పేద గర్భిణులకు చేయూత | Financial support to the Poor pregnant womens | Sakshi
Sakshi News home page

పేద గర్భిణులకు చేయూత

Published Tue, Jan 3 2017 3:52 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

పేద గర్భిణులకు చేయూత - Sakshi

పేద గర్భిణులకు చేయూత

ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం: సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా చర్యలు తీసుకోండి
అందుకు ప్రోత్సాహకాలు అందించండి
బిడ్డకు అవసరమయ్యే వస్తువులను కిట్‌ రూపంలో ఇవ్వండి
ఆస్పత్రుల్లో ఏర్పాట్లు బాగున్నాయనే నమ్మకం ప్రజలకు కలిగించాలి
శిశు మరణాలను సున్నా స్థాయికి తీసుకురావాలి
పేదలకు వైద్యం అందించే వైద్యుల జీతాలను సవరిస్తాం
వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: పేద గర్భిణులకు తగినంత ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు. వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపు పెంచడంతోపాటు వాటిని ఎప్ప టికప్పుడు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో తీసుకోవా ల్సిన చర్యలపై సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, కమిషనర్‌ వాకాటి కరుణ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, డాక్టర్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రసూతి సమయంలో పేద గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రూపాయల బిల్లులు చెల్లించడం  కష్టమన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో పేద గర్భిణులు కచ్చితంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి ప్రసూతి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి ఏర్పాట్లు బాగున్నాయనే నమ్మకం పేదలకు కలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల నుంచీ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు.

అమ్మ ఒడి పేరుతో గర్భిణులను ఆస్పత్రికి తీసుకురావడం... తీసుకుపోవడం చేస్తున్నారన్నారు. ఇంకా అనేక చర్యలు చేపట్టాలన్నారు. పేదలు.. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు చెందినవారు ఇంకా ఇళ్లల్లోనే ప్రసవమవుతున్నారని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వందకు వందశాతం ఆస్పత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సాంస్కృతిక సారథి ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో మీడియా కూడా సహకరించాలని కోరారు.

ప్రోత్సాహకాలు ఇవ్వండి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అయ్యే వారికి ప్రోత్సాహకాలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గర్భిణీగా ఉన్నప్పుడు వారు కూలీ, వ్యవసాయం ఇతరత్రా పనులు చేసుకోలేరన్నారు. ఆ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలని, అయితే ఇది పేద కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతుందని, అందుకే వారికి సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా ఒక పూట పౌష్టికాహారం అందిస్తున్నా.. వారికి మరింత సాయం అవసరం అన్నారు. ప్రసవం అయ్యాక తల్లీబిడ్డల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రసూతి సమయంలో శిశువుల మరణాలను జీరో స్థాయికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బిడ్డకు మూడో నెల వచ్చే వరకు కావాల్సిన వస్తువులను ప్రభుత్వమే ఒక కిట్‌ రూపంలో బహుమానంగా అందించాలన్నారు. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి 2017–18 బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామన్నారు. ఈ విషయంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదన్నారు.

సర్కారీ వైద్య సేవలు మెరుగయ్యాయి
గతేడాది బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు తెస్తూ భారీగా నిధులు కేటాయించామని సీఎం వివరించారు. ప్రభుత్వ వైద్య సేవల్లో... మందుల పంపిణీలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా భారీగా పెరిగిందన్నారు. ఈసారి బడ్జెట్లో.. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ వైద్యుల జీతాలు కూడా సవరించాలనే యోచన ఉందన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ పేరుతో బస్తీల్లో వైద్య సేవలు విస్తరించారన్నారు. హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఇతర కార్పొరేషన్లలో కూడా ఇలాంటి ప్రయత్నం చేయాలన్నారు. దీనిపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో పేదలకు అందుతున్న వైద్య సేవల విధానాన్ని అధ్యయనం చేస్తున్న అధికారుల బృందం ఇప్పటికే తమిళనాడు వెళ్లొచ్చిందని.. ఢిల్లీతోపాటు మరిన్ని రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని సీఎం సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement