ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుకు ‘యాప్’ | 'App' for Employees, journalists health scheme | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుకు ‘యాప్’

Published Sat, Nov 12 2016 2:26 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

'App' for Employees, journalists health scheme

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మొబైల్ యాప్‌ను తయారు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా ఏ ఆసుపత్రుల్లో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి, అందులోని వైద్యుల పేర్లు, వెల్‌నెస్ కేంద్రాల వివరాలు, వాటి సమయాలు, నగదు రహిత వైద్యం నిర్వహించే ఆసుపత్రులు తదితర సమాచారాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు నిర్వ హించిన వైద్య పరీక్షలు, వివిధ ఆసుపత్రుల్లో నిర్వహించిన సేవల వివరాలు కూడా యాప్‌లో ఉంచుతారు. ప్రతీ ఉద్యోగి, జర్నలిస్టుకు యూనిక్ నంబర్‌ను కేటాయిస్తారు. ఆ నంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేస్తే వారి ఆరోగ్య వివరాలన్నీ అందులో ఉంటాయి.

 
ఈ నెలాఖరు నుంచి వెల్‌నెస్ కేంద్రాలు...:
ఈ నెలాఖరు నుంచి ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం నగదు రహిత ఓపీ సేవలను అందించే వెల్‌నెస్ (రిఫరల్) కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వాస్తవంగా ఈ వారంలోనే అందుబాటులోకి తేవాలని నిర్ణయించినా పెద్ద నోట్ల రద్దుతో ఈ నిర్ణయం వాయిదా పడినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఆరు చోట్ల, పాత జిల్లా కేంద్రాలన్నింట్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఎవరైనా ఇన్ పేషెంట్ (ఐపీ) సేవలను పొందాలనుకుంటే నేరుగా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లొచ్చని తెలిపాయి.

దీనికి సంబంధించిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. వెల్‌నెస్ కేంద్రాల్లో ఓపీ సేవలు, ఉచిత పరీక్షలు, మందులు ఇచ్చే పరిస్థితి అమలులోకి వచ్చాక... కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాక ప్రస్తుతం అమల్లో ఉన్న రీయింబర్స్‌మెంట్ విధానాన్ని రద్దు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement