అమెరికాలో 20 లక్షల 80 వేల మంది ‘ఫెడరల్’ ఉద్యోగులు ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడు కొత్త బాస్ మన భారతీయ మహిళ కిరణ్ అహూజా! స్వయంగా బైడెనే తన ఎంపికగా ఆమెను నియమించారు. ‘ఉద్యోగుల ప్రియబాంధవి’ గా ఆమెకు ఎంత మంచి పేరుందంటే యూఎస్‌లోని అన్ని వర్గాల ఉద్యోగులూ ‘ఈ తరుణంలో జరగవలసిన నియామకం’ అని బైడెన్‌ని అభినందిస్తున్నారు. కిరణ్ అహూజాకైతే ఈ అభినందనలు ఆమె ‘లా’ డిగ్రీ పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటినుంచీ పుష్పగుచ్చంలా చేతికి అందుతూ ఉన్నవే!
పాలనలోని అన్ని విభాగాలు, చట్టసభలు, రక్షణ రంగంలోని సిబ్బంది అంతా యూఎస్‌లో ఫెడరల్ సిబ్బందే. ఉద్యోగులుగా అభ్యర్థుల నియామకం మొదలు, పదవీ విరమణ వరకు వారి జీతాలు, సర్వీసులు, పదోన్నతులు, సంక్షేమ సదుపాయాలు, సౌకర్యాలు.. వీటన్నిటినీ యూ.ఎస్.లోని ఒ.పి.ఎం. చూస్తుంటుంది. ఒ.పి.ఎం. అంటే ఆఫీస్ ఆఫ్ పర్సనెల్ మేనేజ్‌మెంట్. సిబ్బంది నిర్వహణ కార్యాలయం. ప్రధాన కేంద్రం వాషింగ్టన్ డీసీలో ఉంది. ఆ ఒ.పి.ఎం. కే ఇప్పుడు భారత సంతతికి చెందిన కిరణ్ అర్జున్‌దాస్ అహూజా డైరెక్టర్‌గా వెళ్లబోతున్నారు. సెనెట్ ఆమె నియామకాన్ని ఆమోదించగానే ఒ.పి.ఎం. ఆమె చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక అమెరికన్ ఉద్యోగుల బాగోగులన్నీ కిరణ్‌వే.
కిరణ్‌నే ఈ పదవిలో నియమించడానికి తగినన్ని కారణాలే ఉన్నాయి. అధికార శ్రేణిలోని పదోన్నతి అంచెలలో భాగంగా చూస్తే.. కిరణ్ రెండున్నరేళ్ల పాటు 2015 నుంచి 2017 వరకు ఒ.పి.ఎం. డైరెక్టర్‌కు ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా పని చేశారు కాబట్టి పై అంచెగా ఆమె డైరెక్టర్ అయ్యారని అనుకోవాలి. అయితే అది మాత్రమే ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లిందని చెప్పడానికి లేదు. 49 ఏళ్ల కిరణ్.. పౌరహక్కుల న్యాయవాది. రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవల సంస్థలకు నేతృత్వం, నాయకత్వం వహించిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం ఆమె యూఎస్‌లోని పరోపకార సంస్థల ప్రాంతీయ యంత్రాంగం అయిన ప్రసిద్ధ ‘ఫిలాంథ్రోఫీ నార్త్‌వెస్ట్’ కు సీఈవోగా ఉన్నారు.
ఒబామా అధ్యక్షుడిగా, బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆరేళ్లపాటు ఏషియన్ అమెరికన్‌లకు ప్రాధాన్యం ఇచ్చి, వారికి మెరుగైన అవకాశాలను కల్పించే ‘వైట్ హౌస్ ఇనీషియేటివ్’ కార్యక్రమానికి కిరణ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆనాటి ఆమె పని తీరును బైడెన్ ప్రత్యక్షంగా చూడటం కూడా ఇప్పుడీ అత్యంత కీలకమైన ఒ.పి.ఎం. డైరెక్టర్ పదవికి ఆమె నామినేట్ అయేందుకు దోహదపడింది. 2003–2008 మధ్య నేషనల్ ఏషియన్ పసిఫిక్ ఆమెరికన్ ఉమెన్స్ ఫోరం వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె అందించిన సేవలూ ఈ కొత్త పదవికి అవసరమైనవే. పౌరహక్కుల న్యాయవాదిగా కిరణ్ కెరీర్ ఆరంభం కూడా అత్యంత శక్తిమంతమైనది. స్కూల్ సెగ్రెగేషన్ మీద (బడులలో పిల్లల్ని జాతులవారీగా వేరు చేసి కూర్చొబెట్టడం), జాతివివక్ష వేధింపుల మీద ‘యు.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్’లో కేసు వేసిన తొలి న్యాయ విద్యార్థిని ఆమె.
∙∙
కిరణ్ అహూజా జార్జియా రాష్ట్రంలోని సవానాలో పెరిగారు. ఆమె తల్లిదండ్రులు డెబ్బైలలో ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడినవారు. జార్జియా యూనివర్సిటీలోనే ఆమె ‘లా’ లో పట్టభద్రురాలయ్యారు. ఒ.పి.ఎం.లో ట్రంప్ చేసి వెళ్లిన అవకతవకల్ని సరిచేసేందుకే బైడెన్ ఈ పోస్ట్‌లో ఆమెను నియమించారని ‘వాషింగ్టన్ పోస్ట్’ రాసింది. అమెరికాకు మరొక ఆశా కిరణం అనే కదా అర్థం.
కిరణ్ అర్జున్‌దాస్ అహూజా
బైడెన్ టీమ్ మరో భారతీయ మహిళా కిరణం
Published Thu, Feb 25 2021 12:33 AM | Last Updated on Thu, Feb 25 2021 9:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment