
కడప అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగంలో ఎంతో మేలు చేస్తున్నా.. చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. ఆమె గురువారం కడప రిమ్స్‌లో ప్రాంతీయ జిల్లాల వైద్యాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య రంగంలో నూతన ఒరవడి తీసుకొచ్చారన్నారు.
తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగంలో సమూలంగా మార్పులను తీసుకొచ్చి ఎన్నడూ లేనివిధంగా వైద్యరంగంలో విశేష అభివృద్ధి చేపడుతున్నారని చెప్పారు. కొత్త జిల్లాల్లో ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణాలను ప్రారంభించి, వేగంగా పనులను చేయిస్తున్న ఘనత జగనన్న ప్రభుత్వానిదేనన్నారు. వైద్యరంగంలో గతంలో ఎన్నడూ చేపట్టని విధంగా వైద్యుల దగ్గరి నుంచి వివిధ స్థాయి ఉద్యోగుల వరకు కాంటాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను మొత్తం 44,760 మందిని నియమించారని చెప్పారు.
డాక్టర్ వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లను ప్రవేశపెడితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 3,255 ప్రొసీజర్లను ప్రవేశపెట్టారన్నారు. ఇవేమీపట్టని చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు వైద్యరంగంలోని మార్పులను స్వాగతించడంపోయి బురదజల్లే ప్రయత్నం చేయడం సమంజసం కాదని చెప్పారు. రాయలసీమ జిల్లాలకు చెందిన చంద్రబాబు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదిశగా ఏనాడూ కృషి చేయలేదన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతానికి న్యాయరాజధాని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే విమర్శించడం తగదన్నారు. ఫోర్జరీ చేసిన టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడం చట్టపరంగా తీసుకునే చర్యల్లో భాగమేనని చెప్పారు. విశాఖగర్జనలో మంత్రులపై దాడిని సమర్ధించే విధంగా చంద్రబాబు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.