లెప్రసీ డిటెక్షన్ సర్వేలో భాగంగా హుస్నాబాద్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది (ఫైల్)
సిద్దిపేట: కుష్టు వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యాధి కొంతవరకు తగ్గుముఖం పట్టింది. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో సుమారు ఎనిమిది నెలలుగా ఎలాంటి వ్యాధి గుర్తింపు చర్యలు చేపట్టలేదు. అయినా రెండు, మూడు నెలలుగా నిర్వహించిన సర్వేలో ఈ యేడు కేసులు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. నేడు జాతీయ కుష్టు నిర్మూలన దినోత్సవంలో భాగంగా నేటి నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కుష్టు వ్యాధి సోకిన వ్యక్తిని సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఈ వ్యాధి ప్రమాదకరమైనదేమి కాదని, ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి కాదని, దీనిని సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చని జిల్లా టీబీ, కుష్టు వ్యాధి నివారణ అధికారిణి డాక్టర్ శ్రీదేవి తెలుపుతున్నారు.
వ్యాధి లక్షణాలు..
మైకో బ్యాక్టీరియం లెప్రి అనే సూక్ష్మక్రిమి ద్వారా కుష్టు వ్యాధి సంక్రమిస్తుంది. శరీరంపై తెల్లని, రాగి రంగులో స్పర్శలేని మచ్చలు ఉంటే దానిని వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు. ఐదు కన్నా తక్కువ మచ్చలు ఉంటే పాసీ బెసలరి లెప్రసీ అని, ఐదు కన్నా ఎక్కువ మచ్చలు ఉంటే దానిని మల్టీ బెసలరి లెప్రసీ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారి చర్మంపై తెల్లని రాగి రంగులో మచ్చలు ఏర్పడుతాయి. అరచేతిలో, అరికాళ్లలో కండరాల బలహీనత, అంగవైకల్యం వంటివి కనిపిస్తాయి.
చికిత్స విధానం..
- ఈ వ్యాధి బారిన పడిన వారి శరీరంపై తెల్లని రాగి రంగులో ఐదు కన్నా తక్కువ మచ్చలు ఉంటే వారు ఆరు నెలలపాటు (మల్టీ డ్రగ్ థెరపీ) బహుళ ఔషధ చికిత్స విధానం తీసుకోవాలి
- ఐదు కంటే ఎక్కువ స్పర్శలేని మచ్చలు ఉంటే సంవత్సర కాలం పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా అంగవైకల్యం వంటి బారి నుంచి కాపాడవచ్చని వైద్యాధికారులు తెలుపుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- ఈ వ్యాధి బారిన పడిన వారు వైద్యుల సూచన మేరకు తప్పకుండా చికిత్స తీసుకొని మందులు వాడాల్సి ఉంటుంది. వీరికి వస్తువులను తాకినపుడు స్పర్శ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వేడి వస్తువులకు దూరంగా ఉంటూ వాటిపై జాగ్రత్తగా ఉండాలి.
- స్పర్శ కోల్పోయిన కాళ్లు, చేతుల భాగాలపై జాగ్రత్తగా ఉండాలి. స్పర్శలేని కాళ్లకు మైక్రో సెల్యూలర్ రబ్బర్ చెప్పులు ధరించాలని, ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా పాదరక్షకాలు అందజేస్తుంది.
- మచ్చలు ఉన్న ప్రాంతంలో ప్రతీరోజు వేడి నీటితో శుభ్రం చేయాలి. చికిత్స తీసుకునే సమయంలో మూత్ర విసర్జనలో మార్పులు కనిపించినా ఎలాంటి అనర్థాలు ఉండవని వైద్యులు సూచిసున్నారు.
మొదట్లోనే చికిత్స తీసుకోవాలి
శరీరంపై తెల్లని, రాగి రంగులో స్పర్శలేని మచ్చలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దీనిని మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. ఈ వ్యాధి సోకిన వారికి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. జాతీయ కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి వచ్చే నెల 13 వరకు గ్రామాల్లో ప్రజలకు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం.
– డాక్టర్ శ్రీదేవి, టీబీ, కుష్టు వ్యాధి నియంత్రణ జిల్లా అధికారిణి
Comments
Please login to add a commentAdd a comment