ఆయన్ను మట్టి చేశాక, కర్మ చేసి వెళ్లిపోతానన్న. వినలా... (కన్నీరు తుడుచుకుంటూ) ఏం జేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక్కదాన్నే గుడిసెలో కూర్చుని ఏడ్చేదాన్ని. అదిలబాద్ సార్లకు ఎవ్వరు చెప్పిండ్రో ఎమో గాని వాళ్లు నా దగ్గరికి వచ్చినారు. అన్నం తినిపించారు. నాతో కలిసి తిన్నారు. వాళ్లు ఇంకా పెద్ద సార్లను తీసుకొ చ్చిండ్రు. ఎవరెవరో వచ్చి నన్ను ఊర్లకు తీసుకుపోయిండ్రు. ఆరేళ్ల తర్వాత మల్ల నాయింటి లోపలికి అడుగుపెట్టిన. మూలన పడ్డ ఇల్లును మంచిగా చేసుకుంటున్న. గా సార్ల మేలు ఎన్నటికి మరువనయ్యా. వాళ్లు రాకుంటే నేను చచ్చేదాక ఆ ఊరవతలనే పడి ఉండేదాన్ని. నా బిడ్డ కష్టం సుఖం చూసుకోవడానికి కూడా నోచుకోకపోయేదాన్ని. నా గోస ఎవ్వరికి రావద్దు బిడ్డా...’’ అంటూ ఇంటిని బాగు చేసుకోవడంలో మునిగిపోయింది లింగుబాయి. - సతీష్, జన్నారం, అదిలాబాద్ జిల్లా -
రెండంచెల విధానంలో మెడికల్ బోర్డు
శ్రీరాంపూర్ : మెడికల్ బోర్డులో కొత్త మార్పులు తెచ్చారు. ఇకపై రెండంచెల పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహిస్తారు. కొత్త విధానానికి సంబంధించి యాజమాన్యం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. సర్క్యూలర్ నంబర్ సీఆర్పీ/పీఈఆర్/ఐఆర్‌అండ్‌పీఎం/సీ/81/2088 ననుసరించి మెడికల్ బోర్డు పని చేస్తుంది. గతంలో ఒకటే బోర్డు ఉంటే కొత్త సర్క్యూలర్ ప్రకారం కార్పొరేట్ మెడికల్ బోర్డు, అప్పిలేట్ మెడికల్ బోర్డు అను రెండు రకాలు బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతీ బోర్డులో ఆరుగురు సభ్యులు ఉంటారు. కార్పొరేట్ మెడికల్ బోర్డు నెలకు రెండు సార్లు సమావేశం అవుతుంది. ఇందులో సీజీఎం(పీపీ), సీఎంవో, జీఎం(మైనింగ్), జీఎం(పర్సనల్), ఏజీఎం, నిపుణుడైన వైద్యుడు ఉంటారు. అప్పిలేట్ మెడికల్ బోర్డు మూడునెలలకోసారి సమావేశం అవుతుంది. ఇందులో నిమ్స్ నుంచి ఒక వైద్యుడితోపాటు ఐదుగురు కంపెనీ డెరైక్టర్లు, పర్సనల్ అండ్ వెల్ఫేర్, ఆపరే షన్స్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్, ఫైన్సాన్స్, ఈఅండ్ఎండ్ విభాగాలకు చెందిన వారు ఉంటారు. కొత్త సర్క్యూలర్ జూలై 1 నుంచి అమలు అవుతుంది. క్యాన్సర్, లెప్రసీ, పెరాలసిస్, గుండెపోటు, అంధత్వం, కిడ్నీల సమస్యలు, గని ప్రమాదాలు, బయటి ప్రమాదాలు, ఎముకలు విరగడం, శరీరాకృతిలో మార్పులు రావడం వంటి పలు వ్యాధులతో బాధపడేవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ధారుడు ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా బోర్డుకు ఎప్పుడు హాజరుకావాలో మెస్సేజ్ వస్తుంది. కార్పొరేట్ బోర్డులో అన్‌ఫిట్ కాని వారు అప్పిలేట్ మెడికల్ బోర్డుకు 60 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ నెల 10న దరఖాస్తు చే సుకున్న వారి దరఖాస్తులను సీరియల్ నంబర్లు ఇచ్చి దాని ఆధారంగా పిలుస్తారు. పీఎంఈ, కార్పొరేట్ ఆస్పత్రికి రెఫర్ చేయబడిన వారికి సీరియల్లో 50 శాతం ప్రాధాన్యతఇస్తారు. ఇంకా 24 నెలల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మెడికల్ బోర్డుకు హాజ రైన వారు అదే కారణంతో తిరిగి సంవత్సరం వరకు అనుమతించరు. ఇదిలా ఉంటే కొత్త విధానం వల్ల మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు ఫిట్ లేదా అన్ఫిట్లు త్వరగా అవుతాయని, గుర్తింపు సంఘంగా తాము ఒత్తిడి చేయడంతోనే యాజమాన్యం ఈ రెండంచెల విధానం ప్రవేశపెట్టిందని టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల ప్రతినిధి గోవర్ధన్, నాయకులు పానుగంటి సత్తయ్య, ఏ సమ్మిరెడ్డి, గోపాల్, రమణారావు తెలిపారు. దీని కోసం తమ యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. -
ఫాదర్ పెజ్జోనికి కన్నీటి వీడ్కోలు
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్: ప్రముఖ సామాజిక సేవకుడు ఫాదర్ లూయిజీ పెజ్జోనికి శుక్రవారం కన్నీటి నివాళులతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. లెప్రసీ సెంటర్లోని చర్చి ఆవరణలో అశేష జనం నడుమ పెజ్జోని భౌతిక కాయాన్ని ఖననం చేశారు. అంతకు ముందు దైవ ప్రార్థనలు చేసి, భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాపసభలో పలువురు మాట్లాడుతూ పెజ్జోని సేవలను కొని యాడారు. నల్లగొండ బిషప్ గోవింద్ జోజీ మాట్లాడుతూ పెజ్జోని లాంటి సేవా తత్పరులు అరుదుగా జన్మిస్తారని కొనియాడారు. ఇటలీ దేశంలో పుట్టి ఈ పట్టణంలో కుష్ఠు రోగులకు సేవలందించటానికి స్థిరపడిన మహానుబావుడిని కోల్పోవడం తీరనిలోటని అన్నారు. పెజ్జోని తమ్ముడు జోసెఫ్ మాట్లాడుతూ నల్లగొండ ప్రజలు అన్న పెజ్జోనీ పట్ల చూపించిన ఆదరణ, అభిమానం మరువలేమన్నారు. ఇటలీ దేశంలో కుష్ఠురోగులకు సేవలందిస్తున్న వారందరి తరఫున సంతాపం తెలుపుతున్నానన్నారు. స్నేహం రెండు రెట్ల ప్రేమను పెంచుతుందనే ఇటలీ దేశపు నానుడిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంకా ఫాదర్ మోన్సిగ్నోర్, ఆరోగ్యం, జీవన్, సిస్టర్ స్టెల్లా, అబికా తమ ప్రగాఢ సంతాపం తెలి పారు. కార్యక్రమంలో ఏజేసీ నీలకం ఠం, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, పసల శౌరయ్య, 100 మంది సిస్టర్లు, ఫాదర్లు, ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.