మాట్లాడుతున్న మంత్రి విడదల రజిని, పక్కన వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి ఎయిమ్స్‌కు చుక్కలు చూపించారని, ఆ సంస్థ అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అయినా ఆనాడు ఈనాడుకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఎయిమ్స్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, అయినా ఈనాడు రామోజీరావు దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి సోమవారం మంగళగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏదైనా సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు మంచి నీరు, కరెంటు, రోడ్లు, డ్రెయినేజీ లాంటి మౌలిక వసతులు కల్పిస్తారని, గత టీడీపీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు. 2014 – 19 మధ్య కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ ఏర్పాటుకు భవనాలు నిర్మిస్తుంటే అప్పటి సీఎం చంద్రబాబు అటువైపు కన్నెత్తి చూడలేదని చెప్పారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిమ్స్‌కు సరిపడా మంచి నీరందించేందుకు తాత్కాలికంగా చేయాల్సిందంతా చేస్తూనే, శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోజుకు మూడు లక్షల లీటర్ల నీరు కావాలని ఎయిమ్స్ నుంచి మొదట్లో అభ్యర్థన వచ్చిందన్నారు.
ఆమేరకు రోజుకు 3.20 లక్షల లీటర్ల నీటిని మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. మరో లక్ష లీటర్ల నీటిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఎయిమ్స్ విస్తరణలో భాగంగా రోజుకు అదనంగా మరో 3 లక్షల లీటర్లు అవసరమని కోరగా, ఈ నీటిని విజయవాడ కార్పొరేషన్ నుంచి అదనంగా అందజేస్తున్నామన్నారు.
అందుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఎయిమ్స్ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంలో భాగంగా రూ. 7.74 కోట్లతో ఆత్మకూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి రోజుకు 25 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచామన్నారు. ఇందుకు జూలై 26న జీవో నం.534 విడుదల చేశామన్నారు. అతి త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.
విద్యుత్ సరఫరాకు రూ. 35 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఎయిమ్స్‌కు జాతీయ రహదారి నుంచి, మంగళగిరి నుంచి నేరుగా రెండు ప్రధాన రహదారులు నిర్మించామన్నారు. సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు రూ.10 కోట్లకు పైనే ఖర్చయిందన్నారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు.
2014–19 మధ్య ఎయిమ్స్‌కు చుక్కలు చూపిన బాబు సర్కార్‌పై ఒక్క వార్త కూడా రాయని రామోజీరావు... తమ ప్రభుత్వం మంచి చేస్తున్నా అబద్ధాలు రాయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment