ఆరేళ్ల వనవాసం... | host of the six-yea | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల వనవాసం...

Published Thu, Jun 11 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

ఆరేళ్ల వనవాసం...

ఆరేళ్ల వనవాసం...

రోజూ కనబడే కథలు
 
లింగుబాయి వయసు 50. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని కొమ్ముగూడలో ఆమె నివాసం. ఆరేళ్ల క్రితం ‘ఊరి నుంచి వెళ్లిపొమ్మ’ని ఊళ్లో జనాలు గగ్గోలు పెట్టడంతో తప్పక ఊరికి మైలు దూరంలో చెట్ల కిందే తలదాచుకుంది. లింగుబాయి చేసిన నేరమేమిటంటే.. కుష్టువ్యాధి బారిన పడటం. జబ్బు చేసిందని జాలి తలచడం మాని, సాటి మనుషులే ఆమెను ఉన్న ఇంటి నుంచి, ఊరి నుంచి దూరంగా వెళ్లగొట్టారు. వేరే గత్యంతరం లేక ఊరికి దూరంగా పొలాల్లో బిక్కుబిక్కు మంటూ ఆరేళ్లపాటు బతుకుతో పోరాడుతూ... ఇటీవలే ఊరు చేరింది. లింగుబాయి ఏం చేస్తోందో చూడ్డానికి వెళితే.. పూర్తిగా పాడుబడ్డ ఇంటిని బాగు చేసుకుంటూ కనిపించింది. యోగక్షేమాలు అడిగితే.. ‘‘పెద్ద సార్ల పుణ్యాన ఇన్నాళ్లకు ఇల్లు చేరాను. ఇల్లు చూడండ్రి ఎట్లా పడావు పడిందో.. ఊరికి దూరమైనంక నా భర్తను పోగొట్టుకున్నాను. కొడుకు సదువు ఆగమైపోయింది. పరాయి వాళ్లకు కూడా నాలాంటి కష్టం రాకూడద’ని కన్నీరు పెట్టుకుంది.
 
ఊరొదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని అడిగితే....
‘‘ఆరేళ్ల క్రితం చేతులకు పుండ్లు అయినవి. ఎంతకు తగ్గేవి కాదు. అందరు పెద్దరోగం అంటే, దావఖాన్లకు పోయిన. మందులు ఇచ్చిండ్రు. తక్కువ కాలేదు. ఈ రోగం ఎందుకొచ్చిందని బాధపడుతుంటే... ఊళ్ల ఇంకో బాధ మొదలైంది. మా గూడెం నుంచి పిల్లను ఎవ్వరూ చేసుకోవడం లేదని, పిల్లను చూడ్డానికి వచ్చి, ఊళ్లో నాకీ రోగం ఉందని తిరిగిపోతున్నారని, అక్కడి పిల్లను ఇక్కడికి ఎవ్వరు ఇస్తలేరని ఊరొళ్లు అన్నరు. నీకు రోగం ఉన్నందునే మా గూడెంలో పెండ్లిళ్లు అయితలేవన్నరు. వేరే ఎక్కడికైన పోయి ఉండమన్నారు. కండ్లకు నీళ్లచ్చినవి.. కాని ఊరి కోసం తప్ప లేదు. నాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్త, నా పెద్ద బిడ్డ గంగుబాయి పొలం దగ్గర ఒక గుడిసె వేసిండ్రు. అక్కడే పడుకునేదాన్ని. రోజూ నా బిడ్డ గంగు సద్ది నా కొడుకుతో పంపేది. అది తిని అక్కడ్నే గడిపేదాన్ని. నా ఇంటికి పోవాలనిపిచ్చేది. కాని ఊరోళ్లు ఏమన్న అంటరేమో అనే భయంతో పోయేదాన్ని కాదు.

 పొర్లి పొర్లి ఏడ్చిన... నేను ఊరి నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి నా భర్త లచ్చు నా మీద బెంగ పెట్టుకున్నడో ఏమో.. అప్పటి నుంచి కల్లు తెగ తాగేవాడంట. నేను అడవి పట్టిన రెండు నెలలు కూడా గడవకముందే నా భర్త చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు ఊరోళ్లను బతిమాలుకున్న. ఒక్కసారి చూసిపోతా.. అని ఏడ్చిన. ఆళ్లు ఒప్పుకుంటే చూసెటందుకు వచ్చిన. ఏందీ మాకీ కష్టం అని చాల ఏడ్చిన. నా భర్త శవాన్ని చూసినంక, వెంటనే వెళ్లి పొమ్మన్నరు. ఆయన్ను మట్టి చేశాక, కర్మ చేసి వెళ్లిపోతానన్న. వినలా... (కన్నీరు తుడుచుకుంటూ) ఏం జేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక్కదాన్నే గుడిసెలో కూర్చుని ఏడ్చేదాన్ని.

 అదిలబాద్ సార్లకు ఎవ్వరు చెప్పిండ్రో ఎమో గాని  వాళ్లు నా దగ్గరికి వచ్చినారు. అన్నం తినిపించారు. నాతో కలిసి తిన్నారు. వాళ్లు ఇంకా పెద్ద సార్లను తీసుకొ చ్చిండ్రు. ఎవరెవరో వచ్చి నన్ను ఊర్లకు తీసుకుపోయిండ్రు. ఆరేళ్ల తర్వాత మల్ల నాయింటి లోపలికి అడుగుపెట్టిన. మూలన పడ్డ ఇల్లును మంచిగా చేసుకుంటున్న. గా సార్ల మేలు ఎన్నటికి మరువనయ్యా. వాళ్లు రాకుంటే నేను చచ్చేదాక ఆ ఊరవతలనే పడి ఉండేదాన్ని. నా బిడ్డ కష్టం సుఖం చూసుకోవడానికి కూడా నోచుకోకపోయేదాన్ని. నా గోస ఎవ్వరికి రావద్దు బిడ్డా...’’ అంటూ ఇంటిని బాగు చేసుకోవడంలో మునిగిపోయింది లింగుబాయి.
 - సతీష్, జన్నారం, అదిలాబాద్ జిల్లా
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement