సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అమరావతి భూదోపిడీలో కొత్త కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు చెందిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించారన్నది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టానికి విరుద్ధంగా జీఓ–41 జారీకి ఆ ద్వయం బరితెగించి మరీ వ్యవహరించింది. అందుకోసం ఏకంగా కేబినెట్‌కు తెలియకుండా.. సీఆర్‌డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ దోపిడీకి వారిద్దరూ కుట్ర పన్నారు.
కేబినెట్ ఆమోదం లేకుండా.. సీఆర్‌డీఏ చట్టానికి విరుద్ధంగా జీఓ–41ను జారీచేశారని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వరని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి.. ఆ తర్వాత తమ బినామీల ద్వారా వాటిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తూ సేల్‌డీడ్ల ద్వారా రిజిస్టర్ చేయించుకునేందుకు దరఖాస్తు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని తెలిసికూడా దరఖాస్తు చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి ఉంది.
సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తూ నెంబర్ కేటాయించిన తర్వాత ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని బుకాయిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు.. టీడీపీ నేతల ఒత్తిడితో ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని సీఆర్డీఏ అధికారులు గుర్తించి టీడీపీ నేతలు, వారి బినామీ పేర్లను సీఆర్టీఏ రికార్డుల్లో నమోదుచేసి ప్యాకేజీ ప్రకటించారు. భూములన్నీ తమ హస్తగతమయ్యాక అసైన్డ్ భూములకూ భూసమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ జీఓ–41ను టీడీపీ ప్రభుత్వం జారీచేసింది. ఈ కుట్ర ద్వారా 950 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ భూదోపిడీకి మూలమైన జీఓ–41 జారీ వెనుక అసలు కుట్ర తాజాగా బయటపడింది.
కేబినెట్ ఆమోదం లేకుండానే జీఓ..
అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు ఈ జీఓ–41 జారీచేయడం వెనుకనున్న కుట్ర కోణం సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి.. రాజధాని అమరావతి ఏర్పాటుకోసం చంద్రబాబు ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం సీఆర్‌డీఏ పరిధిలో భూవ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కానీ, అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టం–1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీఓ–41ను తీసుకొచ్చింది.
అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్‌లో చర్చించకుండానే ఏకపక్షంగా జీఓ–41ను అడ్డదారిలో జారీచేసేసింది. ఎందుకంటే కేబినెట్‌లో తీర్మానం చేయాలంటే అందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే కేబినెట్‌ను బైపాస్ చేసి జీఓ జారీచేసింది. తద్వారా.. మంత్రివర్గం ఆమోదంతోనే భూవ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సీఆర్‌డీఏ చట్టాన్ని సైతం ఉల్లంఘించింది.
నారా, నారాయణే కుట్రదారులు..
ఇక నిబంధనలకు విరుద్ధంగా జీఓ–41ను అప్పటి పురపాలక–సీఆర్‌డీఏ శాఖ మంత్రి పి.నారాయణ 2016, ఫిబ్రవరి 29న ఆమోదించారు. అనంతరం 2016, మార్చి 22న సీఎం హోదాలో చంద్రబాబు పోస్ట్–ఫాక్టో–రాటిఫికేషన్ చేసి మరీ ఆమోదించారు. అంటే.. అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు జీఓ–41 కుట్ర పూర్తిగా చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే సాగింది. ఈ కీలక అంశాలను అప్పటి ఉన్నతాధికారులు సిట్ దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం.
ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్‌డీఏ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. అసైన్డ్ చట్టానికి విరుద్ధమైనప్పటికీ చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీఓ–41 జారీచేయాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. అలా జారీచేసిన జీఓ–41తో అమరావతి పరిధిలోని 950 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. తమ భూదాహం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల పొట్టకొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment