Employees Regulation
-
రిలయన్స్‌కు 1.67 లక్షల మంది ఉద్యోగుల రాజీనామా.. కారణం అదే
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, టెలికం విభాగాలకు భారీ ఎత్తున ఉద్యోగాలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో జియోకి 41 వేల మంది, రిలయన్స్ రీటైల్లో లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులు రిజైన్ చేసిట్లు సమాచారం. రిలయన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. సంస్థలో అట్రిషన్ రేటు 64.8 శాతం పెరిగింది. ఇటీవల కాలంలో రిలయన్స్ కంపెనీ ఇతర రీటైల్ స్టార్టప్‌లను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల సర్ధుబాటు, అదే సమయంలో పెరిగిపోతున్న నియమకాలను అందిపుచ్చుకునేందుకు ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా, ఆర్ధిక సంవత్సరం 2023లో 167,391 మంది ఉద్యోగులు రిలయన్స్ నుంచి వైదొలిగారు. ఇందులో రిటైల్, జియో విభాగాలు ఉన్నాయి. సంస్థకు రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది జూనియర్లు, మిడ్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు రియలన్స్ ప్రతినిధులు తెలిపారు. అంతకు మించి.. కొత్త నియామకాలు ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేస్తున్నప్పటికీ రిలయన్స్ ఆర్ధిక సంవత్సరం 2023లో 262,558 మంది ఉద్యోగులను నియమించుకుంది. కొత్త ఉద్యోగుల్నితీసుకునే పనిలో పడినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. అందరి చూపు ఆగస్ట్ 28 వైపే కాగా, ఆగస్ట్ 28న మధ్యాహ్నం 2 గంటలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 46వ వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇక ఈ ఈవెంట్ సందర్భంగా, రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రాబోయే జియోఫోన్ 5జీ, కస్టమర్-ఫోకస్డ్ జియో 5G ప్లాన్లు, వివిధ అంశాలపై ముఖ్యమైన అప్డేట్లను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇదీ చదవండి : టమాట ధరలు.. సామాన్యులకు భారీ ఊరట?! -
బైడెన్ టీమ్ మరో భారతీయ మహిళా కిరణం
అమెరికాలో 20 లక్షల 80 వేల మంది ‘ఫెడరల్’ ఉద్యోగులు ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడు కొత్త బాస్ మన భారతీయ మహిళ కిరణ్ అహూజా! స్వయంగా బైడెనే తన ఎంపికగా ఆమెను నియమించారు. ‘ఉద్యోగుల ప్రియబాంధవి’ గా ఆమెకు ఎంత మంచి పేరుందంటే యూఎస్‌లోని అన్ని వర్గాల ఉద్యోగులూ ‘ఈ తరుణంలో జరగవలసిన నియామకం’ అని బైడెన్‌ని అభినందిస్తున్నారు. కిరణ్ అహూజాకైతే ఈ అభినందనలు ఆమె ‘లా’ డిగ్రీ పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటినుంచీ పుష్పగుచ్చంలా చేతికి అందుతూ ఉన్నవే! పాలనలోని అన్ని విభాగాలు, చట్టసభలు, రక్షణ రంగంలోని సిబ్బంది అంతా యూఎస్‌లో ఫెడరల్ సిబ్బందే. ఉద్యోగులుగా అభ్యర్థుల నియామకం మొదలు, పదవీ విరమణ వరకు వారి జీతాలు, సర్వీసులు, పదోన్నతులు, సంక్షేమ సదుపాయాలు, సౌకర్యాలు.. వీటన్నిటినీ యూ.ఎస్.లోని ఒ.పి.ఎం. చూస్తుంటుంది. ఒ.పి.ఎం. అంటే ఆఫీస్ ఆఫ్ పర్సనెల్ మేనేజ్మెంట్. సిబ్బంది నిర్వహణ కార్యాలయం. ప్రధాన కేంద్రం వాషింగ్టన్ డీసీలో ఉంది. ఆ ఒ.పి.ఎం. కే ఇప్పుడు భారత సంతతికి చెందిన కిరణ్ అర్జున్‌దాస్ అహూజా డైరెక్టర్‌గా వెళ్లబోతున్నారు. సెనెట్ ఆమె నియామకాన్ని ఆమోదించగానే ఒ.పి.ఎం. ఆమె చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక అమెరికన్ ఉద్యోగుల బాగోగులన్నీ కిరణ్‌వే. కిరణ్‌నే ఈ పదవిలో నియమించడానికి తగినన్ని కారణాలే ఉన్నాయి. అధికార శ్రేణిలోని పదోన్నతి అంచెలలో భాగంగా చూస్తే.. కిరణ్ రెండున్నరేళ్ల పాటు 2015 నుంచి 2017 వరకు ఒ.పి.ఎం. డైరెక్టర్‌కు ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా పని చేశారు కాబట్టి పై అంచెగా ఆమె డైరెక్టర్ అయ్యారని అనుకోవాలి. అయితే అది మాత్రమే ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లిందని చెప్పడానికి లేదు. 49 ఏళ్ల కిరణ్.. పౌరహక్కుల న్యాయవాది. రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవల సంస్థలకు నేతృత్వం, నాయకత్వం వహించిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం ఆమె యూఎస్‌లోని పరోపకార సంస్థల ప్రాంతీయ యంత్రాంగం అయిన ప్రసిద్ధ ‘ఫిలాంథ్రోఫీ నార్త్‌వెస్ట్’ కు సీఈవోగా ఉన్నారు. ఒబామా అధ్యక్షుడిగా, బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆరేళ్లపాటు ఏషియన్ అమెరికన్లకు ప్రాధాన్యం ఇచ్చి, వారికి మెరుగైన అవకాశాలను కల్పించే ‘వైట్ హౌస్ ఇనీషియేటివ్’ కార్యక్రమానికి కిరణ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆనాటి ఆమె పని తీరును బైడెన్ ప్రత్యక్షంగా చూడటం కూడా ఇప్పుడీ అత్యంత కీలకమైన ఒ.పి.ఎం. డైరెక్టర్ పదవికి ఆమె నామినేట్ అయేందుకు దోహదపడింది. 2003–2008 మధ్య నేషనల్ ఏషియన్ పసిఫిక్ ఆమెరికన్ ఉమెన్స్ ఫోరం వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె అందించిన సేవలూ ఈ కొత్త పదవికి అవసరమైనవే. పౌరహక్కుల న్యాయవాదిగా కిరణ్ కెరీర్ ఆరంభం కూడా అత్యంత శక్తిమంతమైనది. స్కూల్ సెగ్రెగేషన్ మీద (బడులలో పిల్లల్ని జాతులవారీగా వేరు చేసి కూర్చొబెట్టడం), జాతివివక్ష వేధింపుల మీద ‘యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్’లో కేసు వేసిన తొలి న్యాయ విద్యార్థిని ఆమె. ∙∙ కిరణ్ అహూజా జార్జియా రాష్ట్రంలోని సవానాలో పెరిగారు. ఆమె తల్లిదండ్రులు డెబ్బైలలో ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడినవారు. జార్జియా యూనివర్సిటీలోనే ఆమె ‘లా’ లో పట్టభద్రురాలయ్యారు. ఒ.పి.ఎం.లో ట్రంప్ చేసి వెళ్లిన అవకతవకల్ని సరిచేసేందుకే బైడెన్ ఈ పోస్ట్‌లో ఆమెను నియమించారని ‘వాషింగ్టన్ పోస్ట్’ రాసింది. అమెరికాకు మరొక ఆశా కిరణం అనే కదా అర్థం. కిరణ్ అర్జున్‌దాస్ అహూజా -
బంపర్ ఆఫర్: స్మోకింగ్ మానేస్తే..
టోక్యో: ఆఫీసు పనివేళల్లో గుప్పు గుప్పుమంటూ పాకెట్ల కొద్దీ సిగరెట్లను ఊదిపారేసే పొగరాయుళ్లు పని ఎగ్గొడుతున్నట్టు లెక్కా? జపాన్ కంపెనీలు దీన్నే నమ్ముతున్నాయి. అందుకే పొగరాయుళ్ల చేత ధూమపానాన్ని మాన్పించేందుకు అక్కడి కంపెనీలు వినూత్నంగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ కొత్త ఎత్తుగడతో అటు పుణ్యాన్ని, ఇటు పురుషార్ధాన్ని మూటగట్టుకుంటున్నాయి. ఎవరైతే పొగతాగడం మానేస్తారో వారికి అదనంగా జీతంతో సెలవులను ప్రకటిస్తున్నాయి. టోక్యో ఆధారిత మార్కెటింగ్ కంపెనీ పియాలా ఈ ఎత్తుగడ వేసింది. ఆఫీస్ పనిగంటల్లో సిగరెట్ తాగటం మానేస్తే.. ఏడాదిలో ఆరు రోజులు అదనంగా సెలవు మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. సంస్థలోని ఒక ఉద్యోగి సలహా మేరకు కంపెనీ సెప్టెంబర్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ నిబంధనల ప్రకారం బయటకు వెళ్లే వరకు సిగరెట్ కోసం బ్రేక్ తీసుకోకూడదు. సిగరెట్ తాగకూడదు. అంతేకాదు... ఈ నిబంధనలకు ఒకే అంటే చాలు అడ్వాన్స్ కూడా ఇస్తానని ప్రకటించింది. రోజు రోజుకు ఉద్యోగుల్లో పెరుగుతున్న స్మోకింగ్ కల్చర్ ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలలో ఈ స్కీమ్ అమలు చేసిన తర్వాత నలుగురు ఉద్యోగులు పొగతాగడం మానేశారని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అసుక వెల్లడించారు. తమ కంపెనీలో మొత్త 120 మంది ఉద్యోగులు పని చేస్తోంటే వారిలో 30 మంది స్మోకర్స్ అని చెప్పారు. అలాగే తాము ఆఫర్ ప్రకటించిన నెల రోజుల్లోనే నలుగురు సిగరెట్ తాగడం మానేశారన్నారు. ఇది తమకు చాలా సంతోషాన్నిచ్చిందనీ, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. అయితే ఈ కోవలో పియాలానే మొదటి కంపెనీకాదు. పియాల కంపెనీ కంటే ముందు జూన్ నెలలో.. లాసన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ కూడా ఆఫీస్ పని వేళల్లో స్మోకింగ్ ను పూర్తిగా నిషేధించింది. దీని వల్ల ఆ కంపెనీలో స్మోకింగ్ చేసే వారిలో 10శాతం మంది పూర్తిగా మానేశారట. దీంతో వారికి కూడా అదనపు సెలవులు, నగదు బోనస్ ఇచ్చింది ఆ కంపెనీ. అది మంచి ఫలితాలను ఇవ్వటంతో.. పియాల కూడా అదే పద్ధతిని ఫాలో అయిపోయిందన్నమాట . ఇలా జపాన్ కంపెనీలు ఉద్యోగుల్లో స్మోకింగ్ ను కంట్రోల్ చేసేందుకు.. ఇలాంటి బోలెడు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం జపాన్ దేశంలో 21.7శాతం మంది పెద్దలు ధూమపానం చేస్తున్నట్టు తేలింది. మరోవైపు జపాన్ రాజధాని నగరం టోక్యోలో 2020సమ్మర్ ఒలంపిక్స్ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించాలని యోచిస్తున్నట్టు టోక్యో గవర్నర్ యూరికో కోయికో ఇటీవల ప్రకటించారు. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఏటా 700 మిలియన్ డాలర్ల డివిడెండ్ చెల్లిస్తున్న అక్కడి సిగరెట్ మేజర్ కంపెనీ జపాన్ టుబాకో, ఇతర హోటళ్లు, ధూమపాన అనుకూల రాజకీయవేత్తల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొనడం గమనార్హం. -
వైద్యశాఖలో అస్తవ్యస్తంగా క్రమబద్ధీకరణ
- ఆందోళనలో అభ్యర్థులు.. ఎటూ తేల్చని అధికారులు - ముందు చేరిన వారిని పక్కనపెట్టి తర్వాతి వారికి అవకాశం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో వైద్య ఆరోగ్యశాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ముందు విధుల్లో చేరిన వారిని పక్కనపెట్టి తర్వాత చేరిన వారిని క్రమబద్ధీకరించారన్న ఆరోపణలున్నాయి. సుమారు రెండు వేల మంది సిబ్బంది ఈ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 310 మందినే క్రమబద్ధీకరించారు. దీంతో మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇలా తక్కువ మందికే అవకాశం కల్పించడంపై కాంట్రాక్టు ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. 33 మంది మహిళా మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లను, 275 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు కంటి వైద్య సహాయ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తూ ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన వారికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగా 900 మంది పనిచేస్తుంటే.. అందులో కేవలం 33 మందినే (మహిళలు) రెగ్యులరైజ్ చేశారు. క్రమబద్ధీకరణ పొందినవారిలో పాత నల్లగొండ జిల్లాకు చెందినవారు ఎవరూ లేరు. ఈ జిల్లా కాంట్రాక్టు ఉద్యోగులను ఎందుకు పక్కన పెట్టారన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అలాగే ఆరోగ్య విభాగంలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వైద్యులనూ క్రమబద్ధీకరించలేదు. వీరితోపాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది మొత్తాన్నీ పక్కనపెట్టారు. వీరికి ట్రెజరీల నుంచి జీతాలను ఇవ్వకపోవడం కారణంగా చూపుతున్నారు. ట్రెజరీల నుంచి జీతాలు పొందుతున్న ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారిలోనూ పలువురిని పక్కనపెట్టారు. ఇలా వైద్య ఆరోగ్యశాఖలో వందలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. -
కటాఫ్ డేట్ 2016 డిసెంబర్ 4
⇒ విద్యుత్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు.. ⇒ టీఎస్పీసీసీలో నిర్ణయించిన విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ⇒ 28లోగా ఔట్ సోర్సింగ్ వివరాల సమర్పణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2016 డిసెంబర్ 4ను కటాఫ్ డేట్‌గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ (టీఎస్పీసీసీ) సమావేశంలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు ఈ మేరకు తీర్మానం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కటాఫ్ తేదీలోగా విద్యుత్ సంస్థల్లో నియామకం పొందిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా పరిగణించనున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కటాఫ్ తేదీని విద్యుత్ సంస్థలు ఖరారు చేశాయి. త్వరలో జారీ చేయనున్న క్రమబద్ధీకరణ మార్గదర్శకాల్లో కటాఫ్ తేదీగా చేర్చనున్నారు. 28లోగా ‘ఔట్ సోర్సింగ్’ వివరాలు విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో జోన్లు, డివిజన్లు, పవర్ స్టేషన్ల వారీగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిర్దేశించిన ఫార్మాట్లలో ఈనెల 28 లోగా సమర్పించాలని ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో సుమారు 16,900 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) విభాగాల్లో పని చేస్తున్నారని ట్రాన్స్‌కో ఇప్పటికే ప్రాథమికంగా నిర్థారించింది. టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు తదితర కేటగిరీల్లో మరికొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ సంబంధించిన బయోడేటా, నివాస ధ్రువీకరణ, స్వీయ ధ్రువీకరణ పత్రాలు, ఔట్ సోర్సింగ్ ఒప్పందం, అనుభవం తదితర వివరాలతో నిర్దేశించిన ఫార్మాట్లలో సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను రూపొందించనున్నారు. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యపై ఈనెల 28 తర్వాత స్పష్టత రానుంది. మార్గదర్శకాలను ప్రతిపాదించిన యూనియన్లు ట్రాన్స్‌కో యాజమాన్యం సూచన మేరకు ఇప్పటికే కొన్ని ట్రేడ్ యూనియన్లు స్వయంగా క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదిం చాయి. విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిబంధనలతో సంబంధం లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద రిని క్రమబద్ధీకరించాలని దాదాపు అన్ని యూనియన్లు కోరుకున్నాయి. మరోవైపు క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను మార్చి 31లోగా జారీ చేస్తామని, మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. దీంతో గడువులోగా మార్గదర్శకాలు సిద్ధం అవుతాయా, లేదా అనే అంశంపై ట్రేడ్ యూనియన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.