విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
⇒ ఆరు నెలల్లో 521 పాజిటివ్ కేసులు... 17 మంది మృతి
⇒ 14 తేదీ ఒక్కరోజే 39 పాజిటివ్ కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ రోజు రోజుకూ విజృంభిస్తోంది. వారం పది రోజు లుగా అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మంగళవారం(14) ఒక్క రోజే 137 మంది రక్త నమూనాలను పరీక్షించగా... అందులో 39 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. గతేడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ నెల 14 వరకు ఆరు నెలల కాలంలో 4,633 మంది రక్త నమూనాలను పరీక్షించగా... 521 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. అందులో 17 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. చనిపోయిన వారిలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు.
ఇదిలా ఉండగా వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీ యంగా పెరుగుతోంది. ఏ ఆసుపత్రికెళ్లినా వైరల్ ఫీవర్ కేసులు అధికంగా కనిపిస్తున్నాయి. వచ్చే నెల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గాంధీ ఆస్ప త్రిలో బతకడం కష్టమని తేల్చిన సీత అనే మహి ళను.. ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రూ. 4 లక్షలు తీసు కుని చికిత్స అందించి బతికించారు.
గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శన మిది. స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరే రోగులకు ఉచిత వైద్యం అందించాలని... మందులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. స్వైన్‌ఫ్లూపై విస్తృత ప్రచారం జరపాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణ లున్నాయి. ఇదిలా ఉండగా ఈసీఐఎల్‌కు చెందిన వ్యక్తి(69) స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఈనెల 13న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. నమూనాలు సేకరించి వైద్య సేవలు అందిస్తుండగా అదే రోజు మృతి చెందాడు. బుధవారం అందిన నివేదికలో అతనికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది.