లంక సీత వయసు 81.
ఢిల్లీతో 61 ఏళ్ల అనుబంధం.
ఢిల్లీలో ఉండనని ఏడ్చిన రోజులు...
ఇంత నగరంలో ఎలా జీవించాలి... అనే ఆందోళన.
జీవించడం ఎలాగో నేర్పిన గురువుది కూడా ఆ నగరమే.
తెలుగుదనంతో ఢిల్లీలో అడుగుపెట్టిన నాటి తరం అమ్మాయి.
తనలాగ ఎందరో... వాళ్లకు బతికే దారేది... అనుకుంది.
అలాంటి అభాగ్యులకు అక్క అయింది... వారి జీవికకు దారి చూపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, తణుకులో పుట్టిన లంక సీత దేశ రాజధానితో ముడివడిన తన జీవిత గమనాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది అమ్మమ్మగారింట్లో తణుకులోనే, కానీ సొంతూరు నర్సాపురం. నాన్న ఉద్యోగరీత్యా నా చదువు కొంతకాలం నర్సాపురం, మరికొంత కాలం తణుకులో అమ్మమ్మగారింట్లో సాగింది. నాకు చదువంటే ఎంత ఇష్టమంటే ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి టేబుల్ అందకపోతే నిలబడి పరీక్ష రాశాను తప్ప పరీక్ష మానలేదు.
ఎస్‌ఎస్‌ఎల్‌సీ తర్వాత అనుకోకుండా పెళ్లి సంబంధం రావడం, మంచి సంబంధం, అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని పెళ్లి చేసి మా వారితోపాటు నన్ను ఢిల్లీకి పంపించారు మా వాళ్లు. పంజాబీల ఇంట్లో అద్దెకుండేవాళ్లం. ఇంగ్లిష్ అయితే నెగ్గుకొచ్చేదాన్ని, కానీ హిందీ అక్షరం కూడా మాట్లాడలేని పరిస్థితి. నాకు ఢిల్లీ అలవాటయ్యే లోపే భూకంపం వచ్చింది. మా ఓనర్ నన్ను గట్టిగా పిలుస్తూ పంజాబీలో, హిందీలో ఏదో చెప్తోంది. అర్థం చేసుకునేలోపు ఆవిడే వచ్చి బయటకు లాక్కువెళ్లింది. ఆ తర్వాత తెలిసింది నాకు అది భూకంపం అని.
ఢిల్లీలో ఉండనని ఏడవడం అప్పుడు మొదలైంది. ఆ తర్వాత ఒక రోజు కడుపు నొప్పి కారణంగా మా వారిని హాస్పిటల్‌లో చేర్చారు. అది గుండెనొప్పి అని ఆయన దూరమైన తర్వాత తెలిసింది నాకు. కంపాషన్ గ్రౌండ్స్‌లో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఇల్లు దాటి ఢిల్లీ వీథులు, సిటీ బస్సులతో నా జీవన యానం మొదలైంది. ఆఫీసులో ఉన్నా సరే నా కళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్న నీలిమేఘాల్లా ఉండేవి. ఉద్యోగంలో పని నేర్చుకోవడం, ప్రైవేట్‌గా చదువుకోవడం మొదలు పెట్టిన తర్వాత నా మీద నాకు నమ్మకం కలిగింది. నా కళ్లు కన్నీళ్లను మరచిపోయాయి.
► మళ్లీ చదువు!
ఇంటర్, బీఏ, ఎంఏ, ఆ తర్వత జర్నలిజం చేశాను. చైనా సామాజిక జీవనం పట్ల అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో చైనీస్ భాష నేర్చుకోవడానికి లింగ్విస్టిక్స్‌లో చేరాను. కానీ ఉద్యోగంలో ప్రమోషన్ తర్వాత పని భారం కారణంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టలేకపోయాను. ఆర్థిక, సామాజిక పరిశోధన రంగంలో పని చేశాను. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో అమ్మ కోసం నాలుగేళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకున్నాను. ఉద్యోగంలో నా పని సామాజిక స్థితిగతుల మీద అధ్యయనం కావడంతో 2002లో సైరస్ (సీత ఆల్ ఇండియా రీసెర్చ్ అండ్ సోషల్ సర్వీసెస్) స్థాపించి విశ్రాంత జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేశాను.
► మహిళ పరిస్థితి మారలేదు!
ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా దేశ రాజధాని నగరంలో నన్ను నేను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. నాలాగ తన కాళ్ల మీద తాము నిలబడాల్సిన స్థితిలో ఉన్న మహిళల కోసం ఏదైనా చేయాలనిపించింది. మహిళలు, యువకులు, వృద్ధులకు కూడా ఉపయోగపడేవిధంగా సైరస్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాను.
మహిళలకు ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయడం, ఉపాధి మార్గాలను తెలియచేసి సహకారం అందించడం, తాగుబోతు భర్తల కారణంగా బాధలు పడుతున్న వాళ్లకు ఆసరాగా నిలవడం, మగవాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి తాగుడుకు బానిసలు కాకుండా కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించే వరకు పర్యవేక్షిస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టాం. పిల్లలకు పోషకాహారం అందించడం, స్కూలుకి పంపేలా చూడడం, వృద్ధుల ఆరోగ్య సంరక్షణతోపాటు వారిని సమాజంలో ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయడం, యువతను చైతన్యవంతం చేయడం వంటి కార్యక్రమాలతో పని చేస్తోంది సైరస్.
► వర్తమానమే ప్రధానం!
మా సైరస్ సంస్థలో పన్నెండు మందిమి ఉన్నాం. మేమందించే మా సేవలలో మాకు సహకరించే డాక్టర్లు, లాయర్‌లు, టీచర్‌లు, వాలంటీర్‌లున్నారు. మేము ఎవరి దగ్గరా ఆర్థిక సహకారం తీసుకోలేదు. మా కార్యక్రమాలకు వస్తురూపేణా సహకరించేవాళ్లున్నారు. నా పెన్షన్‌లో సగం ఈ సర్వీస్‌కే ఖర్చవుతుంది. నాకు పిల్లలు లేరు. పిల్లలతో కలిసి గడపడానికి ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నా పిల్లలకే చేసినట్లు సంతోషపడుతుంటాను.
సమాజానికి సేవ చేయడంతోపాటు తెలుగు కథలు, వ్యాసాలు రాయడం, అనేక ప్రదేశాల్లో పర్యటించడం, పరిశోధన వ్యాసాలు రాయడం నా హాబీలు. నేను నమ్మే తాత్వికత ఒక్కటే... ‘గతాన్ని మార్చలేం. అందుకే గతంలో జరిగిన చేదు సంఘటనల గుర్తు చేసుకుంటూ మనసు పాడు చేసుకోకూడదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేం. మనం వండుకున్న అన్నాన్ని తినే వరకు ఉంటామో లేదో మనకే తెలియదు. అలాంటప్పుడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉండడం వృథా. ఇక వర్తమానమే ప్రధానం. వర్తమానంలో జీవించాలి’ ఇదే నన్ను నడిపిస్తున్న చోదక శక్తి’’ అన్నారు లంక సీత.
లెప్రసీ ఆశ్రమం దత్తత
వైజాగ్‌లో వొకేషనల్ సెంటర్ ప్రారంభించి చదువు మానేసిన వాళ్లకు కుట్లు, అల్లికలతోపాటు టైలరింగ్, వెదురుతో కళాకృతుల తయారీ, టీవీ మెకానిజం, ఏసీ రిపేర్‌లలో సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించాం. కరోనా వరకు నిరంతరాయంగా సాగాయి. ఇప్పుడు వాటిని తిరిగి గాడిలో పెట్టాలి. హైదరాబాద్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో మెడికల్ క్యాంపులు పెట్టి అవసరమైన వారిని అనంతర చికిత్స కోసం ఉచితంగా వైద్యమందించే హాస్పిటల్స్‌తో అనుసంధానం చేస్తాం.
రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే వంటి సందర్భాల్లో పిల్లలకు పోటీలు నిర్వహిస్తాం. ఢిల్లీలో అల్పాదాయ వర్గాలు నివసించే నాలుగు కాలనీలు, ఒక లెప్రసీ ఆశ్రమాన్ని దత్తత తీసుకున్నాం. దుస్తులు, పాత్రలు, బ్యాండేజ్ క్లాత్, మందులు పంపిణీ చేస్తాం. దత్తత తీసుకున్న కాలనీల పిల్లలకు స్కూలుకు వెళ్లడానికి అవసరమైన సమస్తం సమకూరుస్తున్నాం.
– లంక సీత, ప్రెసిడెంట్, సైరస్ స్వచ్ఛంద సంస్థ
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి.
Comments
Please login to add a commentAdd a comment