Yogitha Rana
-
‘బంగారు హైదరాబాద్’ మన లక్ష్యం
సాక్షి,సిటీబ్యూరో : ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడంలో అధికారులు, ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాను బంగారు హైదరాబాద్‌గా తీర్చిదిద్దుదామని కలెక్టర్ యోగితా రాణా పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి కలెక్టర్ ప్రసంగించారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోవడంలో అనేక మంది ప్రాణ త్యాగం చేశారని, ఇప్పుడు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక ప్రతిష్టాత్మక పథకాలను ప్రజలకు చేరవేయడంలో మరింత సమర్థవంతంగా పనిచేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో భాగస్వాములవ్వాలని సూచించారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి అర్హులందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు. బేటి బచావో–బేటి పడావో కార్యక్రమం అమలుతో హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా తీర్చిదిద్ది జాతీయ అవార్డు సాధించామన్నారు. అవార్డు గ్రహీతలకు ప్రశంసలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవార్డు అందుకున్న అధికారులు, ఉద్యోగులను మరింత ప్రోత్సహించే విధంగా విధి నిర్వహణ, వ్యక్తిగత పనితీరుపై కలెక్టర్ యోగితా రాణా పేరుపేరునా ప్రశంసలు కరిపించారు. అవార్డు స్ఫూర్తితో ప్రజలకు సేవలందించేందుకు మరింతగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, ఎన్జీఓలకు కూడా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ శ్రీవత్స కోటæ, డీఆర్వో రాధిక రమణి, పరిపాలనాధికారి జానికి, డీఈఓ వెంకటనర్సమ్మ, డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటి, డీఐఓ నాగార్జున, జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
ఎవరైనా అడిగితే నేరుగా నాకే ఫోన్ చేయండి
సాక్షి, సిటీబ్యూరో : లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల సమాచారం అందించే వారికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనకు నేరుగా ఎస్ఎంఎస్, ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు ప్రోత్సాహాకాలు అందిస్తామని వెల్లడించారు. వివరాలు తెలిసిన వారు 9491033000 నెంబరుకు సమాచారమివ్వవచ్చన్నారు. బుధవారం కలెక్టరేట్లో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం అమలులో భాగంగా ఎస్పీహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఎఎన్ఎంలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పీసీపీఎన్డీటీ, కేసీఆర్ కిట్, ఇమ్యూనైజేషన్, డీవార్మింగ్, పోషకాహారలోపం తదితర అంశాల గురించి వివరించారు. గర్భస్థ శిశు లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం, బహిరంగ పర్చడం చట్ట విరుద్ధమే కాక, ఆనైతికమైనదని కలెక్టర్ పేర్కొన్నారు.లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహంచే స్కానింగ్ సెంటర్లతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినా, పాల్గొన్న ప్రతి ఒక్కరు శిక్షార్హలేనని స్పష్టం చేశారు. కుటుంబంలో ఆడ, మగ అనే తేడాలు ఉండరాదని, లింగ వివక్ష వలన జరిగే నష్టాల గురించి కుటుంబ పెద్దలకు అవగాహన కల్పించాలని చెప్పారు. భ్రూణ హత్యల వలన సామాజిక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. తల్లీ బిడ్డలకు మూడు నెలలు ఉపయోగపడే 16 రకాల వస్తువులను కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వం ఇస్తుందన్నారు. -
‘సుకన్య’పై కలెక్టర్ చాలెంజ్
సాక్షి, హైదరాబాద్: హరితహారం గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తితో బాలికల సుకన్య సమృద్ధి యోజన పథకంపై జిల్లా కలెక్టర్ యోగితా రాణా చాలెంజ్ విసిరారు. సుకన్య సమృద్ధి యోజన చాలెంజ్‌గా పది మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నారు. తొలి విడత వార్షిక ప్రీమియం స్పాన్సర్‌గా రూ.2500 లను బండ్లగూడ ఐసీడీఎస్ సూపర్వైజర్కు అందజేశారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన బేటీ బచావో– బేటీ పడావో అమలుపై మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఈ మేరకు చాలెంజ్ చేశారు. దీంతో బేటీ బచావో.. బేటీ పడావో జిల్లా స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు స్పందించి 20 మంది పిల్లలకు రూ.5000 స్పాన్సర్ చేశారు. అధికారులందరూ తమ సామాజిక బాధ్యతగా సుకన్య సమృద్ధి యోజన చాలెంజ్ స్వీకరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అమలులో భాగంగా మురికివాడల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల్లోని బాలికల భవిష్యత్తు కోసం ప్రతి జిల్లా మండలస్థాయి అధికారి పదిమంది బాలికల చేత సుకన్య సమృద్ధి యోజన పొదుపు ఖాతాలను తెరిపించాలని కలెక్టర్ యోగితా రాణా పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన ఆడశిశువు నుంచి పదేళ్ల బాలికలకు 14వ సంవత్సరం వచ్చే వరకు వార్షిక ప్రీమియంగా కనీసం రూ. 250 చొప్పున చెల్లిస్తే 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ సొమ్మును వడ్డీతో పాటు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గతంలో వార్షిక కనీస ప్రీమియం రూ.1000 ఉండేదని, దానిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.250లకు తగ్గించిందన్నారు. పోస్టాఫీసులో ఈ ఖాతాలు ప్రారంభించాలని కలెక్టర్ యోగితా రాణా సూచించారు. -
బంధువుల నుంచే లైంగిక వేధింపులు
సాక్షి,సిటీబ్యూరో: బంధువుల నుంచే దాదాపు 90 శాతం చిన్నారులు లైగింక వేధింపులకు గురవుతున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అన్నారు. శుక్రవారం బేటి బచావో–బేటి పడావో కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అమ్మాయిలపై కాకుండా అబ్బాయిలపై కూడా లైగింక వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. కౌమార బాలికల, సంరక్షణ, పోషకాహారం, రుతుక్రమం, లైంగికదాడులపై తల్లిదండ్రులను చైతన్యం చేసేందుకు జిల్లా స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. బాలికల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని, పీవోసీఎస్‌వో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. నో, గో, టెల్ అనే పదాలతో పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పాలన్నారు. సురక్షితమైన స్పర్ష, ఫోక్సో చట్టంపై చిన్నారులకు అవగాహన అవసరమన్నారు. పిల్లల అఘాయిత్యాలు ఎదురైతే గట్టిగా అరవడం, గో అంటే అక్కడి నుంచి పరుగెత్తి చెప్పడం, టెల్ అంటే భయపడకుండా ఆసంఘటన చెప్పడం నేర్పించాలన్నారు. అవసరమైతే 1098కు ఫోన్ చేసేలా చైతన్యం కల్గించాలన్నారు. నోడల్ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ గర్భిణీలు అల్ట్రాసౌండ్ చెక్ ఆప్ కోసం వెళ్లినప్పుడు లింగనిర్ధారణ చేసే సెంటర్లపై నిఘా పెట్టాలని సూచించారు. బ్రూణ హత్యలను నియంత్రించాలన్నారు. ఆడపిల్లలను చంపవద్దని ప్రభుత్వానికి అప్పజెప్పాలని వారిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గర్బిణీæ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలవరీ అయితే నాలుగు విడుతలుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా సంక్షేమ అధికారి సునంద మాట్లాడుతూ 914 అంగన్వాడీ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నామని, గర్భిణులకు 16 గుడ్లు ఇవ్వడం ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద ప్రతి గర్భిణీ స్త్రీ పేరును అంగన్ వాడి కేంద్రాల్లో నమోదు చేయించాలన్నారు. ఆర్బీఎస్కే శ్రీవాణి మాట్లాడుతూ పుట్టుకతోనే వచ్చే లోపాలు గుర్తించి వారికి చికిత్స అందజేస్తున్నామని, రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్ ఫోలిక్ మాత్రలు అందజేస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ ఐఓఎస్ ప్రసన్న మాట్లాడుతూ చిన్నారులను పెంచుకోలేని పరిస్ధితిలో చిన్నారులను హాస్టళ్లు, శిశు విహార్‌లో చేర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అర్బన్ కమిటీ డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి. ప్రాజెక్టు డైరెక్టర్ డి.సౌజన్య , ఇంతీయాజ్ పాల్గొన్నారు. -
కలెక్టర్ యోగితా రాణాకు అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘బేటీ బచావో.. బేటీ పడావో’లో నగరం అద్భుత ప్రగతి సాధించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అవార్డు అందుకున్నారు. గురువారం రాజస్తాన్‌లోని జుంజునులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో యోగితా రాణాకు మోదీ అవార్డును బహూకరించారు. ‘బేటీ బచావో–బేటీ పడావో’లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా సంరక్షణ, బాలికా విద్యకు విశేష కృషికి గాను ఈ మేరకు ఆమెను సత్కరించారు. ఈ పథకం అమలులో హైదరాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. బాలికల నిష్పత్తి పురోభివృద్ధికి యోగితా రాణా ప్రత్యేక చొరవను ప్రధాని ప్రశంసించారు. ఈ పథకం ప్రారంభం అయిన తరువాత మహా నగరంలో ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల నిష్పత్తి శాతం 914 నుంచి 968కు పెరిగింది. లింగ నిర్ధారణ కట్టడి, బాలికల పట్ల చిన్నచూపు, సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్‌లు, ఒక మగపిల్లాడు పుడితే రెండో బిడ్డకి నో చెప్పే పద్ధతి లాంటి కార్యక్రమాలతో నగరంలో బాలికల శాతం పెరిగింది. -
డాక్టర్ కలెక్టర్..
డాక్టర్‌గా రోగులకు సేవ చేయాలనుకుని ఆ వృత్తిలోకి అడుగు పెడితే అక్కడజరుగుతున్న అక్రమాలు వెక్కిరించాయి. ధైర్యంగా ఎదిరిస్తే వేధింపులుపెరిగాయి. లాభం లేదని సమస్యను ఐఏఎస్ అధికారికి దృష్టికి తీసుకెళ్లగానే సమస్య పరిష్కారమైంది. ఈ ఒక్క సంఘటన ఆమెలో చాలా మార్పులుతెచ్చింది. ‘నేనూ ఐఏఎస్ చదివితే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించవచ్చు కదా..!’ అని ప్రశ్నించుకుని ఆ దిశగా అడుగులు వేసిందామె. తల్లి ప్రోత్సాహంతో అనుకున్నది సాధించి.. సర్వీసులో పేదల పక్షాననిలిచారు. ఆమే ప్రస్తుత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా యోగితా తనమనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, సిటీబ్యూరో: ఐఏఎస్‌కు ఎంపికయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. విశాఖ జిల్లాలో ఏడాది పాటు శిక్షణ పూర్తి చేశా. ఏజెన్సీలో నెల రోజులపాటు ఉండడంతో గిరిజనుల పరిస్థితులపై అవగాహన వచ్చింది. అక్కడి మహిళలతో మమేకమయ్యా. భద్రాచలం సబ్ కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏ పీఓగా పనిచేసినప్పుడు మహిళల భాగస్వామ్యంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశా. గిరిజనుల ఆదరణ మరువలేని అనుభూతిగా మిగిలింది. మూడున్నరేళ్లు యూఎన్‌డీపీలో పనిచేశా. గ్రామీణ అభివృద్ధిపై పూర్తిగా పట్టు సాధించాను. ఐఏఎస్‌లో ఉండి కూడా గ్రామీణాభివృద్ధిపై పీజీ కోర్సు చేశా. గ్రామీణ ప్రజలకు దగ్గరి నుంచి సేవలందించే అవకాశం లభించడం తృప్తి కలిగించింది. ♦ పుట్టింది.. పెరిగింది జమ్మూలోనే. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. స్కూల్లో చదువుతున్నప్పుడు ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఇంటర్లో ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నా. తర్వాత డాక్టర్ కావాలని వెంటనే సైన్స్ గ్రూప్‌లోకి మారిపోయా. ♦ జమ్మూ మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసించాను. పీహెచ్సీలో ఇంటర్నషిప్ చేస్తున్నప్పుడు అక్కడి పరిస్థితులు బాధ కలిగించాయి. వైద్య సేవల్లో పారదర్శకత లేదు. మందులను ఇతర ప్రయోజనాలకు వాడుతున్నారు. ఈ విషయంపై సూపరింటెండెంట్‌కు లేఖ రాశాను. స్పందన లేదు కదా సమస్యలు మరింత పెరిగాయి. అ సమయంలో కమిషనర్‌గా ఓ యువ ఐఏఎస్ అధికారి వచ్చారు. ఆయన జోక్యంతో పీహెచ్సీలో మార్పు వచ్చింది. అప్పుడే అనుకున్నా సివిల్స్‌తోనే సమాజంలో మార్పు సాధ్యమని. ♦ అప్పటికే మా అన్నయ్య డానిష్ రాణా ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నారు. దీంతో నేనూ ఐఏఎస్ కావాలని నిర్ణయిచుకున్నా. మా అమ్మ కూడా నన్ను అలాగే చూడాలనుకుంది. దాంతో నాలో పట్టుదల పెరిగి పరీక్షలు రాశా. మొదటిసారి మెయిన్స్ క్లియర్ అయినా ఇంటర్వ్యూ రాలేదు. రెండోసారి ప్రిలిమ్స్ దగ్గరే ఆగిపోయింది. మూడో ప్రయత్నంలో ఐఆర్టీఎస్ వచ్చింది. నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌కు 2003 బ్యాచ్‌కు ఎంపికయ్యాను. ♦ మహిళలకు దృఢమైన సంకల్పం, తనపై తనకు నమ్మకం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలదు. మాతృమూర్తిలో మార్పు చాలా అవసరం. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. తండ్రి కంటే తల్లికే పిల్లల మాటలు అర్థమవుతాయి. ఆడపిల్లలను చదివించాలి. ప్రయోజకులను చేయాలి. అన్నింటికీ విద్య ప్రధాన మూలం. చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలి. ♦ ఐఏఎస్‌గా పనితీరు గుర్తింపు ఇస్తోంది. ముందుగా ఉద్యోగులకు ఒక క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే టీం వర్క్‌తో మంచి ఫలితాలు వస్తాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు కేంద్రం నుంచి ఎన్ఆర్ఈజీఏ కింద ఉత్తమ జిల్లాగా గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తమ కలెక్టర్‌గా అవార్డు అందించింది. ప్రధాని చేతులు మీదుగా ఈ–నామ్ ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్నాను. తాజాగా బేటీ బచావో బేటీ పడావో అవార్డు కూడా వచ్చింది. -
బంపర్ ఆఫర్
ల్యాండ్ బ్యాంక్‌లో ప్రభుత్వ భూములు చేర్చితే నజరానా..! తహసీల్దార్లకు మెడల్, రూ. పదివేల నగదు పురస్కారం మూడు కేటగిరీలుగా ల్యాండ్ పార్శిళ్ల విభజన ప్రభుత్వ భూములపై ప్రొఫార్మాలతో నివేదిక హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్‌లో గల భూముల పరిరక్షణతో పాటు, నమోదు కాని ప్రభుత్వ భూములపై సైతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా దృష్టి సారించారు. ల్యాండ్ బ్యాంక్‌లో అదనంగా ప్రభుత్వ భూములు చేర్చితే సద తహసీల్దార్లకు నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. పదివేల నగదుతోపాటు ఉత్తమ మెడల్‌తో గణతంత్ర దినోత్సవం రోజు సన్మానిస్తామని ప్రకటించారు. వెబ్‌ల్యాండ్‌లో చేర్చేందుకు వీలుగా అదనంగా ప్రభుత్వ భూములను గుర్తించిన షేక్‌పేట, బండ్లగూడ తహసీల్దార్లను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. వెబ్ ల్యాండ్‌లో ఉన్న భూముల పరిరక్షణ బాధ్యత తహసీల్దార్లదేననని స్పష్టంచేశారు. గురువారం ఆమె భూముల పరిరక్షణపై జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మదన్ మోహన్, ఆర్డీఓ చంద్రకళలతో కలిసి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ల్యాండ్ బ్యాంక్‌ను రక్షించాలని,. ప్రభుత్వ భూములను పెంచేందుకు తహసీల్దార్లు కృషి చేయాలని ఆదేశించారు. ల్యాండ్ బ్యాంక్‌లో ని పార్సిళ్లను ఎ,బి,సి,డి కేటాగిరీలుగా విభజించి నిర్ణీత ప్రొఫార్మా రూపొందించాలని సూచించారు. ఇందులో కేటగిరి ఏ కింద లిటిగేషన్ లేని 121 ఖాళీ స్ధలాలు వివరాలను తహసీల్దార్లు స్వయంగా తనిఖీ చేసి గూగుల్ మ్యాప్ ద్వారా ఫోటోలు, స్కెచ్లను తయారు చేసి ఈ నెల 16న జరిగే సమీక్షా సమావేశంలో అందజేయాలన్నారను. తనిఖీ సమయంలో ఆ ల్యాండ్ పార్సిల్స్‌లో ప్రభుత్వ భూమి అనే బోర్డు ఉందా..? ఫెన్సింగ్ ఉందా? అనే విషయాలు పరిశీలించి లేని పక్షంలో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. లిటిగేషన్లో ఉన్న ఖాళీ స్థలాలను బి కేటగిరి కింద చేర్చి ఆ ల్యాండ్ పార్సిల్‌కు సంబంధించిన కోర్టు కేసులు వాటి స్థితి వివరాలు ప్రొఫార్మాలో పొందుపరచాలన్నారు. లిటిగేషన్ భూముల తనిఖీ బాధ్యతలను వీఆర్వో, వీఆర్ఏలకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్‌ను తయారు చేసుకోవాలన్నారు. ఆక్రమణల తొలగింపు తప్పనిసరి ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు గుర్తించిన పక్షంలో వెంటనే ఆ వివరాలను తహసీల్దార్ల ద్వారా ల్యాండ్ ప్రొటెక్షన్ విభాగానికి తెలియజేసి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వ పార్సిళ్లలో కట్టడాలను సీ కింద గుర్తించి వాటిని తహసీల్దార్లు వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని, ఎంత విస్తీర్ణం మేర నిర్మాణాల ఉన్నాయి, ఖాళీ స్థలం వివరాలతో నివేదిక సిద్ధం చేసి ఈనెల 23న జరిగే సమావేశంలో అందజేయాలన్నారు. ఇందుకు సంబందించి అవసరమైన ఫార్మాట్‌ను డిజైన్ చేసి పంపనున్నట్లు తెలిపారు. త్వరలో తహసీల్దార్ ఆఫీసుల తనిఖీ తహసీల్దార్ ఆఫీసులను త్వరలో జాయింట్ కలెక్టర్‌తో కలిసి తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతకు మందు ఈ నెల 11 నుంచి అ«ధికారుల బృందం సందర్శించి రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణపై సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. సుమారు 259 మంది ఉద్యోగులు వేలి ముద్రలు నమోదు చేయడం లేదని, డిప్యూటేషన్‌పై ఉన్న సిబ్బంది సంబంధిత కార్యాలయాల్లో వేలిముద్రలను నమోదు చేసుకోవాలని సూచించారు. -
కంటతడి పెట్టిన కలెక్టర్ యోగితారాణా
-
రైతు ప్రయోజనమే లక్ష్యంగా..
♦ మార్కెట్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ♦ త్వరలో యార్డులో అత్యాధునిక నాణ్యత పరీక్షా ల్యాబ్ ♦ సమష్టి కృషితోనే ఈ–నామ్‌కు జాతీయ అవార్డు సాక్షి, నిజామాబాద్ :ఆరుగాలం శ్రమించి పండించిన పంట క్రయవిక్రయాల్లో రైతుల ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లను జాతీయస్థాయిలో విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషితోనే నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఈ–నామ్ అమలులో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని ఆమె పేర్కొన్నారు. ఈ అవార్డు తనపై బాధ్యతను పెంచిందని అన్నారు. సివిల్ సర్వీసెస్ డే పురస్కరించుకుని ప్రధానమంత్రి విశిష్టసేవ అవార్డును నరేంద్రమోడీ చేతులు మీదుగా అందుకున్న అనంతరం కలెక్టర్ యోగితారాణా సోమవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో మాట్లాడారు. సాక్షి : జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నందుకు ఎలా ఫీలవుతున్నారు? కలెక్టర్ : జాతీయ స్థాయి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో జిల్లా అధికార యంత్రాంగం కృషి ఉంది. ఈ అవార్డు రావడానికి మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డైరెక్టర్ లక్ష్మిబాయిలు ఎంతో ప్రోత్సహించారు. సాక్షి : అవార్డు రావడానికి మీరు ప్రత్యేకంగా చేపట్టిన చర్యలేంటీ? కలెక్టర్ : ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాం. ఈ–నామ్ విధానంపై వివిధ స్థాయిల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. ఈ విధానంతో ఉండే ప్రయోజనాలను సహకార సంఘాల ద్వారా రైతులకు వివరించాం. ఇటు వ్యాపారులను కూడా ఆ దిశగా ప్రోత్సహించాం. సాక్షి : జిల్లాలోని పసుపు రైతులు ఇక్కడ సరైన ధర రావడం లేదని మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్తున్నారు కదా? కలెక్టర్ : వాస్తవమే.. సాంగ్లీకి వెళ్లే రైతుల సంఖ్య సుమారు 20 శాతం వరకు తగ్గిందని భావిస్తున్నా. సాంగ్లీలో ఉన్న ధర ప్రకారం ఇక్కడే కొనుగోలు చేసేలా అక్కడి వ్యాపారులతో కూడా మాట్లాడుతాం. సాక్షి : డీపీసీ విధానం ద్వారా కమీషన్ ఏజెంట్లకు చెక్ పడిందని భావిస్తున్నారా? కలెక్టర్ : యార్డులో ప్రత్యేకంగా డైరెక్ట్ పర్చేస్ సెంటర్(డీపీసీ)ని ఏర్పాటు చేశాం. ఈ కేంద్రంలో రైతులు తమ ఉత్పత్తులను విక్రయిస్తే కమీషన్ ఏజెంట్లకు రెండు శాతం కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఖరీదుదారులకు విక్రయించేలా చర్యలు చేపట్టాం. ఈ అంశంపై యార్డుకు వచ్చే రైతులకు అవగాహన కల్పించాం. చాలా వరకు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. సాక్షి : ఇప్పటికీ కొందరు ఖరీదుదారులు సిండికేట్‌గా మారి ధర దోపిడీకి పాల్పడుతున్నారు కదా? కలెక్టర్ : ప్రస్తుతానికి స్థానిక వ్యాపారులు మాత్రమే ఈ–బిడ్డింగ్‌లో ధర కోట్ చేస్తున్నారు. దీంతో సిండికేట్‌గా అయ్యేందుకు అవకాశం ఉంది కావచ్చు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఖరీదుదారులు ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొంటే ఈ సిండికేట్ వ్యవహారానికి పూర్తిగా చెక్ పడుతుంది. సాక్షి : ఆమ్చూర్ కొనుగోళ్లలో కమీషన్ ఏజెంట్లు క్యాష్ కటింగ్ పేరిట పది శాతం వరకు రైతులను దోపిడీ చేస్తున్నారు. కొందరు మార్కెట్ సిబ్బంది కొందరు ఏజెంట్లతో కుమ్మక్కయ్యారనే విమర్శలున్నాయి? కలెక్టర్ : వివిధ జిల్లాల నుంచి రైతులు ఆమ్‌చూర్‌ను విక్రయించేందుకు ఇక్కడికి వస్తున్నారు. కమీషన్ ఏజెం ట్లు రెండు శాతానికి మించి కమీషన్ వసూలు చేయరాదు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్య లు తీసుకుంటాం. మార్కెటింగ్ శాఖ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే విచారణ చేసి చర్యలు చేపడుతాం. సాక్షి : యార్డులో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? కలెక్టర్ : క్రయవిక్రయాల ప్రక్రియను పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేశాము. