సాక్షి, హైదరాబాద్: చెప్పిన పని చెప్పినట్లు చేయని ఉన్నతాధికారులపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ అస్త్రం సంధిస్తోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన పనిని చేయకుండా.. నిబంధనలు అంగీకరించవని చెప్పిన ఏ అధికారి అయినా బదిలీకి సిద్ధపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కారణాలతో వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్.వి.సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడగా.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్)గా ఉన్న జోసఫ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులకు ఇదే పరిస్థితి ఎదురవడం గమనార్హం.
బంధువు కాలేజీకి అటానమస్ ఇవ్వనందుకే...
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్.వి.సుబ్రహ్మణ్యాన్ని రాష్ర్టప్రభుత్వం కొన్ని రోజులక్రితం హఠాత్తుగా బదిలీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ బంధువుకు చెందిన గీతం మెడికల్ కాలేజీకి స్వయం ప్రతిపత్తి(అటానమస్) కల్పించేందుకు ఎల్.వి.సుబ్రహ్మణ్యం ససేమిరా అనడమే బదిలీకి ప్రధాన కారణమని సమాచారం. ఇంకా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకుండానే అటానమస్ ఇవ్వడం సాధ్యంకాదని, నిబంధనలు అంగీకరించబోవని ఎల్వీ స్పష్టం చేశారని తెలుస్తోంది. ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీకి ఇప్పుడే అటానమస్ ఇస్తే ఇష్టానుసారం మెడికల్ సీట్లను భర్తీ చేసుకుంటారని, అలాగే ప్రశ్నపత్రాల్నీ వారే ముద్రించుకుంటారనేది, ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేకుండా పోతుందనేది ఎల్.వి.సుబ్రహ్మణ్యం అభిప్రాయంగా ఉంది.
అయితే అటానమస్ అంశంపై సీఎం చంద్రబాబు స్వయంగా ఎల్వీతో మాట్లాడారని, అయినప్పటికీ ఆయన ఇవ్వడం సాధ్యమవదని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబమంతా ఎల్.వి.పై ఆగ్రహంతో ఊగిపోయారని సమాచారం. ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఎల్.వి. కొనసాగరాదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యాన్ని అప్రధానమైన యువజన సర్వీసులశాఖకు బదిలీ చేయడం గమనార్హం. తన బదిలీపై ఎల్వీ తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ నేపథ్యంలో యువజన సర్వీసుల పదవిలో చేరకుండా పక్షం రోజులపాటు సెలవుపెట్టారు.
జోసఫ్, గిరిధర్‌లకూ అదే పరిస్థితి.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్)గా ఉన్న జోసఫ్‌పైనా ప్రభుత్వం ఇటీవల బదిలీ వేటేసింది. పరిశ్రమలస్థాపన పేరుతో పలు జిల్లాల్లో అటవీ భూముల్ని డీనోటిఫై చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ పెద్దలు సూచించగా.. అవసరానికి మించి అటవీభూముల్ని డీనోటిఫై చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. దీంతో సీఎం చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్‌కు ఆగ్రహం వచ్చి.. వెంటనే జోసఫ్‌ను పీసీసీఎఫ్ పదవి నుంచి తప్పించేసినట్టు ఐఏఎస్‌ల్లో చర్చ నడుస్తోంది. మున్సిపల్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గిరిధర్ బదిలీకి కూడా ప్రభుత్వ పెద్దల మాట వినకపోవడమే కారణమంటున్నారు. ఆయన్ను ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా బదిలీ చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు వసతి కల్పించారని... సాధారణ పరిపాలన(ప్రొటోకాల్) ప్రత్యేక కార్యదర్శి రమణారెడ్డినీ రాష్ట్ర సర్వీసు నుంచి ఆకస్మాత్తుగా రిలీవ్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ లో ప్రత్యేకహోదా కోసం ధర్నా చేసిన సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఏపీ భవన్‌లో రమణారెడ్డి వసతి సౌకర్యం కల్పించడాన్ని లోకేశ్ జీర్ణించుకోలేకపోయినట్టు సమాచారం. ప్రొటోకాల్ పదవిలో ఎవరున్నా ఏ పార్టీ ఎమ్మెల్యేలకైనా వసతి సౌకర్యం కల్పించడం విధుల్లో భాగం. అయితే లోకేశ్‌కు నచ్చకపోవడంతోనే రమణారెడ్డిని ఆయన సొంత సర్వీసు ఇండియన్ రైల్వేస్‌కు పంపించేసినట్టు తెలుస్తోంది.