సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే కార్పొరేట్ హంగులు సంతరించుకున్న గాంధీ జనరల్ ఆస్పత్రిని ప్రత్యేక అవయవ మార్పిడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆస్పత్రిలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి, ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తే గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కాంక్లీయర్ ఇంప్లాంటేషన్స్, మోకాలి చిప్పల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ సాంకేతిక బృందం ఇటీవల ఆస్పత్రిని సందర్శించింది.
రూ.20 కోట్లతో ఆరు థియేటర్లు
మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, జన్యుపర లోపాల వల్ల చాలామంది చిన్నతనంలోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, మోకీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి, మూగ, వినికిడి లోపంతో జన్మించడం, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఈ చికిత్సలు అందడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చాలా ఖరీదుతో కూడినవి కావడంతో ఆ స్తోమత లేని పేద రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. ఆ మేరకు గాంధీ ఆస్పత్రి ఇన్‌పేషెంట్ భవనం ఎనిమిదో అంతస్థులో రూ.20 కోట్లతో ఆరు అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు కు నిర్ణయించింది.
గాంధీలోనే ఎందుకంటే..
అవయవ మార్పిడి చికిత్స కోసం నిమ్స్ జీవన్‌దాన్‌లో ప్రస్తుతం 4,503 మంది దరఖాస్తు చేసుకో గా, వీరి లో 2,403 మంది కిడ్నీ బాధితులు, 2,012 మం ది కాలేయ బాధితులు ఉన్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు 723 కిడ్నీ, 423 కాలేయం, 63 గుండె, 166 హార్ట్‌వాల్వస్, 391 కార్నియాలు, 8 ఊపిరితితుత్తలు, ఎనిమిది ప్రాంకీయాస్ మార్పి డి చికిత్సలు చేశారు. 250పైగా కాంక్లీయర్ ఇంప్లాం ట్స్ సర్జరీలు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రిల్లో గుండె, కాలేయ మార్పిడి చేయించుకో వాలంటే రూ.25 లక్షలకుపైగా ఖర్చు చేయాలి. సాధారణ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీకే రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యనిపుణులకు లోటు లేదు. దీంతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి.. రోగులకు పైసా ఖర్చు లేకుండానే ఖరీదైన వైద్య సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావించింది.
Comments
Please login to add a commentAdd a comment