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించడంతో కమీషన్, హమాలీ, చాటా వంటి చార్జీల పేరుతో ఇష్టారాజ్యంగా రైతుల చెల్లింపుల్లో కోత వి«ధించడానికి చెక్ పడింది. రైతుల ఉత్పత్తులకు ఈ–లాట్, ఈ–బిడ్డింగ్ వంటి ఏర్పాట్లు చేయడంతో ధర నిర్ణయంలో పారదర్శక పెరిగింది. ఆయా ఉత్పత్తులకు వచ్చిన ధర సంబంధిత రైతులకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేలా ఏర్పాట్లు చేశాం. సాక్షి : రానున్న రోజుల్లో ఈ విధానం పకడ్బందీగా అమలయ్యేందుకు తీసుకోబోయే చర్యలు? కలెక్టర్ : యార్డులో అత్యాధునికమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ ల్యాబ్ రైతుల ఉత్పత్తుల నాణ్యతను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతుంది. తద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలుదారులు ఈ సరుకుల నాణ్యతను పరిశీలించి ఆన్లైన్లో బిడ్డింగ్ చేసేలా ఏర్పాటు చేస్తాం. కోల్డ్ స్టోరేజ్‌ను నిర్మించి ధర రాని పక్షంలో రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్ యార్డుకు ప్రస్తుతం వస్తున్న పంటలే గాక ఇతర పంటల క్రయవిక్రయాల వేదికగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. -
వరద పరిస్ధితిని సమీక్షిస్తున్నాం
-
28 వేల హెక్టార్లలో పంట నష్టం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరదల వల్ల ఏడుగురు మృతిచెందారని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. 28 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. 10 పునరావాస కేంద్రాల్లో 1100 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. 4వేల ఇళ్లు పాక్షికంగా, 530 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయినట్టు ఆమె వెల్లడించారు. జియో సర్వే ద్వారా పంట నష్టం అంచనా వేస్తామని యోగితారాణా అన్నారు. -
కుష్టువ్యాధికి మందులున్నాయి
నిజామాబాద్ నాగారం : సాధారణ వ్యాధులలాగే కుష్టు వ్యాధికి కూడా చికిత్స అందుబాటులో ఉందని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులు కలతచెందాల్సిన అవసరం లేదని, మందులతో వ్యాధి నయం అవుతుందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యాధులను దాచుకోవద్దని, డాక్టర్ల సంప్రదించి చికిత్సపొందాలని సూచించారు. రోగుల్లో అపోహలు తొలగించి, ధైర్యం నింపాలన్నారు. వ్యాధిపై ప్రజలల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 51 కుష్టు వ్యాధి కేసులను గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఇంకా పరిశీలించి ఎవరైనా ఉంటే అందరికీ చికిత్సలు అందిస్తామన్నారు. వ్యాధిగ్రస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, అద్దాలు ఇచ్చామన్నారు. శనివారం నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు జాతీయ కుష్టు నివారణ పక్షోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతకుముందు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలవేసి, నివాళులు అర్పించారు. రోగులకు బ్రెడ్ అందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకట్, జిల్లా టీ బీ ఇన్చార్జి అధికారి దినేశ్ కుమార్, ఇన్చార్జి డీసీహెచ్ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.