సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలన వ్యవహారాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొనే అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాలంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
వీటిని వెంటనే అమలు చేయాలని సూచించింది. దీంతో ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలో ఉన్న జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఉప ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు మెజిస్ట్రేట్, డిప్యూటీ కలెక్టర్, సబ్ డివిజన్ మెజిస్ట్రేట్, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు స్థాన చలనం కలుగనుంది. అదేవిధంగా పోలీసు శాఖలో రేంజ్ ఐజీలు, డీఐజీలు, ప్రత్యేక ఎస్పీలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సబ్ డివిజినల్ పోలీసు అధికారి, ఇన్‌స్పెక్టర్‌లతో సమాన క్యాడర్ కలిగిన పోలీసు అధికారులు కూడా బదిలీ కానున్నారు.
మొత్తంగా బదిలీల ప్రక్రియ ఫిబ్రవరి తేదీ 10లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. బదిలీ అయిన అధికారులు ఫిబ్రవరి 11తేదీ కొత్త స్థానాల్లో విధుల్లోకి చేరాల్సిందిగా స్పష్టం చేసింది. మంగళవారం అన్ని జిల్లాలకు మంగళవారం ఈ ఆదేశాలు అందడంతో బదిలీల హడావుడి మొదలైంది.
వీరికి బదిలీ తప్పనిసరి..
సొంత జిల్లాలో పనిచేసే అధికారులకు, ఒకే చోట మూడేళ్లకు (31.05.2014 నాటికి) పైబడి పనిచేస్తున్న అధికారులకు బదిలీ తప్పనిసరి. ఒకే జిల్లాలో పదోన్నతి పొందినప్పటికీ మూడేళ్లకు మించి పనిచేస్తున్న అధికారిని కూడా తప్పనిసరిగా బదిలీ చేయాలి.
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులపైన కోర్డు పరిధిలో ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండకూడదు.
ఒకే సబ్‌డివిజన్లో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న ఎస్‌ఐ(సబ్ ఇన్‌స్పెక్టర్)లను ఇతర సబ్‌డివిజన్‌కు బదిలీ చేయాలి. అదేవిధంగా సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేసే ఎస్‌ఐని ఇతర అసెంబ్లీ సెగ్మెంట్‌కు బదిలీ చేయాలి.
మార్గదర్శకాలు వచ్చేశాయి..
Published Wed, Jan 22 2014 1:19 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement