వైద్యశాఖలో అస్తవ్యస్తంగా క్రమబద్ధీకరణ
- ఆందోళనలో అభ్యర్థులు.. ఎటూ తేల్చని అధికారులు
- ముందు చేరిన వారిని పక్కనపెట్టి తర్వాతి వారికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో వైద్య ఆరోగ్యశాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ముందు విధుల్లో చేరిన వారిని పక్కనపెట్టి తర్వాత చేరిన వారిని క్రమబద్ధీకరించారన్న ఆరోపణలున్నాయి. సుమారు రెండు వేల మంది సిబ్బంది ఈ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 310 మందినే క్రమబద్ధీకరించారు. దీంతో మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇలా తక్కువ మందికే అవకాశం కల్పించడంపై కాంట్రాక్టు ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. 33 మంది మహిళా మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లను, 275 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు కంటి వైద్య సహాయ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తూ ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మిగిలిన వారికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగా 900 మంది పనిచేస్తుంటే.. అందులో కేవలం 33 మందినే (మహిళలు) రెగ్యులరైజ్ చేశారు. క్రమబద్ధీకరణ పొందినవారిలో పాత నల్లగొండ జిల్లాకు చెందినవారు ఎవరూ లేరు. ఈ జిల్లా కాంట్రాక్టు ఉద్యోగులను ఎందుకు పక్కన పెట్టారన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అలాగే ఆరోగ్య విభాగంలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వైద్యులనూ క్రమబద్ధీకరించలేదు.
వీరితోపాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది మొత్తాన్నీ పక్కనపెట్టారు. వీరికి ట్రెజరీల నుంచి జీతాలను ఇవ్వకపోవడం కారణంగా చూపుతున్నారు. ట్రెజరీల నుంచి జీతాలు పొందుతున్న ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారిలోనూ పలువురిని పక్కనపెట్టారు. ఇలా వైద్య ఆరోగ్యశాఖలో వందలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం గందరగోళంగా మారింది.