
జిల్లా ఆస్పత్రుల్లో ‘పడకలు’ పెంపు
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పడకల స్థాయిని 500లకు పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
కొత్త జిల్లాల నేపథ్యంలో 500కు పెంచాలని ప్రభుత్వ నిర్ణయం
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పడకల స్థాయిని 500లకు పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే ఏరియా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయనుంది. ప్రస్తుత జిల్లా ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 200 నుంచి 350 వరకు ఉండగా.. వాటిని 500లకు పెంచనుంది. కొత్త జిల్లాల్లో ఏరియా ఆస్పత్రుల్లో 100 పడకల చొప్పున ఉండగా.. వాటిని 500 పడకలకు పెంచుతారు. ఆ ప్రకారం వైద్య సిబ్బంది కూడా రెట్టింపునకు మించి పెరగనున్నారు. ప్రస్తుతం 16 ఏరియా ఆస్పత్రులైన మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి, జనగాం, యాదాద్రి, మహబూబాబాద్, కామారెడ్డి, గద్వాల, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, వికారాబాద్, మల్కాజిగిరి, మంచిర్యాల సహా పెద్దపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌లోని మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తారు. శంషాబాద్‌లో కొత్తగా జిల్లా ఆస్పత్రిని నిర్మిస్తారు. బోధనాసుపత్రుల్లో మాత్రం ఎలాంటి మార్పులుండవు.
అడిషనల్ డీఎంహెచ్‌వోలే బాసులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు జిల్లా చీఫ్‌లుగా డీఎంహెచ్‌వోలు ఉంటున్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి మార్పూ ఉండదు. కొత్తగా వచ్చే జిల్లాల్లో తొమ్మిది చోట్ల అడిషనల్ డీఎంహెచ్‌వోలకు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోలుగా బాధ్యతలు అప్పగిస్తారు. మిగిలిన కొత్త జిల్లాల్లో వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు ప్రత్యేకాధికారులుగా ఉన్న వారిలో సమర్థులను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగిస్తారు. మరోవైపు నాలుగైదు పీహెచ్‌సీలకు కలిపి ప్రస్తుతమున్న క్లస్టర్ల సంఖ్యను కుదించి వాటికి డిప్యూటీ డీఎంహెచ్‌వోలను నియమిస్తారు. చిన్న మార్పులు మినహా వైద్య ఆరోగ్య శాఖలో ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్ విభాగాల అధికారాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుత వ్యవస్థనే కొనసాగిస్తారు.