డెంగీ బెల్స్
► డెంగీ బెల్స్
► రాష్ట్రానికి దోమ కాటు
► సోమవారం ఒక్కరోజే 67 కేసులు
► ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పరిస్థితి తీవ్రం
► ఇప్పటిదాకా 22 మంది మృతి
► 351 పాజిటివ్ కేసులు.. దేశంలోనే అత్యధికం
► మూడునెలలుగా జ్వరంతో అల్లాడుతున్న 15 గ్రామాలు
► ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2 వేల మందికి డెంగీ నిర్ధారణ
► చేష్టలుడిగి చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ
► డెంగీతో మరణించింది ఐదుగురేనని వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. జ్వరాలతో జనం విలవిల్లాడుతున్నారు. రాష్ట్రమంతటా డెంగీ కేసులు నమోదవుతున్నా.. ఖమ్మం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒక్క బోనకల్ మండలం లోనే 22 మందిని డెంగీ పొట్టనబెట్టుకుంది. డెంగీ ఏ స్థాయిలో విజృంభించిందంటే ఒక్క సోమవారమే రాష్ట్రవ్యాప్తంగా 146 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 67 మందికి డెంగీ ఉన్నట్లు తేలింది. అందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 58 మంది ఉన్నారు. డెంగీ దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటివరకు సమగ్ర చర్యలు తీసుకోలేదు. బోనకల్ మండలంలో 22 మంది చనిపోయినా కేవలం ఐదుగురే చనిపోయారని చెబుతోంది. గత మూడు నెలలుగా ఈ మండలంలోని 15 గ్రామాలు డెంగీతో అల్లాడుతున్నాయి. బోనకల్ మండలంలో దేశంలోనే అత్యధికంగా 351 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
10 నెలల్లో 1,983 కేసులు
రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, మలేరియా కేసులు పెరిగాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారమే.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో 1,983 మందికి డెంగీ సోకినట్లు నిర్ధారించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా మృతులు మాత్రం ఐదుగురేనని చెబుతున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 22 మంది చనిపోయినా.. మృతుల సంఖ్యను తక్కువగా చూపడంపై విమర్శలు వస్తున్నాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో (జనవరి–అక్టోబర్ మధ్య) 2,284 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 894 మందికి డెంగీ సోకినట్లు తేలింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో 3,072 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 377 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లాలో 204 మందికి డెంగీ ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 1118 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 825 కేసులు నమోదయ్యాయి.
బోనకల్‌కు మంత్రి లక్ష్మారెడ్డి!
రెండు మూడ్రోజుల్లో బోనకల్ మండలంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించే అవకాశాలున్నాయని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. డెంగీపై మంత్రి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌తోపాటు రావినూతల, గోవిందాపురం గ్రామాలకు ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించారు. డాక్టర్లు, సిబ్బంది, సెల్ కౌంట్ మిషన్లను కూడా పంపుతామని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని అన్ని స్ప్రేయర్లను బోనకల్‌కు పంపాలని ఆదేశించారు. వారానికి రెండుసార్లు బాధిత ఇళ్లల్లో స్ప్రే చేయాలన్నారు. సీరియస్ కేసులను హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి ఇప్పటికే ఒక బృందాన్ని బోనకల్ పంపామన్నారు. గ్రామానికి ఒకటి చొప్పున 108, మూడు 104 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
ఆ మండలంలో ఇంటింటికి జ్వరమే
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగీతో రోజుకొకరు మృత్యువాత పడుతున్నారు. మండలంలోని గ్రామాల్లో ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు మండలంలోని రావినూతలలో 8 మంది మృతి చెందగా.. 31 మంది డెంగీతో బాధపడుతున్నారు. మరో 56 మంది నుంచి శాంపిళ్లు సేకరించారు. జ్వరం లక్షణాలు కనపడితే జనం బెంబేలెత్తిపోతున్నారు. డెంగీ భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. బోనకల్‌లో ఈ ఏడాది ఆగస్టులో 5,143, సెప్టెంబర్‌లో 6,138, అక్టోబర్‌లో 6,735 మందికి విష జ్వరాలు సోకాయి. మండలంలోని 21 గ్రామాల ప్రజలు ఖమ్మం, విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి వైద్యం కోసం లక్షలు ఖర్చుపెడుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 790 డెంగీ కేసులు నమోదైతే.. ఈ మండలంలోనే సగం కేసులు నమోదయ్యాయి. మండలంలో డెంగీతో మరణంచిన 22 మందిలో 15 మంది వరకు 40 ఏళ్ల లోపు వారే ఉన్నారు. జ్వరాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కొందరు భయంతో గ్రామాలను వీడుతున్నారు.
చేతికందిన కుమారుడిని కోల్పోయి..
బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన గుగులోతు రూప్లా కుమారుడు సైదులు(30) డెంగీతో అక్టోబర్ 14న మృతి చెందాడు. గత నెల 11న సైదులుకు జ్వరం వచ్చింది. ఆర్‌ఎంపీ వద్ద తగ్గకపోవడంతో మరుసటిరోజు ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఒక్కరోజు వైద్యం చేసిన తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడ డెంగీ జ్వరం వచ్చిందని, కిడ్నీ, లివర్‌పై ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. రూ.2.20 లక్షలు ఖర్చు చేసినప్పటికీ కుమారుడు దక్కలేదంటూ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. కూలీనాలీ చేసి కుమారుడిని ఎమ్మెస్సీ బీఈడీ చేయించాడు. ఆరునెలల కిందటే వివాహం చేశాడు.
పెద్దదిక్కుని కబలించింది..
రావినూతల గ్రామానికి చెందిన అజ్మీరా రఘుపతి(65) గతనెల 19న డెంగీతో మృతి చెందాడు. ఈయనకు 17వ తేదీన జ్వరం రావడంతో మరుసటి రోజు ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జ్వరంతోపాటు ప్లేట్‌లెట్లు పడిపోయాయి. వైద్యానికి రూ.1.30 లక్షల వరకు ఖర్చు చేసినా లాభం లేకపోయింది. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆయన భార్య మస్రు కన్నీరు మున్నీరవుతోంది.
జ్వరం వచ్చిన రెండు రోజులకే..
రావినూతలకు చెందిన పుచ్చకాయల లక్ష్మి (35)కి అక్టోబర్ 24న జ్వరం వచ్చింది. ఆమె భర్త జగ్గయ్యపేట ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తగ్గకపోవడంతో కోదాడలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. డెంగీ జ్వరం వచ్చిందని, ప్లేట్‌లెట్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. దీంతో ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో 26న లక్ష్మి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
శక్తివంతమైన వైరస్ వల్లే..: డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం
శక్తివంతమైన విరువెంట్ వైరస్ వల్లే బోనకల్ మండలంలో 22 మందికిపైగా మరణించారు. పారిశుద్ధ్య లోపం కూడా ప్రధాన కారణం. సాధారణ జ్వరంగా భావించి కొందరు స్థానిక వైద్యులను సంప్రదించారు. వాళ్లు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ప్లేట్‌లెట్లు తగ్గినా చివరి వరకు తెలియని పరిస్థితి నెలకొంది. మా అంచనా ప్రకారం 22 మంది కంటే ఎక్కువగానే చనిపోయి ఉంటారు.
====
జిల్లాల వారీగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు డెంగీ, మలేరియా కేసుల వివరాలు
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
జిల్లా డెంగీ మలేరియా
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఆదిలాబాద్ 23 1,118
కరీంనగర్ 134 48
వరంగల్ 140 438
ఖమ్మం 894 825
మహబూబ్‌నగర్ 64 46
మెదక్ 19 66
నల్లగొండ 28 17
హైదరాబాద్ 377 138
రంగారెడ్డి 100 30
నిజామాబాద్ 204 32
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం 1,983 2,758
––––––––––––––––––––––––––––––––––––––––––––––––