officers transfer
-
గాడిలోకి పాలన..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్త ప్రభుత్వం జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని గాడినపెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే జిల్లా పోలీసు బాస్‌ను మార్పు చేయడంతో తొలి అడుగు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఏఎస్ అధికారులనూ బదిలీ చేసింది. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కేవీఎన్ చక్రధరబాబును బదిలీచేస్తూ ఏపీ ట్రాన్స్‌కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన స్థానంలో 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.శ్రీనివాసులుకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) పథక సంచాలకుడిగా పనిచేస్తున్నారు. అలాగే సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సీఎం సాయికాంత్ వర్మను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్ సబ్‌కలెక్టర్‌గా వర్మ పనిచేస్తున్నారు. తొలి నుంచీ వివాదాలే.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేస్తూ 2016 నవంబరు 16వ తేదీన కేవీఎన్ చక్రధరబాబు జాయింట్ కలెక్టరుగా బదిలీపై వచ్చారు. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా జిల్లా పరిపాలన వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తారని ప్రజలు ఆశించినప్పటికీ ఆ స్థాయిలో సేవలు అందించలేకపోయారు. తొలిరోజుల్లోనే రెవెన్యూ విభాగంలో ఉద్యోగులతో ముఖ్యంగా తహసిల్దార్లతో వివాదాలు తెచ్చుకున్నారు. ఉద్యోగులు ఒకరోజు విధులను సైతం బహిష్కరించి జిల్లా కలెక్టరేట్‌కు సమీపంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద నిరసన తెలిపారు. అప్పటి జిల్లా కలెక్టర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహం ఈ వివాదం సద్దుమణిగేలా చేశారు. వంశధార, ఆఫ్‌షోర్ ప్రాజెక్టులతోపాటు కొవ్వాడ అణువిద్యుత్తు కేంద్రం నిర్వాసితులకు పరిహారం ప్యాకేజీల చెల్లింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలను చక్రధరబాబు నిలువరించలేకపోయారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుల అండతో చెలరేగిపోయిన అవినీతిపరులకు ఆయన అండగా ఉన్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. తిత్లీ తుఫానుతో జిల్లాలో ఉద్దానం ప్రాంతమంతా దెబ్బతిన్నప్పుడు బాధితులను సకాలంలో ఆదుకునే విషయంలో సరైనరీతిలో స్పందించలేదనే విమర్శలు ఆయనపై వచ్చాయి. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించారని జిల్లా రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడ్డారు. ఇవన్నీ గుర్తించే ప్రభుత్వం ఆయన్ను అంతగా ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏలో తనదైన ముద్ర... సీతంపేట ఐటీడీఏ పీవో పోస్టులో ఐఏఎస్ అధికారిని నియమించడం లోతేటి శివశంకర్తోనే మొదలైంది. 2016 నవంబరు 16న పీవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పోస్టులో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారిగా గుర్తింపుపొందారు. జిల్లా పర్యాటక రంగంలో సీతంపేటకు స్థానం కల్పించడంలో తనదైన పాత్ర పోషించారు. అడ్వంచర్ పార్కు, మెట్టుగూడ జలపాతం వద్ద పర్యాటకులకు వసతులు కల్పించారు. హెచ్‌ఎన్‌టీసీ నర్సరీలో మన్యం ఎకో పార్కును తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టారు. పీఎంఆర్సీలో గిరిజన మ్యూజియం ఏర్పాటుకు కృషి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ‘నెలనెలా వెన్నెల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఆయనపై కూడా పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్యాటక రంగం అభివృద్ధి పనుల్లో అక్రమాలకు తావిచ్చారనే విమర్శలు వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ మంత్రులు, నాయకులకు కొమ్ముకాశారని గిరిజన సంఘాలు నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు... శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ కె.శ్రీనివాసులు వెటర్నరీ సైన్స్ (పశువైద్యం)లో పట్టభద్రుడు. 2007 సంవత్సరంలో గ్రూప్–1కు ఎంపికయ్యారు. డిప్యూటీ కలెక్టరుగా నరసారావుపేట, రాజంపేట, జంగారెడ్డిగూడెంలో పనిచేశారు. డీఆర్డీఏ, డ్వామా పీడీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. పులిచింతల ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టరుగా పనిచేశారు. ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన ప్రస్తుతం విశాఖ జిల్లా డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్నారు. బదిలీపై శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టరుగా వస్తున్నారు. రెండ్రోజుల్లో విధుల్లో చేరతానని ‘సాక్షి’కి చెప్పారు. ఐటీఏడీ పీవో సీఎం సాయికాంత్ వర్మ... కర్నూలు జిల్లాకు చెందిన సాయికాంత్ వర్మ మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదివారు. 2014 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించారు. అదీ తొలి ప్రయత్నంలోనే పొందడం విశేషం. తొలి పోస్టింగ్‌లో రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరుగా నియమితులయ్యారు. 2017 అక్టోబరు 4వ తేదీ నుంచి ఈ పోస్టులో 20 నెలల పాటు పనిచేశారు. అక్కడి నుంచి సీతంపేట ఐటీడీఏ పీవోగా బదిలీ అయ్యారు. -
బదిలీలు.. ప్రభుత్వ వ్యవహారం- సీఎం
బెంగళూరు: పరప్పన అగ్రహార జైలులో అవినీతి బయటకు రావడం, ఐపీఎస్ బదిలీల నుంచి దృష్టి మళ్లించడానికే జెండా తతంగమని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు. పరిపాలన కోసమే బదిలీ చేశామని, ఏ అధికారిని ఎక్కడికి, ఏ సమయంలో బదిలీ చేయాలో ప్రభుత్వానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. అందులో ప్రతిపక్షాలు తల దూర్చడమేంటని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్ర జెండాకు రాజ్యాంగబద్దత కల్పించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సీఎం సమర్ధించుకున్నారు. బుధవారం ఆయన రాష్టానికి చెందిన సివిల్స్ ర్యాంకర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక జెండా తేవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ జెండాను అవమానిస్తోందని బీజేపీ, జేడీఎస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. జాతీయ జెండాకు ఎటువంటి అవమానం కలిగించకుండానే దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించకుండానే రాష్ట్ర పతాకానికి రాజ్యాంగ బద్దత కల్పించాడానికి ప్రయత్సిస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ విమర్శించారు. రాష్ట్రాలకు ప్రత్యేక జెండా ఉండకూడదంటూ లేదా ఉండాలంటూ రాజ్యాంగంలో కూడా ఎక్కడ ప్రస్తావించలేదన్నారు. ‘అన్ని రాష్ట్లాల్లోనూ జాతీయ గీతం ఆలపించడానికి ముందు ఆయా రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారు. దీని వల్ల జాతీయ గీతానికి ఎటువంటి అవమానం కలగదు. అదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక జెండా కలిగి ఉండడం జాతీయ జెండాను ఎలా అవమానించినట్లువుతుంది' అని సీఎం ప్రశ్నించారు. సీనియర్ సాహితీవేత్త పాటిల్ పుట్టప్ప సలహా మేరకు రాష్ట్ర జెండాకు రాజ్యాంగబద్దత కల్పించడానికి ఎదురయ్యే చిక్కులు తదితర అంశాలపై నివేదికలు అందించడానికి సీనియర్ సాహితీవేత్తలతో సమితిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సమితి తమకు నివేదికలు అందించిన అనంతరం సాదకబాధలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
అందర్నీ మార్చేయండి
- రెవెన్యూశాఖ బదిలీల్లో అధికార పార్టీ నేతల జోక్యం - ఉద్యోగవర్గాల మండిపాటు - సిఫారసు లేఖలను పట్టించుకోని కలెక్టర్ అనంతపురం అర్బన్ : జిల్లాలో అధికార పార్టీ ముఖ్య నాయకులు రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పిట్లో ఉంచుకుని అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు సాగించాలని చూస్తున్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో వారు చెప్పినట్లు చేసే సిబ్బందిని నియమించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఆ దిశగా కలెక్టర్‌కు లేఖలు రాశారు. అందులోనూ అనంతపురం ఎంపీ నియోజకవర్గం నుంచి ఒక ప్రజాప్రతినిధి, హిందూపురం ఎంపీ నియోజకవర్గం నుంచి మరో ప్రజాప్రతినిధి మరీ దారుణంగా వారి పరిధిలోని మూడు మండలాల తహసీల్దారు కార్యాలయాల్లో అటెండర్ మొదలు అధికారి వరకు అందరినీ మార్చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. అదే విధంగా తాము సూచించిన వ్యక్తులను నియమించాలని కోరినట్లు సమాచారం. ఈ లేఖలపై ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. సక్రమంగా పని చేయని సిబ్బందిపై ఫిర్యాదు చేయడాన్ని తాము కూడా స్వాగతిస్తామని, కానీ ఏకంగా తహసీల్దారు కార్యాలయాల్లో అటెండర్ మొదలు సిబ్బందిని మొత్తం మార్చాలని లేఖలు పంపడం ఏమిటని ఆగ్రహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ లేఖలను కలెక్టర్ పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టినట్లు తెలిసింది. -
సాఫ్ట్‘వేర్’
– వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలపై గందరగోళం – ఇంకా తయారు కాని ‘సాఫ్ట్వేర్’ – ముగిసిన దరఖాస్తు గడువు – బదిలీలుంటాయో..ఉండవోనని ఉద్యోగుల్లో ఆందోళన అనంతపురం మెడికల్ : వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల వ్యవహారం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగిసినా బదిలీల నిర్వహణకు సంబంధించి సాఫ్ట్వేర్ కూడా తయారు కాలేదు. దీంతో అసలు బదిలీలు ఉంటాయో, ఉండవోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అరుణకుమారి ఈ నెల 8న బదిలీల షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 24వ తేదీకల్లా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే.. దరఖాస్తుపైనే ఇప్పటివరకు స్పష్టత రాలేదు. సాఫ్ట్వేర్ తయారు కాకపోవడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బదిలీలకు అర్హులైన ఉద్యోగులు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని గతంలోనే ఆదేశాలందాయి. పారదర్శకత కోసం తమ దరఖాస్తులను ఆన్లైన్ ఎంప్లాయీస్ ట్రాన్ఫర్ సిస్టం (ఓఈటీఎస్)లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాఫ్ట్వేర్ సిద్ధం కాకపోవడంతో ఉద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే గడువు కూడా ముగిసిపోయింది. జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయి, 20 శాతానికి మించకుండా చేపడితే ఎంత మంది బదిలీ అవుతారో ఈ సాఫ్ట్వేర్ ద్వారానే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అసలు బదిలీల దరఖాస్తులే కాదు.. ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. దీనిపై ఎవరికీ స్పష్టత లేకపోవడంతో ఈ ఏడాది బదిలీలు ఉండవన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అటెండర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, జూనియర్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, స్టాఫ్‌నర్సులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఎంపీహెచ్ఈలు తదితర కేడర్లలో సుమారు 800 మంది బదిలీలకు అర్హత కల్గివున్నట్లు తెలుస్తోంది. సమయం ఇస్తారా? జిల్లాలో ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఉద్యోగులకు తెలిసేలా ఆన్లైన్లో ఉంచలేదు. ఈ క్రమంలో ఖాళీల వివరాలే తెలియకపోతే ఉద్యోగులు ఏ ప్రాంతం కోరుకోవాలో స్పష్టతకు రాలేరు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి సమయం ఇవ్వాలన్న యోచనలో ఉన్నతాధికారులున్నట్లు తెలుస్తోంది. గతంలోలా కాకుండా కేవలం రెండ్రోజులు మాత్రమే దరఖాస్తు గడువు ఇవ్వవచ్చన్న అభిప్రాయం ఆ శాఖ వర్గాల నుంచి విన్పిస్తోంది. క్లియర్ వేకెన్సీ లిస్ట్ అడిగారు : డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ జిల్లా వ్యాప్తంగా ‘క్లియర్ వేకెన్సీ’ వివరాలు కావాలని ఉన్నతాధికారుల నుంచి ఈ రోజే (గురువారం) ఆదేశాలు వచ్చాయి. సుమారు 15 కేడర్ల వివరాలు తీస్తున్నాం. సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాకపోవడంతోనే బదిలీల ప్రక్రియ ప్రారంభం కాలేదు. రెండు, మూడ్రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అందుకే లిస్ట్ అడుగుతున్నారనుకుంటా. -
చెప్పిన పని చేయకపోతే అంతే..
సాక్షి, హైదరాబాద్: చెప్పిన పని చెప్పినట్లు చేయని ఉన్నతాధికారులపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ అస్త్రం సంధిస్తోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన పనిని చేయకుండా.. నిబంధనలు అంగీకరించవని చెప్పిన ఏ అధికారి అయినా బదిలీకి సిద్ధపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కారణాలతో వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్.వి.సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడగా.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్)గా ఉన్న జోసఫ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులకు ఇదే పరిస్థితి ఎదురవడం గమనార్హం. బంధువు కాలేజీకి అటానమస్ ఇవ్వనందుకే... వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్.వి.సుబ్రహ్మణ్యాన్ని రాష్ర్టప్రభుత్వం కొన్ని రోజులక్రితం హఠాత్తుగా బదిలీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ బంధువుకు చెందిన గీతం మెడికల్ కాలేజీకి స్వయం ప్రతిపత్తి(అటానమస్) కల్పించేందుకు ఎల్.వి.సుబ్రహ్మణ్యం ససేమిరా అనడమే బదిలీకి ప్రధాన కారణమని సమాచారం. ఇంకా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకుండానే అటానమస్ ఇవ్వడం సాధ్యంకాదని, నిబంధనలు అంగీకరించబోవని ఎల్వీ స్పష్టం చేశారని తెలుస్తోంది. ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీకి ఇప్పుడే అటానమస్ ఇస్తే ఇష్టానుసారం మెడికల్ సీట్లను భర్తీ చేసుకుంటారని, అలాగే ప్రశ్నపత్రాల్నీ వారే ముద్రించుకుంటారనేది, ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేకుండా పోతుందనేది ఎల్.వి.సుబ్రహ్మణ్యం అభిప్రాయంగా ఉంది. అయితే అటానమస్ అంశంపై సీఎం చంద్రబాబు స్వయంగా ఎల్వీతో మాట్లాడారని, అయినప్పటికీ ఆయన ఇవ్వడం సాధ్యమవదని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబమంతా ఎల్.వి.పై ఆగ్రహంతో ఊగిపోయారని సమాచారం. ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఎల్.వి. కొనసాగరాదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యాన్ని అప్రధానమైన యువజన సర్వీసులశాఖకు బదిలీ చేయడం గమనార్హం. తన బదిలీపై ఎల్వీ తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ నేపథ్యంలో యువజన సర్వీసుల పదవిలో చేరకుండా పక్షం రోజులపాటు సెలవుపెట్టారు. జోసఫ్, గిరిధర్లకూ అదే పరిస్థితి.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్)గా ఉన్న జోసఫ్పైనా ప్రభుత్వం ఇటీవల బదిలీ వేటేసింది. పరిశ్రమలస్థాపన పేరుతో పలు జిల్లాల్లో అటవీ భూముల్ని డీనోటిఫై చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ పెద్దలు సూచించగా.. అవసరానికి మించి అటవీభూముల్ని డీనోటిఫై చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. దీంతో సీఎం చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్‌కు ఆగ్రహం వచ్చి.. వెంటనే జోసఫ్‌ను పీసీసీఎఫ్ పదవి నుంచి తప్పించేసినట్టు ఐఏఎస్‌ల్లో చర్చ నడుస్తోంది. మున్సిపల్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గిరిధర్ బదిలీకి కూడా ప్రభుత్వ పెద్దల మాట వినకపోవడమే కారణమంటున్నారు. ఆయన్ను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు వసతి కల్పించారని... సాధారణ పరిపాలన(ప్రొటోకాల్) ప్రత్యేక కార్యదర్శి రమణారెడ్డినీ రాష్ట్ర సర్వీసు నుంచి ఆకస్మాత్తుగా రిలీవ్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఢిల్లీ లో ప్రత్యేకహోదా కోసం ధర్నా చేసిన సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ఏపీ భవన్లో రమణారెడ్డి వసతి సౌకర్యం కల్పించడాన్ని లోకేశ్ జీర్ణించుకోలేకపోయినట్టు సమాచారం. ప్రొటోకాల్ పదవిలో ఎవరున్నా ఏ పార్టీ ఎమ్మెల్యేలకైనా వసతి సౌకర్యం కల్పించడం విధుల్లో భాగం. అయితే లోకేశ్‌కు నచ్చకపోవడంతోనే రమణారెడ్డిని ఆయన సొంత సర్వీసు ఇండియన్ రైల్వేస్‌కు పంపించేసినట్టు తెలుస్తోంది. -
మిగిలేది ముగ్గురే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల ఫీవర్ యంత్రాంగానికి తాకింది. మూడేళ్లు పైబడి జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో పాలనా యంత్రాంగంలో కలవరం మొదలైంది. ఇప్పటివరకు ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులకే బదిలీలను పరిమితం చేసిన ఈసీ.. ఈ సారి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీఓ), సబ్ ఇన్స్పెక్టర్లను కూడా బదిలీల జాబితాలో చేర్చడంతో అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే నెల పదో తేదీ నాటికీ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. మే 31, 2014 నాటికి మూడేళ్లు పూర్తయ్యే అధికారులకు స్థానభ్రంశం కలిగించాలని ఈసీ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని 33 మండలాలకుగాను 30 మండలాల ఎంపీడీఓలపై బదిలీల ప్రభావం పడనుంది.. గండేడ్, రాజేంద్రనగర్, హయత్‌నగర్ మినహా మిగతా మండలాల అభివృద్ధి అధికారులకు స్థానచలనం కలగనుంది. ఊహించని ఈసీ ఆదేశాలతో నివ్వెరపోయిన ఎంపీడీఓల సంఘం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కోరాలని నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలతో తమకు ప్రత్యక్ష సంబంధంలేనందున తమను బదిలీల నుంచి మినహాయించాలని అభ్యర్థించాలని సంకల్పించారు. మరోవైపు మూడేళ్లుగా జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్ల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. -
బదిలీలకు రంగం సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు రావడంతో ఆ ప్రకారం.. జిల్లాలో ఉన్న అధికారుల జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో మొదలైన బదిలీల ప్రక్రియ ఇతర శాఖల్లోనూ కొనసాగనుంది. రెవెన్యూ శాఖ విషయాన్ని పరిశీలిస్తే.. జిల్లాలో మూడు సంవత్సరాలు తహసీల్దార్లుగా పదవీ కాలం పూర్తిచేసుకున్న వారు, జిల్లా స్థానికులు పొరుగు జిల్లాకు బదిలీ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం తహసీల్దార్ కేడర్‌లో జిల్లాలో 64మంది ఉన్నారు. వీరిలో 51మంది మండలాల్లో త హసిల్దార్లుగా పనిచేస్తుండగా మిగతా వారు సూపరింటెండెంట్లు, ఏవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 51మంది తహసిల్దార్లలో పాలకుర్తి, పరకాల, వరంగల్ తహసిల్దార్లు మినహా మిగతా 48మంది జిల్లా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అఫిషియేటింగ్‌పై పనిచేస్తున్న 13మందికి కూడా బదిలీ తప్పనిసరి. వీరితో పాటు ఈ సారి సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న వారికి కూడా బదిలీలు తప్పకపోవచ్చునని తెలుస్తోంది. గతంలో కలెక్టరేట్లోని ‘హెచ్’ విభాగం సూపరింటెండెంట్ పోస్టు మాత్రమే నోటిఫైడ్ పోస్ట్ అయినందున బదిలీ ఉండేది. కానీ, ఈ సారి కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లకు బదిలీలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా అధికారులు అందరి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్నికల సంఘం తదుపరి ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా బదిలీలు ఉంటాయి. రిటర్నింగ్ అధికారులు వీరే... రిటర్నింగ్ అధికారులుగా స్టేషన్ ఘన్‌పూర్‌కు డ్వామా పీడీ, పాలకుర్తికి జడ్పీ సీఈవో, డోర్నకల్‌కు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారి, మహబుబాబాద్, నర్సంపేట, జనగామ, ములుగుకు అక్కడి ఆర్డీవోలు, పరకాలకు ఐటీడీఏ పీవో, వరంగల్ పశ్చిమకు వరంగల్ ఆర్డీవో, వరంగల్ తూర్పుకు మున్సిపల్ కమిషనర్, వర్ధన్నపేటకు ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూపాలపల్లికి అడిషనల్ జారుుంట్ కలెక్టర్ పోస్టుల్లో ఉన్న వారు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. అరుుతే ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న కారణంగా జడ్పీ సీఈవో ఆంజనేయులుకు ఎన్నికల విధులు కేటాయించరు. ఆయన స్థానంలో వచ్చే కొత్త అధికారి ఎన్నికల విధులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఏజేసీగా ఉన్న సంజీవయ్య జిల్లాలో మూడేళ్ల విధులు పూర్తయినందున బదిలీ అవుతారు. ఎస్సార్ఎస్పీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న నూత మధుసూదన్ సొంత జిల్లా కారణంగా బదిలీ అవుతారు. వీరితో పాటు ఐటీడీఏ పీవో పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో ఈ ప్రాంతాలకు కొత్తగా వచ్చే వారు రిటర్నింగ్ అధికారులుగా ఎన్నికల సమయంలో విధులు నిర్వహిస్తారు. -
మార్గదర్శకాలు వచ్చేశాయి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలన వ్యవహారాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొనే అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాలంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వీటిని వెంటనే అమలు చేయాలని సూచించింది. దీంతో ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలో ఉన్న జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఉప ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు మెజిస్ట్రేట్, డిప్యూటీ కలెక్టర్, సబ్ డివిజన్ మెజిస్ట్రేట్, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు స్థాన చలనం కలుగనుంది. అదేవిధంగా పోలీసు శాఖలో రేంజ్ ఐజీలు, డీఐజీలు, ప్రత్యేక ఎస్పీలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సబ్ డివిజినల్ పోలీసు అధికారి, ఇన్స్పెక్టర్లతో సమాన క్యాడర్ కలిగిన పోలీసు అధికారులు కూడా బదిలీ కానున్నారు. మొత్తంగా బదిలీల ప్రక్రియ ఫిబ్రవరి తేదీ 10లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. బదిలీ అయిన అధికారులు ఫిబ్రవరి 11తేదీ కొత్త స్థానాల్లో విధుల్లోకి చేరాల్సిందిగా స్పష్టం చేసింది. మంగళవారం అన్ని జిల్లాలకు మంగళవారం ఈ ఆదేశాలు అందడంతో బదిలీల హడావుడి మొదలైంది. వీరికి బదిలీ తప్పనిసరి.. సొంత జిల్లాలో పనిచేసే అధికారులకు, ఒకే చోట మూడేళ్లకు (31.05.2014 నాటికి) పైబడి పనిచేస్తున్న అధికారులకు బదిలీ తప్పనిసరి. ఒకే జిల్లాలో పదోన్నతి పొందినప్పటికీ మూడేళ్లకు మించి పనిచేస్తున్న అధికారిని కూడా తప్పనిసరిగా బదిలీ చేయాలి. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులపైన కోర్డు పరిధిలో ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండకూడదు. ఒకే సబ్‌డివిజన్‌లో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న ఎస్ఐ(సబ్ ఇన్స్పెక్టర్)లను ఇతర సబ్‌డివిజన్‌కు బదిలీ చేయాలి. అదేవిధంగా సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేసే ఎస్ఐని ఇతర అసెంబ్లీ సెగ్మెంట్‌కు బదిలీ చేయాలి.