నిజామాబాద్ నాగారం :
సాధారణ వ్యాధులలాగే కుష్టు వ్యాధికి కూడా చికిత్స అందుబాటులో ఉందని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులు కలతచెందాల్సిన అవసరం లేదని, మందులతో వ్యాధి నయం అవుతుందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యాధులను దాచుకోవద్దని, డాక్టర్ల సంప్రదించి చికిత్సపొందాలని సూచించారు. రోగుల్లో అపోహలు తొలగించి, ధైర్యం నింపాలన్నారు. వ్యాధిపై ప్రజలల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో ఈ సంవత్సరం 51 కుష్టు వ్యాధి కేసులను గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఇంకా పరిశీలించి ఎవరైనా ఉంటే అందరికీ చికిత్సలు అందిస్తామన్నారు. వ్యాధిగ్రస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, అద్దాలు ఇచ్చామన్నారు. శనివారం నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు జాతీయ కుష్టు నివారణ పక్షోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతకుముందు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలవేసి, నివాళులు అర్పించారు. రోగులకు బ్రెడ్ అందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకట్, జిల్లా టీ బీ ఇన్‌చార్జి అధికారి దినేశ్ కుమార్, ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కుష్టువ్యాధికి మందులున్నాయి
Published Sun, Jan 31 2016 8:22 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM
Advertisement
Advertisement