సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య రంగంలో తెలంగాణ పురోగమన పథంలో పయనిస్తోందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. జాతీయ స్థాయిలో రాష్ట్రం 12వ ర్యాంకు పొందినట్లు వెల్లడించింది. కేరళ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే విజయవంతంగా పురోగమించాయని, తెలంగాణ ఆ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలూ పురోగమన దిశలో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్యరంగం మెరుగైన స్థితిలో ఉందని వివరించింది. నీతి ఆయోగ్ మొదటిసారిగా నిర్వహించిన ‘బేస్‌లైన్ ర్యాంకింగ్ అండ్ రియల్ టైం’సర్వే వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషించాయి. దేశంలో 101 జిల్లాల్లో నీతి ఆయోగ్ బేస్‌లైన్ సర్వే నిర్వహించింది. ఆరోగ్యం, పోషకాహారం, నవజాత శిశువుల ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, మౌలిక సదుపాయాల వంటి 13 అంశాలపై ఆయా జిల్లాల్లో సర్వే నిర్వహించింది. అందులో ఖమ్మం జిల్లా పదకొండో ర్యాంకు సాధించగా భూపాలపల్లి జిల్లా 20వ ర్యాంకు, ఆసిఫాబాద్ జిల్లా వందో ర్యాంకు సాధించాయి.
తగ్గిన నవజాత శిశు మరణాల రేటు...
నవజాత శిశువుల మరణాల రేటులో తెలంగాణ మెరుగుపడిందని నీతి ఆయోగ్ పేర్కొంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో మరణాల సంఖ్య 23గా ఉంది. అలాగే ఐదేళ్లలోపు మరణించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యలో మెరుగుదల కనిపిస్తుంది. అది గతంలో 6.11 శాతముంటే ఇప్పుడు 5.70 శాతానికి చేరింది. సంతాన సాఫల్య అవకాశం ఉన్న వారి రేటు 1.8 ఉంది. అయితే పురుషులు, స్త్రీల నిష్పత్తిలో మాత్రం పురోగతి లేకపోవడం గమనార్హం. ప్రతి వెయ్యి మంది బాలురకు 918 మంది బాలికలే ఉన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 85.35% ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. అయితే వివిధ రకాల టీకాలు ఇప్పించడంలో రాష్ట్రం కాస్త వెనుకబడింది. కేవలం 89.09 శాతమే టీకాలు ఇస్తున్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు మెరుగుపడింది. ప్రతి లక్ష మందిలో టీబీ రోగులు 123 మంది ఉంటున్నారు. అయితే టీబీ చికిత్సలు విజయవంతం చేయడంలో తెలంగాణ వెనుకబడిందని నివేదిక స్పష్టం చేసింది.
పీహెచ్‌సీల్లో ఖాళీల భర్తీపై అసంతృప్తి...
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లలో మెడికల్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. గతంతో పోలిస్తే పరిస్థితి ఏమాత్రం మారలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. గతం నుంచీ ఇప్పటికీ పీహెచ్‌సీల్లో 22.31 % మెడికల్ ఆఫీసర్ల ఖాళీలు ఉన్నాయి. ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మాత్రం స్పెషలిస్టుల కొరతను తీర్చడంలో మెరుగుదల ఉంది. ప్రస్తుతం వాటిల్లో స్పెషలిస్టుల ఖాళీలు 54.81% ఉన్నాయి. అదే తమిళనాడులో కేవలం 16.73% మాత్రమే స్పెషలిస్టుల ఖాళీలున్నాయి. ఏఎన్‌ఎంల కొరత లేకుండా చేయడంలో మెరుగుదల కనిపిస్తోంది. స్టాఫ్ నర్సుల ఖాళీలను నింపడంలో ఇప్పటికీ మార్పు కనిపించడంలేదు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఇప్పటికీ 12.79 % స్టాఫ్ నర్సుల ఖాళీలున్నాయి. ఇక 24 గంటలూ పనిచేసే పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయి సేవలు అందించడంలో మార్పు రాలేదు. పీహెచ్‌సీల్లో 26.99 శాతమే 24 గంటలు సేవలందిస్తున్నాయి. అయితే తమిళనాడుతో పోలిస్తే మనం చాలా మెరుగ్గానే ఉన్నామని చెప్పొచ్చు. సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)ల గ్రేడింగ్ పరిశీలిస్తే గతం కంటే మెరుగుపడింది. అంతకుముందు వాటి గ్రేడింగ్ శూన్యమైతే ఇప్పుడు 11.63%తో మెరుగ్గా ఉంది. జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూల కొరత ఉంది.
వైద్యారోగ్యంలో పురోగమనం
Published Sat, Jun 30 2018 1:30 AM | Last Updated on Wed, Oct 17 2018 6:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment