అందర్నీ మార్చేయండి
- రెవెన్యూశాఖ బదిలీల్లో అధికార పార్టీ నేతల జోక్యం
- ఉద్యోగవర్గాల మండిపాటు
- సిఫారసు లేఖలను పట్టించుకోని కలెక్టర్
అనంతపురం అర్బన్ : జిల్లాలో అధికార పార్టీ ముఖ్య నాయకులు రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పిట్లో ఉంచుకుని అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు సాగించాలని చూస్తున్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో వారు చెప్పినట్లు చేసే సిబ్బందిని నియమించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఆ దిశగా కలెక్టర్‌కు లేఖలు రాశారు. అందులోనూ అనంతపురం ఎంపీ నియోజకవర్గం నుంచి ఒక ప్రజాప్రతినిధి, హిందూపురం ఎంపీ నియోజకవర్గం నుంచి మరో ప్రజాప్రతినిధి మరీ దారుణంగా వారి పరిధిలోని మూడు మండలాల తహసీల్దారు కార్యాలయాల్లో అటెండర్ మొదలు అధికారి వరకు అందరినీ మార్చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది.
అదే విధంగా తాము సూచించిన వ్యక్తులను నియమించాలని కోరినట్లు సమాచారం. ఈ లేఖలపై ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. సక్రమంగా పని చేయని సిబ్బందిపై ఫిర్యాదు చేయడాన్ని తాము కూడా స్వాగతిస్తామని, కానీ ఏకంగా తహసీల్దారు కార్యాలయాల్లో అటెండర్ మొదలు సిబ్బందిని మొత్తం మార్చాలని లేఖలు పంపడం ఏమిటని ఆగ్రహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ లేఖలను కలెక్టర్ పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టినట్లు తెలిసింది.