సాఫ్ట్‘వేర్’
– వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలపై గందరగోళం
– ఇంకా తయారు కాని ‘సాఫ్ట్‌వేర్’
– ముగిసిన దరఖాస్తు గడువు
– బదిలీలుంటాయో..ఉండవోనని ఉద్యోగుల్లో ఆందోళన
అనంతపురం మెడికల్ : వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల వ్యవహారం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగిసినా బదిలీల నిర్వహణకు సంబంధించి సాఫ్ట్‌వేర్ కూడా తయారు కాలేదు. దీంతో అసలు బదిలీలు ఉంటాయో, ఉండవోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అరుణకుమారి ఈ నెల 8న బదిలీల షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 24వ తేదీకల్లా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే.. దరఖాస్తుపైనే ఇప్పటివరకు స్పష్టత రాలేదు. సాఫ్ట్‌వేర్ తయారు కాకపోవడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బదిలీలకు అర్హులైన ఉద్యోగులు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని గతంలోనే ఆదేశాలందాయి.
పారదర్శకత కోసం తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ఎంప్లాయీస్ ట్రాన్‌ఫర్ సిస్టం (ఓఈటీఎస్)లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాఫ్ట్‌వేర్ సిద్ధం కాకపోవడంతో ఉద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే గడువు కూడా ముగిసిపోయింది. జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయి, 20 శాతానికి మించకుండా చేపడితే ఎంత మంది బదిలీ అవుతారో ఈ సాఫ్ట్‌వేర్ ద్వారానే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అసలు బదిలీల దరఖాస్తులే కాదు.. ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. దీనిపై ఎవరికీ స్పష్టత లేకపోవడంతో ఈ ఏడాది బదిలీలు ఉండవన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అటెండర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, జూనియర్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, స్టాఫ్‌నర్సులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఎంపీహెచ్‌ఈలు తదితర కేడర్లలో సుమారు 800 మంది బదిలీలకు అర్హత కల్గివున్నట్లు తెలుస్తోంది.
సమయం ఇస్తారా?
జిల్లాలో ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఉద్యోగులకు తెలిసేలా ఆన్‌లైన్‌లో ఉంచలేదు. ఈ క్రమంలో ఖాళీల వివరాలే తెలియకపోతే ఉద్యోగులు ఏ ప్రాంతం కోరుకోవాలో స్పష్టతకు రాలేరు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి సమయం ఇవ్వాలన్న యోచనలో ఉన్నతాధికారులున్నట్లు తెలుస్తోంది. గతంలోలా కాకుండా కేవలం రెండ్రోజులు మాత్రమే దరఖాస్తు గడువు ఇవ్వవచ్చన్న అభిప్రాయం ఆ శాఖ వర్గాల నుంచి విన్పిస్తోంది.
క్లియర్ వేకెన్సీ లిస్ట్ అడిగారు : డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ
జిల్లా వ్యాప్తంగా ‘క్లియర్ వేకెన్సీ’ వివరాలు కావాలని ఉన్నతాధికారుల నుంచి ఈ రోజే (గురువారం) ఆదేశాలు వచ్చాయి. సుమారు 15 కేడర్ల వివరాలు తీస్తున్నాం. సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రాకపోవడంతోనే బదిలీల ప్రక్రియ ప్రారంభం కాలేదు. రెండు, మూడ్రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అందుకే లిస్ట్ అడుగుతున్నారనుకుంటా.