సాక్షి, అమరావతి: వైద్య సేవల్లోనూ కోట్లు తినేసిన అవినీతి రాబందుల రెక్కలు విరిగే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాల నిర్వహణ పేరుతో మొత్తం రూ.200 కోట్లు కొల్లగొట్టడానికి జరిగిన భారీ స్కామ్ వెనుక సూత్రధారులుగా ఉన్న గత ప్రభుత్వ పెద్దల అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం బెంగళూరుకు చెందిన ఒక సంస్థను తెర మీదకు తెచ్చి టెండర్లు కట్టబెట్టిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల అక్రమాలు ఆధారాలతో సహా బట్టబయలు కానున్నాయి. ఈ స్కామ్‌పై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇందుకూరి వెంకట రామరాజు ఫిర్యాదు మేరకు సెక్షన్–420, 406, 477 కింద 07/2021 నంబర్‌తో సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారుల డైరెక్షన్‌లోనే ఈ మొత్తం అవినీతి వ్యవహారం సాగినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
అవినీతి కథ ఇలా..
41–11–2015
► టీబీఎస్ ఇండియా టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ సంస్థకు ఏడాది కాలానికి టెండర్ ఖరారు చేస్తూ గత ప్రభుత్వం జీవో నంబర్ 660 ఇచ్చింది. దీనిలో భాగంగా 13 జిల్లాల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లోని పరికరాల నిర్వహణ సేవల బాధ్యతలను చంద్రబాబు సర్కార్ ఆ సంస్థకు అప్పగించింది.
27–11–2017
► ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కీలక అధికారులతోపాటు వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ఉన్న జితేంద్రశర్మతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 703 జారీ చేసింది. అధికారులను సంప్రదించకుండా బయటి వ్యక్తిగా ఉన్న జితేంద్రశర్మ ద్వారా బెంగళూరు సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం వెనుక చంద్రబాబు, కామినేని ప్రయోజనాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.
18–12–2017
► ఈ వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇందుకూరి వెంకట రామరాజు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎటువంటి విచారణ జరగకుండా ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్, డైరెక్టర్‌గా ఉన్న శంకబ్రతబాగీ్చలపై చంద్రబాబు ప్రమేయంతో కొందరు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకోకుండానే ఆ ఆరోపణలు నిజం కాదని తేల్చింది.
23–4–2018
► దీనిపై వెంకట రామరాజు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదించాలంటూ ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
31–7–2019
► వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్టులో అవకతవకలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
14–10–2019
► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం.. హైకోర్టు తీర్పు, ఏసీబీ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ, అందుకు సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖకు నివేదించారు.
4–3–2020
► టీబీఎస్ ఇండియా టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థపైన, బాధ్యులపైన, వైద్య ఆరోగ్య శాఖ అధికారులపైన కేసు పెట్టాలంటూ సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.
సెప్టెంబర్ 2020
► వైద్య పరికరాల నిర్వహణలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ప్రాథమిక నిర్ధారణతో కాంట్రాక్టు సంస్థ ఒప్పందాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది.
12–2–021
► కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అనిల్‌కుమార్ సింఘాల్ సీఐడీని కోరారు. దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం అవినీతి, అక్రమాలపై నిర్ధారణకు వచ్చిన సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
టెండర్ ఖరారు నుంచే అక్రమాలు..
బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియా టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ సంస్థకు టెండర్ ఖరారు కట్టబెట్టడం నుంచే అక్రమాలు కొనసాగాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాల నిర్వహణకు ఆ సంస్థకు ఏడాదిపాటు కాంట్రాక్టును అప్పగిస్తూ 2015లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా దాన్ని ఐదేళ్లపాటు కొనసాగించారు. టెండరు దక్కించుకున్న సంస్థ.. ఉపకరణాల విలువను మార్కెట్ ధరల కంటే ఎన్నో రెట్లు అమాంతంగా పెంచేసి మోసానికి పాల్పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరికరాల మొత్తం విలువ రూ.300 కోట్లు లోపే ఉంటుంది. అయితే దాన్ని ఏకంగా రూ.508 కోట్లుగా చూపించి.. ఆ మొత్తానికి 7.45 శాతం చొప్పున నిర్వహణ సేవల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇందుకోసం ఆ సంస్థకు ఏడాదికి రూ.38.22 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించిన ఐదేళ్ల కాంట్రాక్టులో భాగంగా తొలి ఏడాదిలో చెల్లించిన రూ.38.22 కోట్లకు అదనంగా ఏటా పది శాతం చొప్పున పెంచి నిర్వహణ సేవల మొత్తాన్ని చెల్లించారు. ఇలా ఐదేళ్లలో రూ.200 కోట్లకుపైగా ఆ సంస్థ బిల్లులు పెట్టగా.. గత సర్కారు రూ.100 కోట్లకుపైగా చెల్లించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment