టోక్యో: ఆఫీసు పనివేళల్లో గుప్పు గుప్పుమంటూ పాకెట్ల కొద్దీ సిగరెట్లను ఊదిపారేసే పొగరాయుళ్లు పని ఎగ్గొడుతున్నట్టు లెక్కా? జపాన్ కంపెనీలు దీన్నే నమ్ముతున్నాయి. అందుకే పొగరాయుళ్ల చేత ధూమపానాన్ని మాన్పించేందుకు అక‍్కడి కంపెనీలు వినూత్నంగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ కొత్త ఎత్తుగడతో అటు పుణ్యాన్ని, ఇటు పురుషార్ధాన్ని మూటగట్టుకుంటున్నాయి. ఎవరైతే పొగతాగడం మానేస్తారో వారికి అదనంగా జీతంతో సెలవులను ప్రకటిస్తున్నాయి.
టోక్యో ఆధారిత మార్కెటింగ్ కంపెనీ పియాలా ఈ ఎత్తుగడ వేసింది. ఆఫీస్ పనిగంటల్లో సిగరెట్ తాగటం మానేస్తే.. ఏడాదిలో ఆరు రోజులు అదనంగా సెలవు మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. సంస్థలోని ఒక ఉద్యోగి సలహా మేరకు కంపెనీ సెప్టెంబర్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ నిబంధనల ప్రకారం బయటకు వెళ్లే వరకు సిగరెట్ కోసం బ్రేక్ తీసుకోకూడదు. సిగరెట్ తాగకూడదు. అంతేకాదు... ఈ నిబంధనలకు ఒకే అంటే చాలు అడ్వాన్స్ కూడా ఇస్తానని ప్రకటించింది. రోజు రోజుకు ఉద్యోగుల్లో పెరుగుతున్న స్మోకింగ్ కల్చర్ ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ నెలలో ఈ స్కీమ్ అమలు చేసిన తర్వాత నలుగురు ఉద్యోగులు పొగతాగడం మానేశారని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అసుక వెల్లడించారు. తమ కంపెనీలో మొత్త 120 మంది ఉద్యోగులు పని చేస్తోంటే వారిలో 30 మంది స్మోకర్స్ అని చెప్పారు. అలాగే తాము ఆఫర్ ప్రకటించిన నెల రోజుల్లోనే నలుగురు సిగరెట్ తాగడం మానేశారన్నారు. ఇది తమకు చాలా సంతోషాన్నిచ్చిందనీ, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు.
అయితే ఈ కోవలో పియాలానే మొదటి కంపెనీకాదు. పియాల కంపెనీ కంటే ముందు జూన్ నెలలో.. లాసన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ కూడా ఆఫీస్ పని వేళల్లో స్మోకింగ్ ను పూర్తిగా నిషేధించింది. దీని వల్ల ఆ కంపెనీలో స్మోకింగ్ చేసే వారిలో 10శాతం మంది పూర్తిగా మానేశారట. దీంతో వారికి కూడా అదనపు సెలవులు, నగదు బోనస్ ఇచ్చింది ఆ కంపెనీ. అది మంచి ఫలితాలను ఇవ్వటంతో.. పియాల కూడా అదే పద్ధతిని ఫాలో అయిపోయిందన్నమాట . ఇలా జపాన్ కంపెనీలు ఉద్యోగుల్లో స్మోకింగ్ ను కంట్రోల్ చేసేందుకు.. ఇలాంటి బోలెడు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.
కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం జపాన్ దేశంలో 21.7శాతం మంది పెద్దలు ధూమపానం చేస్తున్నట్టు తేలింది. మరోవైపు జపాన్ రాజధాని నగరం టోక్యోలో 2020సమ్మర్ ఒలంపిక్స్ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించాలని యోచిస్తున్నట్టు టోక్యో గవర్నర్ యూరికో కోయికో ఇటీవల ప్రకటించారు. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఏటా 700 మిలియన్ డాలర్ల డివిడెండ్ చెల్లిస్తున్న అక్కడి సిగరెట్ మేజర్ కంపెనీ జపాన్ టుబాకో, ఇతర హోటళ్లు, ధూమపాన అనుకూల రాజకీయవేత్తల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment