
రక్తహీనత మహిళలకు పోషకాహారం
⇒ ఇక్రిశాట్‌తో ఒప్పందానికి వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం
⇒ పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ జిల్లా ఎంపిక
⇒ జొన్న, ఇతర తృణధాన్యాల మిశ్రమ పొట్లాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రక్తహీనతతో బాధపడే గ్రామీణ, గిరిజన ప్రాంతాల మహిళలకు పోషకాహారం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఇక్రిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇక్రిశాట్ అధికారులతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ చర్చించారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఏరియాలో పైలట్ ప్రాజెక్టు కింద మహిళలకు పోషకాహారంతో కూడిన ఆహారా న్ని రోజువారీగా సరఫరా చేయ నున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తారు.
60 శాతం మందికిపైగా రక్తహీనత బాధితులే
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దాదాపు 60 శాతానికిపైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. రక్తహీనత కారణంగా వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతు న్నాయి. వాకాటి కరుణ ఆధ్వర్యంలో జిల్లాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనల్లో ఎక్కడ చూసినా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. దీంతో పోషకాహార సరఫరా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్రిశాట్ ఇప్పటికే పోషకాహార మిశ్రమాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచింది. జొన్నలు, శనగలు, రాగులు, ఇతరత్రా సమపాళ్లలో కలిపిన ఆహారపదార్థాలను కలిపి ఉంచిన పొట్లాలను సిద్ధం చేసింది.
అలాగే ప్రత్యేకంగా తయారు చేసిన పోషకాహార బిస్కెట్లను కూడా ఇక్రిశాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని రక్తహీనతతో బాధపడుతున్న మహిళలతోపాటు ఇతర మహిళలకు కూడా సరఫరా చేయాలనేది వైద్య ఆరోగ్యశాఖ ఉద్దేశం. దీనికి సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నిధులను ఉపయోగించుకోనుంది. ఉట్నూరులోని మహిళల సంఖ్య, వారిలో రక్తహీనతతో బాధపడుతున్న వారెందరు వంటి వివరాలను సేకరించి త్వరలో అక్కడ పోషకాహారాన్ని సరఫరా చేయనుంది.