బదిలీలు.. ప్రభుత్వ వ్యవహారం- సీఎం
బెంగళూరు: పరప్పన అగ్రహార జైలులో అవినీతి బయటకు రావడం, ఐపీఎస్ బదిలీల నుంచి దృష్టి మళ్లించడానికే జెండా తతంగమని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు. పరిపాలన కోసమే బదిలీ చేశామని, ఏ అధికారిని ఎక్కడికి, ఏ సమయంలో బదిలీ చేయాలో ప్రభుత్వానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. అందులో ప్రతిపక్షాలు తల దూర్చడమేంటని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్ర జెండాకు రాజ్యాంగబద్దత కల్పించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సీఎం సమర్ధించుకున్నారు. బుధవారం ఆయన రాష్టానికి చెందిన సివిల్స్ ర్యాంకర్లను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక జెండా తేవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ జెండాను అవమానిస్తోందని బీజేపీ, జేడీఎస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. జాతీయ జెండాకు ఎటువంటి అవమానం కలిగించకుండానే దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించకుండానే రాష్ట్ర పతాకానికి రాజ్యాంగ బద్దత కల్పించాడానికి ప్రయత్సిస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ విమర్శించారు. రాష్ట్రాలకు ప్రత్యేక జెండా ఉండకూడదంటూ లేదా ఉండాలంటూ రాజ్యాంగంలో కూడా ఎక్కడ ప్రస్తావించలేదన్నారు.
‘అన్ని రాష్ట్లాల్లోనూ జాతీయ గీతం ఆలపించడానికి ముందు ఆయా రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారు. దీని వల్ల జాతీయ గీతానికి ఎటువంటి అవమానం కలగదు. అదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక జెండా కలిగి ఉండడం జాతీయ జెండాను ఎలా అవమానించినట్లువుతుంది' అని సీఎం ప్రశ్నించారు. సీనియర్ సాహితీవేత్త పాటిల్ పుట్టప్ప సలహా మేరకు రాష్ట్ర జెండాకు రాజ్యాంగబద్దత కల్పించడానికి ఎదురయ్యే చిక్కులు తదితర అంశాలపై నివేదికలు అందించడానికి సీనియర్ సాహితీవేత్తలతో సమితిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సమితి తమకు నివేదికలు అందించిన అనంతరం సాదకబాధలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.